‘వేద’గిరి.. జ్ఞాపకాల సిరి | '.. The memories Siri vedagiri | Sakshi
Sakshi News home page

‘వేద’గిరి.. జ్ఞాపకాల సిరి

Published Sun, Aug 3 2014 5:29 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

‘వేద’గిరి.. జ్ఞాపకాల సిరి

‘వేద’గిరి.. జ్ఞాపకాల సిరి

  •      పవిత్ర విద్య నేర్చుకున్నామన్న వేద విద్యార్థులు
  •      టీటీడీ కన్నబిడ్డల్లా ఆదరించిందని ఆనందం
  •      వేదపట్టాలతో సొంతూర్లకు పయనం
  • సాక్షి, తిరుమల :  ఎక్కడో పుట్టారు. మరెక్కడో పెరిగారు. వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల కొండెక్కారు. ప్రకృతి సుందర ప్రదేశంలో వేదగిరి గురుకులంలో కలిసారు. ధార్మికమైన వేద విద్య నేర్చుకునేందుకు శ్రీకారం చుట్టారు. సహజ జీవనశైలికి దూరంగా గడిపారు. కట్టుబాట్ల నడుమ ఎనిమిదేళ్లు కలసికట్టుగా వేద విద్యను అభ్యసించారు. గురువులను మెప్పించారు. పట్టాను చేతపట్టారు. రెక్కలు వచ్చిన పక్షుల్లా సాధారణ జీవన ప్రపంచంలోకి అడుగిడారు.

    సొంత ఇంటికన్నా.. తమను కన్నబిడ్డల్లా చూసుకున్న టీటీడీ యాజమాన్యం, పాఠశాల అధ్యాపక బృందానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలోని టీటీడీ వేద పాఠశాలలో వేదం(పన్నెండేళ్లు), ఆగమ, స్మార్థ, ప్రబంధం (ఎనిమిదేళ్లు) కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు శనివారం సొంత ఊర్లకు ప్రయాణమయ్యారు. గురుకుల విద్యాబోధనలో తమ అనుభవాలను, జ్ఞాపకాలను, గుర్తులను నెమరవేసుకున్నారు. కేకులు కట్ చేశారు.
     
    లడ్డూలు, స్వీట్లు సహచర చిన్నారులకు పంచిపెట్టారు. తల్లిదండ్రుల కంటే మిన్నగా తమ గురువులు తోడుంటూ వేదాలను నేర్పించారని కొనియాడారు. కటిక పేదరికంలో ఉన్న తమకు ఎలాంటి కష్టం రాకుండా కంటికి రెప్పలా చూసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. వేదపాఠశాలకు ఏడుస్తూనే వచ్చామని, వెళ్లేటప్పుడు కూడా ఏడుస్తూనే వెళుతున్నామని ఆనందబాష్పాలు రాల్చారు. తమ గురువులు నేర్పిన వేదాలతో భారతీయ సంస్కృతిని ప్రపంచం మొత్తం వ్యాపింపజేస్తామన్నారు. వేదవిద్యను నేర్పించడమే కాకుండా నగదు బహుమతి ఇచ్చిన టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
     
     గురువుల ప్రోత్సాహం మరువలేం

     మాది చాలా పేద కుటుంబం. నాకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు నాన్న  కాలం చెందారు. అమ్మ కూలి పనులకు వెళుతుంది. బంధువుల సహకారంతో వేదాలు నేర్చుకోవాలని తిరుమలకు వచ్చాను. వేదంలోని శ్రీపాంచరాత్ర ఆగమాన్ని ఎనిమిది సంవత్సరాలు అభ్యసించాను. గురువుల ప్రోత్సాహం, ప్రిన్సిపల్ సహకారం మరువలేం.
     -ఎం.శ్రీనివాసచార్యులు, మార్కాపురం, ప్రకాశం జిల్లా
     
     వేదం కన్నా గొప్ప చదువులేదన్నారు

     అక్క ఎంఏ, అన్నయ్య ఇంజినీరింగ్ చదివారు. వేదం కన్నా గొప్ప చదువులేదని నాన్న చెప్పారు. ఆ ఉద్ధేశంతో నన్ను వేదపాఠశాలలో చేర్పిం చారు. ఎనిమిది సంవత్సరాలు కుటుంబానికి దూరంగా పాఠశాలలోనే ఉంటూ పవిత్రమైన వేద విద్యను నేర్చుకున్నారు. ఏమీతెలియని వయసులో వచ్చి అనేక గొప్ప విషయాలు నేర్చుకుని వెళుతున్నాను.
     - కే.భార్గవాచార్యులు, మెట్లపల్లి, కరీంనగర్ జిల్లా
     
     టీటీడీకి కృతజ్ఞతలు
     కటిక పేదరికంలో ఉన్న నాకు చదువుకోవటానికి అవకాశమిచ్చి, ఎటువంటి కష్టాన్ని రానివ్వకుండా చూసుకున్నారు. నిద్రలేచినపుడు వాడే బ్రష్ నుంచి నిద్రపోయేప్పుడు వాడే బెడ్‌షీట్ వరకు అన్ని వసతులను ఏర్పాటు చేశారు. ఎనిమిదేళ్ల పాటు శైవాగమాన్ని నేర్చుకున్నారు. ప్రజలకు వేదాలపై మరింత గౌరవం పెరిగేలా కృషిచేస్తాను. టీటీడీకి కృత జ్ఞతలు.
     - కే.గణేష్ శర్మ, కోటఉరట్ల, విశాఖపట్నం
     
     నా తండ్రి లక్ష్యాన్ని నెరవేర్చాను
     వేదాలు నేర్చుకుని భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలన్నది నా తండ్రి సంకల్పం. నన్ను ఈ వేద పాఠశాలలో చేర్చిన నాలుగు సంవత్సరాలకు నాన్న చనిపోయారు. ఆయన లక్ష్యాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో శ్రీవైష్ణవ ఆగమాన్ని పూర్తిస్థాయిలో అభ్యసించాను. నా సోదరుడు కూడా ఇక్కడే స్టోర్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు.
     -పీ.సత్యనారాయణ, ఉత్తనూరు, మహబూబ్‌నగర్ జిల్లా
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement