పరువు దక్కుతుందా!
- బీజేపీ అంతర్మధనం
- ఎన్నికల్లో డిపాజిట్లు వస్తాయో లేదోనని సందిగ్ధం
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖలోని బీజేపీ నేతలను నైరాశ్యం వెన్నాడుతోంది. ఎన్నికలు పూర్తి కాగానే అన్ని పార్టీల అభ్యర్థులు తమకు వచ్చే మెజారిటీని ఊహించి చెబుతుంటే బీజేపీ నేతలు మాత్రం ఈసారి డిపాజిట్లు దక్కుతాయని సరిపుచ్చుకుంటున్నారు. ఇన్నాళ్ల కష్టానికి ఫలితం దక్కకపోయినా పరువు నిలుస్తుందని భావిస్తున్నారు. ఎన్నికలకు మరో మూడు నాలుగు రోజుల సమయం ఉంటే తమకు అనుకూలంగా ఉండేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
జై సమైక్యాంధ్ర పార్టీ ఎంపీ అభ్యర్థి సబ్బం హరి పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కాస్త ముందుగా ప్రకటించినా తమకు లాభించేదని, ఆఖరి నిమిషంలో ప్రకటించడం వల్ల ప్రజల్లోకి ఆ విషయాన్ని తీసుకెళ్లలేకపోయామని మధనపడుతున్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన డి.వి.సుబ్బారావుకు దాదాపు 36 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పట్లోనే ఉత్తర నియోజక వర్గానికి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పి.వి.ఎన్.మాధవ్‌కు దాదాపు 4 వేల ఓట్లు వచ్చాయి.
ఇప్పుడా ఓట్లను లెక్కల్లోకి తీసుకోనవసరం లేదని, అప్పుడు ఒంటరిగా బరిలోకి దిగామని, ఇప్పుడు పరిస్థితి వేరని చెబుతున్నారు. జై సమైక్యాంధ్ర పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీల మద్దతుతో బరి లోకి దిగిన బీజేపీ అభ్యర్థులపై ఈసారి ప్రధాని అభ్యర్థి మోడీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఊహా లోకాల్లో తేలిపోతున్నారు. ఫలితాలు అనుకూలంగా రాకపోయినా పరువు దక్కించుకుంటామన్న భావనలో ఉన్నారు.