- పాత కక్షలతో హత్య
- దొంగలు చంపినట్టుగా ప్రచారం
- కేసును ఛేదించిన పోలీసులు
జి.మాడుగుల: మండలంలోని వంజరి పంచాయతీ పినకిల్తారి సమీపంలో గిరిజనుడి తల నరికి తీసుకెళ్లిన ఘనటను పోలీసులు ఛేదించారు. పాతకక్షలు కారణంగా గ్రామానికి చెందిన వంజరి పోతురాజును అదే గ్రామానికి చెందిన వంజరి చిన్న అప్పలనాయుడు, గెమ్మెలి పాపారావు, కొర్రా సోమేశ్వరరావు, బోనంగి బంగారుపడాల్‌లు కలిసి హత మార్చారు. ఈ నెల 10న చోటుచేసుకున్న ఈ సంఘటన గురించి సీఐ శ్రీనివాసరావు వివరాలు ఇలా ఉన్నాయి. పోతురాజు అన్నయ్య పొట్టినాయుడు కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. ఆయన భార్య లక్ష్మి,పోతురాజులు వరుసకు కొడుకైన రాజంనాయుడు ఇంటివద్ద కలిసి ఉంటున్నారు. కాగా అదే గ్రామానికి చెందిన వంజరి చిన్నఅప్పలనాయుడుతో లక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని సహించలేని పోతురాజు కొన్నాళ్ల క్రితం అతినితో గొడవ పడ్డాడు. అప్పటి నుంచి పోతురాజుపై చిన్నఅప్పలనాయుడు పగపెంచుకున్నాడు. దీంతో అతడ్ని చంపేందుకు పథకం రూపొందించాడు.
తాగుడు అలవాటున్న పోతురాజును ఈ నెల 10న రాత్రి 7గంటల సమయంలో గెమ్మెలి పాపారావు ద్వారా సారా తాగడానికి గ్రామానికి కిలోమీటరు దూరం తీసుకెళ్లాడు. అక్కడ పోతురాజుతో పాటు పాపారావు, చిన్నఅప్పలనాయుడు, కొర్రాసోమేశ్వరరావు, బోనంగి బంగారుపడాల్‌లు పూటుగా తాగారు. అనంతరం పాతపగతో ఉన్న చిన్నఅప్పలనాయుడు పోతురాజుతో గొడవ పెట్టుకున్నాడు. కాలితో గట్టిగా తన్నడంతో నేలమీద పడిపోయిన పోతురాజును నలుగురూ గట్టిగా అదిమి పట్టుకున్నారు. వెంట తెచ్చుకున్న కత్తితో అప్పలనాయుడు అతని మెడకోసి హతమార్చాడని సీఐ తెలిపారు. ఇదంతా చిన్నఅప్పలనాయుడు పథకంలో ప్రకారమే చేశాడన్నారు. మొండాన్ని రోడ్డుపై వదిలేసి తలభాగాన్ని వెంట తీసుకుపోయి దొంగలు హతమార్చినట్టుగా చిత్రీకంరించారు.
సంఘటన జరిగిన నాటి నుంచి పోలీసుల నిఘా పెట్టారు. తన సమాచారం పోలీసులకు చెబితే మావోయిస్టుల్లో కలిసిపోయి చంపుతానిని బెదిరించి ఇంటి నుంచి హత్య చేసిన రాత్రి అప్పలనాయుడు వెళ్లిపోయాడు. కొందరి ద్వారా అందిన వివరాల మేరకు ముగ్గురిని గ్రామ పరిసరాల్లోను, చిన్నఅప్పలనాయుడును చింతపల్లి మండలం లోతుగెడ్డ జంక్షన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. మొండానికి కొంత దూరంలో ఉన్న తలను గుర్తించి శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. నలుగురిని రిమాండ్‌కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
తల నరికి తీసుకెళ్లిన నలుగురి అరెస్టు
Published Mon, May 18 2015 3:51 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
Advertisement