పొలంలో దుక్కి దున్నుతున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు తిరగబడిన ఘటనలో యజమాని మృతి చెందాడు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా రాయచోటి రూరల్ మండలం ఎండపల్లె పంచాయతీ బోయపల్లెలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సానికులు తెలిపిన వివరాలివీ.. బోయపల్లె సమీపంలోని పొలంలో చిన్నరామిరెడ్డిగారి పల్లె గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ట్రాక్టర్ తో దుక్కి దున్నుతున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ బురదలో కూరుకుపోయింది.
డ్రైవర్ ఈశ్వరయ్య ట్రాక్టర్ ను బయటకు తీసేందుకు యత్నించినా ఫలితం కనిపించలేదు. విషయం తెలుసుకున్న ట్రాక్టర్ యజమాని బి.ఆంజనేయులు(29) అక్కడికి చేరుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చుని, ట్రాక్టర్ బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ ఒక్కసారిగా ముందు వైపు పైకి లేచింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న ఆంజినేయులు వెనక్కి బురదలో పడిపోయాడు. తలకు తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, ఏడాది వయస్సున్న కుమారుడు ఉన్నారు.