నాయకులకు తలూపుతున్న అధికారులు
విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో రాజకీయ బదిలీలు సర్వసాధారణమైపోతున్నాయి.గతంలో రాజకీయ నాయకులు అడిగితే ఒకటీ అరా చేసి మిగతా బదిలీలను పారదర్శకంగా చేపట్టే అధికారులు ఇప్పుడు రాజకీయ నాయకులు ఎక్కడ చెబితే అక్కడకు సులువుగా బదిలీలు చేస్తున్నారని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. బదిలీ చేసిన రెండు, మూడు రోజులకోసారి బదిలీలు అయిపోతుంటే మరి వాటిని రాజకీయ బదిలీలు అని కాకుండా మరేం బదిలీలంటారో అధికారులే చెప్పాలి. జిల్లాలో గత నెల బదిలీలు చేపట్టారు.
ఈ బదిలీల్లో వీఆర్వోలు, సీనియర్ అసిస్టెంట్లు, ఆర్‌ఐలు, తహసీల్దార్లు ఉన్నారు. ఆ బదిలీల పరంపర ముగిసిపోయిందని చెబుతున్నా రెండు మూడు రోజుల కోసారి బదిలీలు జరుగుతూనే ఉన్నాయి. ప్రారంభంలో వీఆర్వోల బదిలీలు రాజకీయంగా చేశారన్న ఆరోపణలు వినిపించాయి. వీరి బదిలీలకు జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఆయా ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా లేఖలు పట్టుకుని వెళ్లి బదిలీ చేయించుకున్నారని వినికిడి.
ఐదు రోజులే తహసీల్దార్
చీపురుపల్లి తహసీల్దార్ జి పెంటయ్యను డెంకాడలో నియమించాలని ఒత్తిళ్లు వస్తే అప్పట్లో కాదన్న అధికారులు ఆ స్థానంలో డ్వామాలో పనిచేస్తున్న బి వి లక్ష్మిని నియమించారు. ఆ తరువాత కొన్ని రోజులు ఆగారు. కానీ హఠాత్తుగా మంగళవారం బివి లక్ష్మిని బలిజిపేట మండలానికి బదిలీ చేసి ఆ స్థానంలో ముందుగా కాదన్న జి పెంటయ్యను నియమించారు.దీంతో డెంకాడలో కేవలం ఐదు రోజుల తహ సీల్దార్‌గానే బీవీ లక్ష్మి మిగిలిపోయారు.
ఈ బదిలీని చూసిన పలువురు నివ్వెర పోయారు. దీనికి కారణం సోమవారం జిల్లాలో పర్యటించిన ఇన్‌చార్జి మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణ స్వామినాయుడు అతని కుమారుడు అప్పలనాయుడులకు జి పెంటయ్యను చీపురుపల్లి స్థానం నుంచి తమ నియోజకవర్గంలోని డెంకాడ మండలానికి తెచ్చుకోవాలని ఉందనీ అప్పట్లో కలెక్టర్ కాదనడంతో ఇప్పుడు ఇన్‌చార్జి మంత్రి చేత చెప్పించి తమ పంతం నెగ్గించుకున్నారనేది టాక్! అలాగే ఆర్‌ఐల బదిలీలు కూడా సక్రమంగా చేపట్టలేదని పలువురు ఉద్యోగులే బాహాటంగా విమర్శిస్తున్నారు. ఇచ్చిన ఆప్షన్లను పట్టించుకోలేదని వారికి నచ్చిన ప్రాంతాలకు బదిలీ చేశారని ఉద్యోగులు వాపోతున్నారు.
మరి లేవంటూనే..!
బదిలీలు ప్రారంభించిన దగ్గర నుంచి నేటి వరకూ మరి బదిలీలు లేవని చెబుతూ వస్తున్న అధికారులు రాజకీయ నాయకులు చెబుతున్న ప్రకారం బదిలీలు చేస్తునే ఉన్నారని అంటున్నారు. ఈ బదిలీలు చూసిన మరికొంత మంది నాయకులు కూడా బదిలీల జాబితాలు తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది.
బదిలీల్లో ‘రాజకీయం’
Published Wed, Jul 6 2016 3:10 AM | Last Updated on Mon, Sep 17 2018 5:12 PM
Advertisement
Advertisement