రాజధాని పేరుతో ‘రియల్’ వ్యాపారం
ముఖ్యమంత్రి, మంత్రులదీ అదే దారి
{పభుత్వం ప్రజల కష్టాలను గాలికి వదిలేసింది
ఉత్తరాంధ్రలో హుద్‌హుద్ తుపాను నష్టాలు
రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరువు కష్టాలు
తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ప్రజలు
‘సాక్షి’తో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు: ప్రజల కష్టాలను గాలికొదిలి ముఖ్యమంత్రి, మంత్రులు రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో వరద, హుదుహుద్ తుపాను బీభత్సానికి ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. వారికి ప్రభుత్వ సహాయ సహకారాలు అందలేదన్నారు. రాయలసీమతోపాటు ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కరువు తాండవిస్తోందన్నారు. చిత్తూరు జిల్లాలో సాగునీటి సంగతి దేవుడెగురు తాగునీటి కోసం ప్రజలు నానాపాట్లు పడుతున్నారన్నారు.
చిత్తూరు ప్రజల దాహార్తి తీర్చేందుకు వై.ఎస్. రాజశేఖరరెడ్డి చేపట్టిన హంద్రీనీవా ప్రాజెక్టు నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ చూపలేదని విమర్శించారు. హంద్రీ నీవా పూర్తికాకుండా జిల్లా వాసులకు తాగునీరు అందే పరిస్థితి లేదని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు వ్యవసాయ రుణాలతో పాటు, బంగారం రుణాలను మాఫీ చేస్తానని హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిని తుంగలో తొక్కి రైతులను, మహిళలను వంచించార ని పెద్దిరెడ్డి విమర్శించారు. లక్షా రెండువేల కోట్ల రుణాలుంటే బడ్జెట్‌లో కేటాయించింది రూ.5 వేల కోట్లు మాత్రమేనన్నారు. తొలి దఫాలో రూ.4 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని ఆయన విమర్శిం చారు. ఈ మొత్తానికి 14 వేల కోట్లు వడ్డీ అవుతుందన్నారు. రెండవ విడత మాఫీ నాటికి వడ్డీ రూ.30 వేల కోట్లకు చేరుకుంటుందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చేది వడ్డీలో 25 శా తం కూడా కాదని పెద్దిరెడ్డి విమర్శించారు. గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలన రైతులు, మహిళలపై ఎలాంటి దుష్పప్రభావం చూపిందో ఇప్పుడు అంతకుమించిన విధంగా ఉందని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు రాజధాని పేరుతో సంవత్సరానికి ఐ దు పంటలు పండే భూములను దౌర్జన్యంగా లా క్కుంటున్నారని ఆయన విమర్శించారు.
సింగపూర్, మలేషియా పేర్లు చెప్పి అధికార పార్టీ నేతలు రియల్ వ్యాపారంతో కోట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారన్నా రు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇతర దేశాలు పర్యటిస్తే ఇక్కడ రాజధాని ఏర్పడదన్నారు. అలాగే కరువు పోదన్నారు. మంచినీటి కష్టాలు తీరవన్నారు. తుపానులో దెబ్బతిన్న భూములు బాగుపడవన్నా రు. బాగుపడేదంతా రాజధాని పేరుతో రియల్ వ్యాపారం చేస్తున్న దేశం నేతలేనని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ పరిస్థితే కొనసాగితే రెండు మూడు సంవత్సరాలకు మించి ఈ ప్రభుత్వం కొనసాగే అవకాశం లేదని తేల్చి చెప్పారు.