- తిరుపతి, రాజంపేట, చిత్తూరు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన
- 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
- చింతామోహన్, సాయిప్రతాప్‌ల స్థానాలు పదిలం
- పూతలపట్టు రవికి ఎంపీ స్థానానికి ప్రమోషన్
- మదనపల్లె నుంచి షాజహాన్,నగరి నుంచి ఇందిర
సాక్షి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి 2 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. లోక్‌సభ స్థానాలు మినహాయి స్తే అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీకి ద్వితీయశ్రేణి నా యకులే దిక్కయ్యారు. తిరుపతి, రాజంపేట నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చింతామోహన్, సాయిప్రతాప్‌లు మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేయనున్నారు. పూతలపట్టు శాసనసభ్యులుగా ఉన్న పి.రవి ఈసారి చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.
అసెంబ్లీ సెగ్మెంట్‌ల విషయంలోకి వచ్చే సరికి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శ్రీకాళహస్తి మినహా మిగిలిన అన్ని స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించిన స్థానాల్లో మదనపల్లె నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న షాజహాన్ బాషా మినహా మిగిలిన అందరూ కొత్తముఖాలు కావడం గమనార్హం. రాష్ట్ర విభజన పరిణామంతో కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో అభ్యర్థులు కరువయ్యారు. దీంతో ఆ పార్టీ కొత్త అభ్యర్థులను రంగంలోకి తెస్తోంది.
ముఖ్యంగా ఇతర పార్టీల్లోకి వెళ్లలేని నాయకులను ఎంపిక చేసుకున్నట్లు కాంగ్రెస్ ప్రకటించిన జాబితాను చూస్తే స్పష్టమవుతోంది. షాజ హాన్ బాషా తెలుగుదేశం, వైఎస్‌ఆర్ సీపీల వైపు మొగ్గు చూపినప్పటికీ అక్కడ ఖాళీ లేకపోవడంతో గత్యంతరం లేక కాంగ్రెస్ నుంచే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. చంద్రగిరి నుంచి డీసీసీ అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌రెడ్డి, నగరి నుంచి మాజీ మంత్రి ఆర్. చెంగారెడ్డి కుమార్తె వి.ఇందిరాప్రియదర్శిని మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది.
గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు డాక్టర్ నరసింహులు అభ్యర్థిత్వాన్ని ఖరా రు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కుప్పం నియోజకవర్గం నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు అభ్యర్థి కానున్నారు. పలమనేరు నియోజకవర్గం నుంచి లిక్కర్ వ్యాపారి పార్థసారథికి అవకాశం ఇచ్చారు. సత్యవేడు నుంచి ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన పెనుబాల చంద్రశేఖర్‌కు అవకాశం ఇచ్చారు. పుంగనూరు నియోజకవర్గంలో బోయకొండ దేవస్థానం చైర్మన్ వెంకటరమణారెడ్డి పోటీ చేయనున్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గం నుంచి ముస్లిం మైనారిటీ కోటాల్లో షానవాజ్ అహ్మద్‌కు అవకాశం కల్పించారు. అయితే ఈయనెవరో తెలియని పరిస్థితి. తంబళ్లపల్లె నుంచి ములకలచెరువు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.ఎన్.చంద్రశేఖర్‌రెడ్డికి టికెట్ కేటాయించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నుంచి రామ్మూర్తి పోటీ చేయనున్నారు. పూతలపట్టు స్థానానికి మాజీ ఎమ్మెల్యే మునస్వామప్ప కుమారుడు అశోక్‌రాజ్‌కు అవకాశం ఇచ్చారు.