గుంటూరు సిటీ: రాజధానిపై పచ్చచొక్కాల రియల్టర్లు చక్కర్లు కొడుతున్నారని వైఎస్సార్‌సీపీ తాడికొండ నియోజకవర్గ నేత కత్తెర సురేష్ ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజధాని ముసుగులో ప్రభుత్వమే నేరుగా రియల్ దందా చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికే అక్కడి రైతులను మోసం చేసి పచ్చని పొలాలు కాజేసిన ప్రభుత్వం తాజాగా రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లోని ఇళ్లను సైతం ఖాళీ చేయించే దిశగా కసరత్తు మొదలెట్టిందని ఆరోపించారు.
నమ్మి ఓట్లేసినందుకు నట్టేట ముంచుతుందన్నారు. తరతరాలుగా పూర్వీకుల నాటి నుంచి అక్కడే ఉంటున్న ప్రజలను తరలించాలని చూస్తే సహించేది లేదన్నారు. ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ బండారు సాయిబాబు మాట్లాడుతూ, శాఖమూరు, ఐనవోలు, నేలపాడు, వెలగపూడి గ్రామాలను పూర్తిగా మింగేసే రీతిలో ప్రభుత్వం చకచకా పావులు కదుపుతుందని ఆరోపించారు. గ్రామాలు ఖాళీ చేయించడం దుర్మార్గపూరితమైన కుట్రగా ఆయన అభివర్ణిచారు.
అధిక సంఖ్యలో దళితులు అక్కడ రైతు కూలీలుగా ఏళ్ళ తరబడి పనిచేస్తున్నారన్నారు. వారికి కూడా కుటుంబానికి పాతిక లక్షలు, రాజధాని పరిధిలోనే పక్కా ఇళ్ళు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలనీ, ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందేలా తగు చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు. తాము చేసే పోరాటాలకు సంపూర్ణ మద్ధతు ప్రకటించాలని బండారు సాయిబాబు అన్ని ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి శిఖా బెనర్జీ, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు జంగా జయరాజు, సుద్దపల్లి నాగరాజు, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం.దేవరాజ్, యనమల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
రాజధాని పేరుతో రియల్‌దందా
Published Tue, Apr 21 2015 2:55 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM
Advertisement