Assembly segment
-
రెండింట్లో షాద్‌నగర్
1952లో మహబూబ్‌నగర్‌ను లోక్‌సభ నియోజకవర్గంగా ఏర్పాటుచేశారు. అప్పట్లో షాద్‌నగర్ మహబూబ్‌నగర్ లోక్‌సభ పరిధిలోనే ఉండేది. ఆ తర్వాత 1967లో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ కేంద్రంగా ఏర్పాటుచేసి షాద్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌ను దానిలో కలిపారు. అప్పటి నుంచి 2004 వరకు నాగర్‌కర్నూల్ పరిధిలోనే షాద్‌నగర్ ఉండేది. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో నాగర్‌కర్నూల్, పరిగి, కొడంగల్, అచ్చంపేట, షాద్‌నగర్ నియోజకవర్గాలు ఉండేవి. అయితే 2009లో తిరిగి షాద్‌నగర్‌ను మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోకి తెచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా మహబూబ్‌నగర్ పరిధిలో షాద్‌నగర్ ఉంది. అయితే 2016లో టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటుచేసింది. షాద్‌నగర్ నియోజకవర్గాన్ని మహబూబ్‌నగర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిపేశారు. అసెంబ్లీ రంగారెడ్డి, లోక్‌సభ మహబూబ్‌నగర్‌లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఓటువేసిన షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్లు లోక్‌సభ ఎన్నికలకు మాత్రం ఓటును మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వేస్తున్నారు. దీంతో షాద్‌నగర్ రెండు జిల్లాల రాజకీయాలకు వారధిగా మారింది. పలు సందర్భాల్లో ఎంపీల గెలుపోటములను శాసించిన ఘనత ఈ నియోజకవర్గానికి ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో షాద్‌నగర్ 1952లో పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న సమయంలో మూడు ఎన్నికలు జరిగాయి. 1952లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కె.జనార్దన్‌రెడ్డి, 1957, 62లో రామేశ్వర్రావు ఎంపీగా విజయం సాధించారు. వారి గెలుపులో షాద్‌నగర్ నియోజకవర్గానికి కూడా భాగస్వామ్యం ఉంది. 1967లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చాక అదే ఏడాది కాంగ్రెస్ పార్టీకి చెందిన జేబీ ముత్యాలరావు విజయం సాధించడంలో షాద్‌నగర్ కీలక పాత్ర పోషించింది. 1971, 77లలో వరుసగా రెండుసార్లు తెలంగాణ ప్రజా సమితి నుంచి పోటీ చేసిన భీష్మదేవ్ విజయం సాధించారు. 1980లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లు అనంతరాములు, 1984లో తులసీరాం, 1989లో మల్లు అనంతరాములు విజయం సాధించారు. 1989లో మల్లు అనంతరాములు మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు మల్లు రవి గెలుపొందారు. మల్లురవి విజయంలోనూ షాద్‌నగర్ భాగమైంది. 1996లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మందా జగన్నాథం విజయం సాధించారు. 1998లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మల్లురవి తిరిగి విజయాన్ని అందుకున్నారు. 1999, 2004లో వరుసగా రెండుసార్లు మందా జగన్నాథం విజయం సాధించగా ఈ విజయాల్లోను షాద్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కీలక పాత్ర పోషించింది. 2009లో తిరిగి షాద్‌నగర్ నియోజకవర్గాన్ని మళ్లీ మహబూబ్‌నగర్ పార్లమెంట్లో కలిపారు. ఈ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ ఎంపీగా ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ విజయం సాధించారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఆయన గెలుపులోను షాద్‌నగర్ కీలకంగా మారింది. అయితే 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున నుంచి పోటీ చేసిన జితేందర్‌రెడ్డి స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అత్యధిక మెజార్టీ ఇచ్చిన షాద్‌నగర్‌కే దక్కడం గమనార్హం. ప్రత్యేక శ్రద్ధ షాద్‌నగర్ నియోజకవర్గంలో వలస కార్మికులు, గ్రామీణ ప్రాంతం వారు ఎక్కువ ఉండడంతో ఎంపీ అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు షాద్‌నగర్ నియోజకవర్గానికి అభ్యర్థులు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో ఆయా పార్టీల అధినేతలు, ముఖ్య నాయకులు ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. -
కర్ణాటక పీఠాన్ని నిర్ధేశించేది ఈ సీటే..
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైన క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి ఒకే నియోజకవర్గంపై కేంద్రీకృతమైంది. గడగ్ జిల్లాలోని బాంబే కర్ణాటక ప్రాంతంలోని సిరహట్టి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపొందితే పాలనా పగ్గాలు సైతం అదే పార్టీకి అందివస్తున్నాయి. 1972 నుంచి ఇదే ఒరవడి కొనసాగుతోంది. 1972లో సిరహట్టి స్ధానం నుంచి కాంగ్రెస్‌కు చెందిన వదిరాజ్చార్య గెలుపొందగా ఆ పార్టీకి చెందిన దేవరాజ్ ఉర్స్ సీఎం పీఠం అధిష్టించారు. 1983 వరకూ ఈ స్ధానాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్ తన సిట్టింగ్ ఎమ్మెల్యే పకీరప్ప స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది జనతా పార్టీకి మద్దతు ప్రకటించారు. 1983లో జనతా పార్టీకి చెందిన రామకృష్ణ హెగ్డే కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1985లో జనతా పార్టీ సిరహట్టిలో గెలుపొంది కర్ణాటక సీఎంగా హెగ్డే రెండోసారి అందలం ఎక్కారు. ఇక 1989లో కాంగ్రెస్ తిరిగి సిరహట్టిలో గెలుపొందగా, ఆ పార్టీకి చెందిన వీరేంద్ర పాటిల్ సీఎం అయ్యారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మత ఘర్షణలు తలెత్తడంతో ఆయనను సీఎం పదవి నుంచి అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ తొలగించారు. ఐదేళ్ల అనంతరం స్వతంత్ర అభ్యర్థి పకీరప్పను జనతాదళ్ అభ్యర్థి మహానటేశ్వర్ ఓడించిన క్రమంలో ఆ పార్టీకి చెందిన దేవెగౌడ 1994లో సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1999లో కాంగ్రెస్ తిరిగి సిరహట్టి సీటును గెలుచుకోగా ఆ పార్టీకి చెందిన ఎస్ఎం కృష్ణ కర్ణాటక సీఎంగా ఎన్నికయ్యారు. 2004లో కొద్ది మెజారిటీతో ఈ స్ధానంలో కాంగ్రెస్ గెలుపొందినా కాంగ్రెస్ మద్దతుతోనే జెడీ(ఎస్)కు చెందిన దేవెగౌడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన కుమారుడు కుమారస్వామి బీజేపీతో చేతులు కలపడం కూటమి ప్రభుత్వం విఫల ప్రయోగంగా నిలిచింది. మరోవైపు 2008లో బీజేపీ సిరహట్టి స్థానంలో గెలుపొంది కర్ణాటకలో దక్షిణాదిలోనే తొలిసారి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2013లో సిరహట్టిలో కాంగ్రెస్ గెలుపొంది సిద్దరామయ్య నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సిరహట్టిలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. యువ ఓటర్లు అధికంగా ఉన్న సిరహట్టిలో పట్టు కోసం ప్రధాన పార్టీలు యువతకు గాలం వేస్తున్నాయి. ఉత్కంఠ పోరులో సిరహట్టి ఏ పార్టీని వరిస్తుందో రాష్ట్ర పాలనా పగ్గాలు చేపడుతుందోననే ఆసక్తి నెలకొంది. -
కాంగ్రెస్‌కు కొత్త ముఖాలు
తిరుపతి, రాజంపేట, చిత్తూరు లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ చింతామోహన్, సాయిప్రతాప్ల స్థానాలు పదిలం పూతలపట్టు రవికి ఎంపీ స్థానానికి ప్రమోషన్ మదనపల్లె నుంచి షాజహాన్,నగరి నుంచి ఇందిర సాక్షి, తిరుపతి: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి 2 లోక్‌సభ, 12 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. లోక్‌సభ స్థానాలు మినహాయి స్తే అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీకి ద్వితీయశ్రేణి నా యకులే దిక్కయ్యారు. తిరుపతి, రాజంపేట నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చింతామోహన్, సాయిప్రతాప్‌లు మళ్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేయనున్నారు. పూతలపట్టు శాసనసభ్యులుగా ఉన్న పి.రవి ఈసారి చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలోకి వచ్చే సరికి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శ్రీకాళహస్తి మినహా మిగిలిన అన్ని స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ప్రకటించిన స్థానాల్లో మదనపల్లె నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న షాజహాన్ బాషా మినహా మిగిలిన అందరూ కొత్తముఖాలు కావడం గమనార్హం. రాష్ట్ర విభజన పరిణామంతో కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో అభ్యర్థులు కరువయ్యారు. దీంతో ఆ పార్టీ కొత్త అభ్యర్థులను రంగంలోకి తెస్తోంది. ముఖ్యంగా ఇతర పార్టీల్లోకి వెళ్లలేని నాయకులను ఎంపిక చేసుకున్నట్లు కాంగ్రెస్ ప్రకటించిన జాబితాను చూస్తే స్పష్టమవుతోంది. షాజ హాన్ బాషా తెలుగుదేశం, వైఎస్ఆర్ సీపీల వైపు మొగ్గు చూపినప్పటికీ అక్కడ ఖాళీ లేకపోవడంతో గత్యంతరం లేక కాంగ్రెస్ నుంచే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. చంద్రగిరి నుంచి డీసీసీ అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌రెడ్డి, నగరి నుంచి మాజీ మంత్రి ఆర్. చెంగారెడ్డి కుమార్తె వి.ఇందిరాప్రియదర్శిని మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు డాక్టర్ నరసింహులు అభ్యర్థిత్వాన్ని ఖరా రు చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన కుప్పం నియోజకవర్గం నుంచి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు అభ్యర్థి కానున్నారు. పలమనేరు నియోజకవర్గం నుంచి లిక్కర్ వ్యాపారి పార్థసారథికి అవకాశం ఇచ్చారు. సత్యవేడు నుంచి ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన పెనుబాల చంద్రశేఖర్‌కు అవకాశం ఇచ్చారు. పుంగనూరు నియోజకవర్గంలో బోయకొండ దేవస్థానం చైర్మన్ వెంకటరమణారెడ్డి పోటీ చేయనున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గం నుంచి ముస్లిం మైనారిటీ కోటాల్లో షానవాజ్ అహ్మద్‌కు అవకాశం కల్పించారు. అయితే ఈయనెవరో తెలియని పరిస్థితి. తంబళ్లపల్లె నుంచి ములకలచెరువు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.ఎన్.చంద్రశేఖర్‌రెడ్డికి టికెట్ కేటాయించారు. జిల్లా కేంద్రమైన చిత్తూరు నుంచి రామ్మూర్తి పోటీ చేయనున్నారు. పూతలపట్టు స్థానానికి మాజీ ఎమ్మెల్యే మునస్వామప్ప కుమారుడు అశోక్రాజ్కు అవకాశం ఇచ్చారు. -
పోలింగ్ శాతం పెంపుపై దృష్టి
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాలూ సహకరించాలని విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ బి.రామారావు కోరారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవర కూ ఓటరు నమోదుపై దృష్టి సారించామని చెప్పారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేర కు పోలింగ్ మెరుగుపర్చడానికి అన్ని చర్య లూ తీసుకుంటామన్నారు. ఇందుకోసం 80 వేల కరపత్రాల ముద్రణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువజన సంఘాలు, మహిళా సంఘాలతో పాటు రిటైర్డు ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలతో ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2009 ఎన్నికలలో తక్కువ శాతం ఓటింగ్ నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఓటర్లకు బల్క్ ఎస్ఎంఎస్ల ద్వారా అవగాహన పెంపొందిస్తామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 12న నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. ఆ రోజు నుంచి 19వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 21 నుంచి నామినేషన్ల పరిశీలన, 23న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తున్నామన్నారు. 14న అంబేద్కర్ జయంతి, 18న గుడ్‌ఫ్రైడే సెలవు దినాలు కావ డం వల్ల ఆ రెండు రోజులూ నామినేషన్లు స్వీకరించబోమని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయడానికి అన్ని చర్యలూ తీసుకున్నామన్నారు. పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే ఎన్నికల సిబ్బంది సౌకర్యార్థ్యం కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దీనికోసం మూడు కేంద్రాలను ఏర్పాటు చేశామని జేసీ తెలిపారు. రహస్య ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ల డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్లను సంబంధిత పోస్ట్‌మన్ నియోజకవర్గ ఆర్వోలకు ప్రతి రోజూ అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్లను అందిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఎన్నికల విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది ఓటింగ్‌కు దూరంగా ఉం టున్నారన్నారు. వారి కోసం ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నోడల్ అధికారి ద్వారా వీరికి పోస్టల్ బ్యాలెట్లను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయనగరం నియోజకవర్గం పరిధిలో 223 పోలింగ్ కేంద్రాలుండగా.. మరో రెండు అనుబంధ పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్టు ఆయన తెలిపారు. ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కాలనీలోని పోలీస్ వెల్ఫేర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఒకటి, బాబామెట్టలోని కల్యానంద భారతి ప్రాథమిక పాఠశాలలో మరొకటి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. విజయనగరం నియోజకవర్గానికి స్థానిక తహశీల్దార్ వెంకట శివ, మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ, ఏఓ డి.రాజేశ్వరి సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంకట శివతో పాటు పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కొత్తదనం వైపు అనకాపల్లి చూపు
బెల్లం వ్యాపారంతో జాతీయ స్ధాయిలో గుర్తింపు.. ఆధ్యాత్మికంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాలమ్మ కొలువున్న స్ధానం.. ఎనిమిది దశాబ్దాల చరిత్ర ఉన్న తుమ్మపాల చక్కెర కర్మాగారం.. గ్రామీణ ప్రాంతంలో విద్యుత్ వెలుగులు నింపే కశింకోట ఆర్ఈసీఎస్.. శత వసంతాలు నిండిన ఉత్తర కోస్తా వ్యవసాయ మండలి ప్రధాన కేంద్రం అనకాపల్లిలోనే. ఇవన్నీ ఈ అసెంబ్లీ నియోజకవర్గ మైలురాళ్లు. ఇప్పటి వరకూ 13 ఎన్నికలు చూసిన అనకాపల్లి ఓటర్లు మొదట్లో కమ్యూనిస్టులకు పట్టం కట్టారు. మొత్తం మీద ఐదు పార్టీలకు చెందిన అభ్యర్థులను తమ నేతగా ఎన్నుకున్నారు. 1952 నుంచి 1972 వరకు కమ్యూనిస్టులు తమ ప్రాభవాన్ని కొనసాగించారు. నాలుగు సార్లు సీపీఐ అభ్యర్థులు విజయఢంకా మోగించగా, కృషికార్ లోక్ పార్టీ (కేఎల్పీ) ఒకసారి, కాంగ్రెస్ రెండుసార్లు, టీడీపీ ఐదుసార్లు విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ప్రజారాజ్యం తొలి ఎన్నికల్లోనే అనకాపల్లిని కైవసం చేసుకొని, తర్వాత కాంగ్రెస్‌లో విలీనమైంది. టీడీపీ 1983 నుంచి వరుసగా ఐదు విడతలు అనకాపల్లిలో తమ ప్రభావం చూపగా 2004 నుంచి ఉనికి కోల్పోయింది.కొత్తదనానికి, కొత్త పార్టీలకు పట్టం కట్టే తత్వం ఉన్న అనకాపల్లి ఓటర్లు ఈసారి ఎలాంటి తీర్పునిస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అనకాపల్లి మొదటి శాసన సభ్యునిగా కె.గోవిందరావు తన పేరును పదిలపరుచుకున్నారు. 2014లో పోటీలో నిలిచిన కొత్త పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు నియోజకవర్గ ప్రజలు చూస్తుండగా, ప్రధాన పోటీ వైఎస్ఆర్ సీపీ, టీడీపీ మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ ఉద్దండులున్న అనకాపల్లి నియోజవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి ఫలితాలను రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తూ వుంటారు. - న్యూస్‌లైన్, అనకాపల్లి