నలిగిపోయిన గిరిజనం
మావోయిస్టులు..పోలీసుల ఆధిపత్యపోరులో గిరిజనం నలిగిపోతున్నారు. ఇరువర్గాలూ ఎవరికి వారే తమదే పైచేయి అని చెప్పుకుంటున్నప్పటికీ పీఎల్‌జీఏ వారోత్సవాలు జరిగినన్నాళ్లూ ఆదివాసీలు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వారు ఎదుర్కొన్న సమస్యలకు బాధ్యత వహించేదెవరని ప్రజా సంఘాలు, సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఎవరి కోసమైతే పోరాడుతున్నామంటున్నారో వారి ప్రాణాలకే ముప్పు తెస్తున్నారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభమైన పీఎల్‌జీఏ వారోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ప్రారంభం నుంచి చివరి రోజు వరకూ ఏజెన్సీ అంతటా ఉద్రిక్తతల నడుమ గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. చింతపల్లి మండలం బలపం పంచాయతీ వీరవరం ఘటనలో సహచరులను కోల్పోయిన మావోయిస్టులు ప్రతికారంతో రగిలిపోతున్నారని, ఆ సంఘటనకు కారకులైన గిరిజనులను హతమార్చేందుకు వారోత్సవాల్లో కచ్చితంగా ప్రయత్నిస్తారని పోలీసులకు సమాచారం రావడంతో గిరిజనులకు రక్షణ కల్పించారు. పీఎల్‌జీఏకు ఒక రోజు ముందే మావోయిస్టులు జీకే వీధి మండలం పెదవలస, దేవరాపల్లిలో గాలికొండ ఏరియా కమిటీ పేరుతో బ్యానర్లు కట్టారు, కరపత్రాలు వెదజల్లారు. వారోత్సవాలను అడ్డుకోవడానికి పోలీసులు బలగాలను కూడా భారీగానే మోహరించి విస్తృతంగా కూంబింగ్ నిర్వహించారు. దీంతో సాయుధ బలగాలు అడవిని జల్లెడపాట్టాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అనుమానం ఉన్న చోట ప్రతి ఇంటినీ సోదాచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, సెల్‌టవర్లు, రైల్వే ట్రాక్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడో రోజున జిల్లా ఎస్పీ కోయ ప్రవీణ్ ఏజెన్సీలో పర్యటించారు. ఆ మర్నాడే (నాలుగోరోజు) జీకే వీధి మండలం నక్కబంద వద్ద పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు. పోలీసులు రాకముందే ఇది జరగడంతో పెనుప్రమాదం తప్పింది. ఐదోరోజు మరిన్ని బలగాలను మన్యంలోకి దించారు. కూంబింగ్‌ను ముమ్మరం చేశారు.
నాకా బందీ కట్టుదిట్టం చేశారు. వారోత్సవాలు విజయవంతం అయ్యాయని సీపీఐ మావోయిస్టు కోరుకొండ ఏరియా కమిటీ కార్యదర్శి విజయలక్ష్మి ప్రకటించారు. కానీ ఎక్కడ, ఎప్పుడు వారోత్సవాలు నిర్వహించిందీ వెల్లడించలేదు. ఆరోరోజు పెదబయలు మండలంలో మావోయిసులు కరపత్రాలు వెదజల్లారు. సోమవారంతో ఉత్సవాలు ముగిశాయి. ఇంతకు మించి వారోత్సవాల్లో అటు మావోయిస్టులు , ఇటు పోలీసులు సాధించేందేమీ లేదు. కుంకుంపూడిలో భారీ స్ధూపాన్ని ఆవిష్కరించాలనే మావోల ప్రయత్నం కూడా ఫలించలేదు. అదే విధంగా భారీ బలగాలను దించినా, పక్కా సమాచారం ఉన్నా పోలీసులు ఒక్క దళ సభ్యుడిని కూడా పట్టుకోలేకపోయారు. కానీ గిరిజనులు నానా అవస్థలు పడ్డారు. వారోత్సవాల కారణంగా ఆర్టీసీ రాత్రిపూట సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. పగటిపూట కూడా మారుమూల ప్రాంతాలకు బస్సులు నడపలేదు.
మరికొన్ని సర్వీసులను దారి మళ్లించింది. దీంతో గిరిజనులు సంతలు, రోజువారీ పనుల కోసం కాలినడకన కిలోమీటర్ల కొలదీ నడిచి వెళ్లాల్సి వచ్చింది. పర్యాటకులు సైతం తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. దానివల్ల పర్యాటకంపై ఆధారపడిన గిరిజనులు నష్టపోయారు. మారు మూల ప్రాంతాల్లో పనులకు కూడా వెళ్లలేకపోయారు. వారపు సంతలు బోసిపోయాయి.