పోలింగ్ శాతం పెంపుపై దృష్టి
Published Fri, Apr 4 2014 1:57 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాలూ సహకరించాలని విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ బి.రామారావు కోరారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతవర కూ ఓటరు నమోదుపై దృష్టి సారించామని చెప్పారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేర కు పోలింగ్ మెరుగుపర్చడానికి అన్ని చర్య లూ తీసుకుంటామన్నారు. ఇందుకోసం 80 వేల కరపత్రాల ముద్రణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువజన సంఘాలు, మహిళా సంఘాలతో పాటు రిటైర్డు ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలతో ర్యాలీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2009 ఎన్నికలలో తక్కువ శాతం ఓటింగ్ నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఓటర్లకు బల్క్ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అవగాహన పెంపొందిస్తామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఎంపీ, ఎమ్మెల్యేల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 12న నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. ఆ రోజు నుంచి 19వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 21 నుంచి నామినేషన్ల పరిశీలన, 23న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తున్నామన్నారు. 14న అంబేద్కర్ జయంతి, 18న గుడ్‌ఫ్రైడే సెలవు దినాలు కావ డం వల్ల ఆ రెండు రోజులూ నామినేషన్లు స్వీకరించబోమని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయడానికి అన్ని చర్యలూ తీసుకున్నామన్నారు.
పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకునే ఎన్నికల సిబ్బంది సౌకర్యార్థ్యం కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. దీనికోసం మూడు కేంద్రాలను ఏర్పాటు చేశామని జేసీ తెలిపారు. రహస్య ఓటింగ్ కంపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ల డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్లను సంబంధిత పోస్ట్‌మన్ నియోజకవర్గ ఆర్వోలకు ప్రతి రోజూ అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్లను అందిస్తామని చెప్పారు. ముఖ్యంగా ఎన్నికల విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది ఓటింగ్‌కు దూరంగా ఉం టున్నారన్నారు. వారి కోసం ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నోడల్ అధికారి ద్వారా వీరికి పోస్టల్ బ్యాలెట్‌లను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయనగరం నియోజకవర్గం పరిధిలో 223 పోలింగ్ కేంద్రాలుండగా.. మరో రెండు అనుబంధ పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్టు ఆయన తెలిపారు. ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్ కాలనీలోని పోలీస్ వెల్ఫేర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఒకటి, బాబామెట్టలోని కల్యానంద భారతి ప్రాథమిక పాఠశాలలో మరొకటి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. విజయనగరం నియోజకవర్గానికి స్థానిక తహశీల్దార్ వెంకట శివ, మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ, ఏఓ డి.రాజేశ్వరి సహాయ రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంకట శివతో పాటు పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement