ఆధిపత్యం కోసం.. | The invisible hand behind protests | Sakshi
Sakshi News home page

ఆధిపత్యం కోసం..

Published Wed, Mar 4 2015 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

The invisible hand behind protests

ఆందోళనల వెనుక అదృశ్య హస్తం
 
అధ్యాపక నియామకాల్లో అవకతవకలు లేవంటున్న అధికారులు
అధికారులకు అండగా నిలిచిన అసోసియేషన్లు
ముఖ్యమంత్రిని కలిసేందుకు రాజధానికి పాలకమండలి

 
యూనివర్సిటీక్యాంపస్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంపై ఆధిపత్యం కోసం తెరవెనుక పోరు కొనసాగుతోంది. రెండున్నర సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉన్న వర్సిటీలో మూడు రోజులుగా ఆందోళనలు సాగుతున్నాయి. మహిళా యూనివర్సిటీలో మూడు రోజుల క్రితం అధ్యాపక నియామక ఉత్తర్వులు ఇచ్చారు. నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ అప్పటినుంచి తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్‌ఎస్‌ఎఫ్) ఆందోళనలు చేస్తోంది. ఈ వ్యవహారం మొత్తం ఆధిపత్యం కోసమే జరుగుతోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 43 అధ్యాపకుల పోస్టుల భర్తీకోసం 2013 డిసెంబర్ 22న నోటిఫికేషన్ విడుదలైయింది. వీటిలో 18 అసిస్టెంట్, 12 ప్రొఫెసర్, 13 అసోసియేట్ పోస్టులున్నాయి. వీటి భర్తీకోసం 2014 మార్చిలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే అనంతరం పాలకమండలి సమావేశం జరగకపోవడంతో నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. ఎట్టకేలకు ఫిబ్రవరి 28న పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోస్టుల భర్తీకి పాలకమండలి ఆమోదం తెలిపింది. దీంతో అధికారులు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నియామకాలను తప్పుబడుతూ కేవలం  టీఎన్‌ఎస్‌ఎఫ్ మాత్రమే ఆందోళనకు దిగింది.  ఈ ఆందోళన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చేస్తున్నారని మహిళా యూనివర్సిటీ సిబ్బంది చెబుతున్నారు.
 
ఎలాంటి అక్రమాలు లేవు

నియామకాలపై ఆందోళనలు జరుగుతున్న నేపధ్యంలో వీసీ రత్నకుమారి ఆదివారం టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులతో చర్చలు జరిపారు. నియామక ప్రక్రియ పారదర్శకంగా జరిపామని ఎలాంటి అక్రమాలు చేయలేదని వివరించే ప్రయత్నం చేశారు. అయితే టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు సంతృప్తి చెందలేదు. నియామక ప్రక్రియ మొత్తం నిబంధనల మేరకు జరిపామని వీసీ రత్నకుమారి మీడియాకు వివరించారు. యూనివర్సిటీ అభివృద్ధికోసం రెండన్నర సంవత్సరాలుగా ఎంతో అభివృద్ధి చేశామని అందులోభాగంగానే అధ్యాపక పోస్టుల భర్తీని పారదర్శకంగా చేశామని ఆమె ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మీడియాకు వివరించారు.
 
వీసీకి మద్దతు తెలిపిన సంఘాలు

శ్రీపద్మావతి మహిళా వర్సిటీలోని బోధన, బోధనేతర సంఘాలు వీసీ రత్నకుమారికి మద్దతుగా నిలిచాయి. వీసీ రత్నకుమారి పనిచేసిన కాలంలో వర్సిటీ అభివృద్ధికోసం ఎంతో పాటుపడ్డారని, అందులో భాగంగానే అధ్యాపక నియామకాలను పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా చేశారని చెబుతున్నారు. యూనివర్సిటీకి ఎంతో అభివృద్ధి చేస్తున్న వీసీ పట్ల అసత్య ఆరోపణలు చేయవద్దని పై రెండు సంఘాలు టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థినాయకులు శాంతియుతంగా సమన్వయంతో వ్యవహరించాలని కోరుతున్నారు. వర్సిటీ వాతావరణాన్ని కలుషితం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

రాజధానికి అధికారులు

శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో అధ్యాపక నియామకాలకు సంబంధించిన విషయాలను వివరించేందుకు వీసీ రత్నకుమారి, రిజిస్ట్రార్ పి.విజయలక్ష్మీలు హైదరాబాద్‌కు వెళ్లారు. నియామకాలకు సంబంధించిన అన్ని రికార్డులతో వారు ఉన్నతాధికారులను కలసి ఏమి జరిగిందో వివరించనున్నారు. ఉ న్నత విద్యాశాఖా అధికారులను బుధవారం కలవనున్నారు. అధ్యాపక నియామకాలకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులకు వివరిస్తామని రిజిస్ట్రార్ విజయలక్ష్మి సాక్షికి తెలిపారు. వాస్తవ పరిస్థితులను వివరిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement