ప్రభుత్వోద్యోగాల పేరుతో టోకరా
- 8 మంది నుంచి రూ.8.80 లక్షలు తీసుకున్న యువకుడు
- జల్సాలకు అలవాటు పడి స్నేహితులనూ మోసగించిన వైనం
విస్సన్నపేట : ప్రభుత్వోద్యోగాలపై యువతకు ఉన్న ఆశను ఆసరాగా చేసుకుని ఓ యువకుడు కొందరి వద్ద నుంచి లక్షలాది రూపాయల తీసుకుని మోసగించిన ఘటన మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
విస్సన్నపేటకు చెందిన దాయక తిరుపతిరావు తహశీల్దార్, ఆర్డీవో కార్యాల యాల్లో సర్వేయర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎనిమిది మంది యువతీ యు వకులను నమ్మించి సొమ్ము తీసుకుని మోసం చేశాడు. విజయవాడ శివారు గొల్లపూడికి చెందిన దాసరి శ్రీనివాసరావు వద్ద నుంచి రూ.4 లక్షలు తీసుకున్నాడు. ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ ఉద్యోగం వచ్చిందని చెప్పాడు. అపాయింట్‌మెంట్ ఆర్డర్, ఐడెంటిటీ కార్డు కూడా తయారు చేయించి ఇచ్చి, ఉద్యోగంలో చేరమని చెప్పాడు. శ్రీనివాసరావు వా టిని తీసుకుని సంబంధిత కార్యాల యానికి వెళ్లి అధికారులను కలిశాడు. అతడు ఇచ్చిన అపాయింట్‌మెంట్ ఆర్డరు నకిలీదని వారు చెప్పడంతో అవాక్కయ్యాడు.
తిరుపతిరావుకు సొమ్ము ఇచ్చిన మిగతా వారికి ఈ విషయాన్ని చెప్పాడు. వారంతా కలిసి మంగళవారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్సై దుర్గారావుకు ఫిర్యాదు చేశారు. శ్రీని వాసరావుతోపాటు నూజివీడు సమీపంలోని అన్నవరానికి చెందిన బి.శంకర్‌దొర, బూరవంచకు చెందిన గుడిపాటి రాజేష్, విస్సన్నపేటకు చెందిన దుర్గాప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన సిహెచ్.సంధ్య, సింహాద్రి, లక్ష్మి, రాజ్‌కుమార్ నుంచి తిరుపతిరావు మొత్తం రూ. 8.80 లక్షలు తీసుకున్నట్లు తేలింది. తమ బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము వేయించి, తమ ఏటీఎం కార్డులను ముందుగానే తీసుకుని, వాటి నుంచి సొమ్ము డ్రా చేశాడని బాధితులు తెలిపారు.
తిరుపతిరావు నూజివీడులో ఐటీఐ చదివి సర్వేయర్ వద్ద అసిస్టెంట్‌గా చేస్తున్నట్లు చెప్పి అప్పటి క్లాస్‌మేట్లు, స్నేహితులను నమ్మించి ఉద్యోగాల పేరుతో ఇదేవిధంగా మోసగించాడని బాధితులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై బుధవారం తెలిపారు. తిరుపతిరావు జల్సాలకు అలవాటు పడి కొత్త ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేశాడని పలువురు పే ర్కొంటున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశచూపించే వారిని నమ్మి మోసపోవద్దని, ఇటువంటి వారితో జాగ్రత్తగా మెలగాలని ఎస్సై యువతకు సూచించారు.