రహదారి రాజసం
- ఎన్‌హెచ్‌ఏఐ చేతికి ఆనందపురం-అనకాపల్లి రహదారి
- విశాఖ సిటీలోని ఎన్‌హెచ్ రోడ్డు ఆర్ అండ్ బికి
- నగర ట్రాఫిక్ కష్టాల నుంచి కొంత ఉపశమనం
విశాఖ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు కొంతవరకు తెరపడనుంది. ప్రధానంగా నగరం గుండా వెళ్తున్న ఎన్.హెచ్16పై వాహనాల తాకిడి తగ్గిపోనుంది. ఎందుకంటే ఆనందపురం-అనకాపల్లి రాష్ట్ర రహదారిని జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)కు బదిలీ చేయనున్నారు. అనంతరం దాన్ని ఆరులేన్ల రహదారిగా అభివృద్ధి చేయనున్నారు.
- సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
ఆనందపురం-అనకాపల్లి రోడ్డుకు విస్తరణ యోగం పట్టనుంది. ఆరులైన్లుగా విస్తరిస్తే అటు చెన్నై ఇటు కోల్‌కత్తా వైపు వెళ్లాల్సిన భారీ వాహనాలు, లారీలు, ఇతర వాహనాలు విశాఖ నగరంలోకి రానవసరం ఉండదు. ఇక విశాఖ నగరం గుండా వెళ్తున్న ఎన్.హెచ్16ను ఆర్ అండ్ బి శాఖకు ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి శ్యాంబా బు, రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ(ఏపీఆర్‌డీసీ) ఎండీ జగన్నాథరావు బుధవారం విశాఖపట్నంలో పర్యటించి ఈమేరకు ప్రతిపాదనకు సూత్రప్రాయంగా ఆమోదించారు.
ఇదీ ప్రణాళిక: ప్రస్తుతం విశాఖ నగరం గుండా జాతీయరహదారి వెళుతుండటంతో భారీ వాహనాల తాకిడి ఎక్కువుగా ఉంది. నగరంలోకి రానవసరంలేని భారీ వాహనాలు, లారీలు కూడా ఇలాగే వెళ్తున్నాయి. జాతీయ రహదారికి ప్రత్యమ్నాయంగా ఆనందపురం-అనకాపల్లిల మధ్య 46కి.మీ. పొడవున 36 నెంబర్ రాష్ట్ర రహదారిని నిర్మించారు. కానీ అది డబుల్‌లేన్ రోడ్డు కావడంతో పూర్తిస్థాయిలో ప్రయోజనాన్ని ఇవ్వలేకపోతోంది.
ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రహదారిని ఎన్‌హెచ్‌ఏఐకి బదిలీ చేసి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కొంతకాలంగా చర్చల్లో నలుగుతున్న ఈ ప్రతిపాదన ఎట్టకేలకు కార్యరూపం దాల్చనుంది. ఆనందపురం-అనకాపల్లి రహదారిని తీసుకునేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సమ్మతించింది. 48కి.మీ. పొడవైన ఈ రహదారిని తీసుకుని ఆరులేన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 4లేన్లుగా ఉన్న చెన్నై-కోల్‌కత్తా ఎన్‌హెచ్ 16ను 6లేన్లుగా అభివృద్ధి చేయాలని ఇప్పటికే నిర్ణయించారు. అందులో భాగంగానే ఆనందపురం-అనకాపల్లి రహదారిని అభివృద్ధి పరుస్తారు. అందుకు మొదట ఆ రహదారిని జాతీయ రహదారుల సంస్థకు అప్పగించాలి.
అందుకోసమే రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యాం బాబు, ఏపీఆర్‌డీసీ ఎండీ జగన్నాథరావు ఆర్ అండ్ బి అధికారులతో కలసి విశాఖపట్నంలో పర్యటించారు. ఆనందపురం-అనకాపల్లి రహదారితోపాటు విశాఖనగరం గుండా వెళ్తున్న ఎన్.హెచ్.16 మీద రోజుకు సగటున ప్రయాణిస్తున్న వాహనాల సంఖ్య, ఇతర గణాంకాలను తెలుసుకున్నారు. అనంతరం ఆనందపురం-అనకాపల్లి రహదారిని ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తికావచ్చని భావిస్తున్నారు.
పూర్తిస్థాయిలో అభివృద్ధి
ఆనందపురం-అనకాపల్లి రహదారిని ఎన్‌హెచ్‌ఏఐ పూర్తిస్తాయిలో అభివృద్ధి చేయనుంది. ఈ రహదారిని నాలుగు లేన్లుగా తీర్చిదిద్దాలని ఆర్ అండ్ బి అధికారులు ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదిస్తున్నారు. కానీ నిధుల లేమితో ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం మరింత నిధుల కటకట ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఈ రహదారి విషయాన్నే పక్కనపెట్టేసింది. ఈ నేపథ్యంలోనే ఈ రహదారిని ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. దాంతో ఆనందపురం-అనకాపల్లి రోడ్డు ఎన్.హెచ్.16లో భాగమవుతోంది. దాన్ని 6లేన్లుగా అభివృద్ధి చేసే ప్రక్రియను చేపడుతుంది.
అందుకోసం అవసరమైన భూసేకరణ, ఇతరత్రా వ్యవహారాలన్నీ ఎన్‌హెచ్‌ఏఐ చూసుకుంటుంది. జిల్లాలోని ఆనందపురం-అనకాపల్లి రోడ్డునే మొదటగా 6లేన్లుగా అభివృద్ది చేయాలని భావిస్తోంది. ఆనందపురం-అనకాపల్లి రహదారికి ప్రత్యమ్నాయంగా ప్రస్తుతం విశాఖ నగరం గుండా వెళ్తున్న ఎన్‌హెచ్ 16ను ఆర్ అండ్ బి శాఖకు బదిలీ చేస్తారు. కాగా నగరం గుండా వెళ్తున్న ఈ రహదారిని జీవీఎంసీకి అప్పగించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలి.