మొత్తం మీద ఐదు పార్టీలకు చెందిన అభ్యర్థులను తమ నేతగా ఎన్నుకున్నారు. 1952 నుంచి 1972 వరకు కమ్యూనిస్టులు తమ ప్రాభవాన్ని కొనసాగించారు.
బెల్లం వ్యాపారంతో జాతీయ స్ధాయిలో గుర్తింపు.. ఆధ్యాత్మికంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాలమ్మ కొలువున్న స్ధానం.. ఎనిమిది దశాబ్దాల చరిత్ర ఉన్న తుమ్మపాల చక్కెర కర్మాగారం.. గ్రామీణ ప్రాంతంలో విద్యుత్ వెలుగులు నింపే కశింకోట ఆర్‌ఈసీఎస్.. శత వసంతాలు నిండిన ఉత్తర కోస్తా వ్యవసాయ మండలి ప్రధాన కేంద్రం అనకాపల్లిలోనే. ఇవన్నీ ఈ అసెంబ్లీ నియోజకవర్గ మైలురాళ్లు. ఇప్పటి వరకూ 13 ఎన్నికలు చూసిన అనకాపల్లి ఓటర్లు మొదట్లో కమ్యూనిస్టులకు పట్టం కట్టారు.
మొత్తం మీద ఐదు పార్టీలకు చెందిన అభ్యర్థులను తమ నేతగా ఎన్నుకున్నారు. 1952 నుంచి 1972 వరకు కమ్యూనిస్టులు తమ ప్రాభవాన్ని కొనసాగించారు. నాలుగు సార్లు సీపీఐ అభ్యర్థులు విజయఢంకా మోగించగా, కృషికార్ లోక్ పార్టీ (కేఎల్‌పీ) ఒకసారి, కాంగ్రెస్ రెండుసార్లు, టీడీపీ ఐదుసార్లు విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ప్రజారాజ్యం తొలి ఎన్నికల్లోనే అనకాపల్లిని కైవసం చేసుకొని, తర్వాత కాంగ్రెస్‌లో విలీనమైంది. టీడీపీ 1983 నుంచి వరుసగా ఐదు విడతలు అనకాపల్లిలో తమ ప్రభావం చూపగా 2004 నుంచి ఉనికి కోల్పోయింది.కొత్తదనానికి, కొత్త పార్టీలకు పట్టం కట్టే తత్వం ఉన్న అనకాపల్లి ఓటర్లు ఈసారి ఎలాంటి తీర్పునిస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అనకాపల్లి మొదటి శాసన సభ్యునిగా కె.గోవిందరావు తన పేరును పదిలపరుచుకున్నారు.
2014లో పోటీలో నిలిచిన కొత్త పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వైపు నియోజకవర్గ ప్రజలు చూస్తుండగా, ప్రధాన పోటీ వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ ఉద్దండులున్న అనకాపల్లి నియోజవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి ఫలితాలను రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తూ వుంటారు.
- న్యూస్‌లైన్, అనకాపల్లి