రైల్వే జోన్‌కు లైన్ క్లియర్ | The railway line to clear the zone | Sakshi
Sakshi News home page

రైల్వే జోన్‌కు లైన్ క్లియర్

Published Fri, Oct 10 2014 1:08 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

రైల్వే జోన్‌కు లైన్ క్లియర్ - Sakshi

రైల్వే జోన్‌కు లైన్ క్లియర్

  • రైల్వే ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష
  •  వీగిన ఒడిశా వాదన
  •  విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు రైల్వే డివిజన్లు!
  •  అన్నీ విశాఖ జోన్‌లోనే..
  • విశాఖపట్నం సిటీ : విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు లైన్‌క్లియర్ అయింది. హైదరాబాద్‌లో గురువారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రైల్వే ఉన్నతాధికారుల సమీక్షలో రైల్వే జోన్ అంశంపై నిర్ణయం తీసుకున్నారు. రైల్వే జోన్‌కు అవసరమైన అన్ని అర్హతలు విశాఖకే ఉన్నాయని గుర్తించారు. దీంతో కొత్త రైల్వే జోన్‌ల కోసం ఏర్పాటైన కమిటీ పని సులువైంది. ఇక జోన్ ప్రకటనే ఆలస్యం. ఈ నెల 15వ తేదీతో ప్రత్యేక రైల్వే జోన్ కమిటీ నివేదికను కేంద్రానికి ఇవ్వాల్సి ఉంది. దీంతో కమిటీ తన పనిని వేగవంతం చేస్తోంది. త్వరలోనే విశాఖను నవ్యాంధ్రకు రైల్వే జోన్‌గా ప్రకటించేందుకు మార్గం సుగమమయింది.
     
    ఫలించిన సుదీర్ఘ పోరాటం! : రాష్ట్ర పునర్విభజన బిల్లులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అంతకు ముందు నుంచే దశాబ్దాల కాలంగా విశాఖ లో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలనే ఆందోళనలు జరుగుతున్నాయి. పొరుగున ఉన్న ఒడిశా రైల్వే అధికారుల పెత్తనం కారణంగానే ఈ డిమాండ్ స్థానికుల్లో బలంగా నాటుకుపోయింది. విశాఖకు వచ్చే పలు రైళ్లను భువనేశ్వర్‌కు పొడిగించుకుపోవడంతో పాటు బెర్తుల్లో కోటాను ఆక్రమించేస్తుండడంతో విశాఖ వాసులు ఈ పోరాటాన్ని సుదీర్ఘకాలం నుంచి చేస్తున్నారు. కానీ రైల్వే జోన్ కోసం విజయవాడ, గుంటూరు రైల్వే డివిజన్లు పోటీపడ్డాయి.

    రాష్ట్ర రాజధాని ఉన్నచోటే రైల్వే జోన్ ఉండాలని ఆ ప్రాంతీయులు డిమాండ్ చేశారు. కానీ మొదటి నుంచి విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు బీజేపీ సుముఖంగా ఉంది. మొదటి నుంచి విశాఖలోనే రైల్వే జోన్ అంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పదేపదే ప్రకటించారు. మొదట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విజయవాడ పేరునే ప్రకటించినా పాలన వికేంద్రీకరణ నేపథ్యంలో జోన్ విశాఖనే వరించనుంది.
     
    నాలుగు డివిజన్లు! : విశాఖ కేంద్రంగా ఏర్పడే నూతన రైల్వే జోన్‌లో నాలుగు డివిజన్లు ఉంటాయి. వాల్తేరు, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు రైల్వే డివిజన్లను కలిపి ఒకే జోన్‌గా ఏర్పాటు చేయనున్నారు. తూర్పు కోస్తా రైల్వేలో ఉన్న వాల్తేరు డి విజన్‌ను విడదీసి కొత్త జోన్‌లో విలీనం చేస్తారు. దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న గుంటూరు, విజయవాడ, గుంతకల్లు డివిజన్లకు ఇక విశాఖ కేంద్రం కానుంది. వాల్తేరు జోన్‌ను వదులుకోలేమంటూ ఇప్పటి వరకూ అడ్డుకున్న ఒడిశా రైల్వే ఉన్నతాధికారుల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. జోన్ కేంద్రానికి అవసరమైన రైల్వే స్థలాలు, క్రీడా మైదానాలు, ఆస్పత్రులు, కార్యాలయాలన్నీ విశాఖలోనే భారీగా ఉండడంతో కమిటీ విశాఖను ప్రకటించక తప్పని పరిస్థితి నెలకొంది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement