జిల్లాలో దొంగలుపడ్డారు
జిల్లాలో దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. రాత్రీపగలూ తేడా లేకుండా... ఇళ్లు గుల్ల చేసేస్తున్నారు. దోపిడీలే కాకుండా అడ్డొచ్చిన వారిపై దాడులకు తెగబడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ మండలాల్లో వీరి దాష్టికానికి అడ్డూ.. అదుపూ లేకుండా పోతోంది. రైతులు పొలాల వద్ద ఉండే మోటార్ల నుంచి గుడిలోని హుండీలను కూడా వీరు వదలడం లేదు. ప్రజలు పెద్దసంఖ్యలో గుమిగూడి గ్రామాల్లో రాత్రిపూట గస్తీ కాస్తున్నారంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి/పుంగనూరు : జిల్లాలో దొంగల ముఠా హల్‌చల్ చేస్తోంది. పట్టపగలే దోపిడీలకు దిగుతోంది. ముఖ్యంగా పలమనేరు, మదనపల్లె ప్రాంతాల్లో దొంగలు యథేచ్ఛగా గ్రామాల్లోకి చొరబడి దొంగతనాలు చేస్త్తున్నారు. సంచలనం సృష్టించిన సైకో సూదిగాడు మాదిరి ఈ దొంగల ముఠా పోలీసులకు సవాల్ విసురుతోంది. 15 రోజులుగా దొంగతనాలు జరుగుతున్నా కట్టడి చేయడంలో పోలీసులు విఫలమవుతున్నా రు. గ్రామాల్లో ప్రజలు వణికి పోతున్నారు. యువకులు, ప్రజలు స్వచ్ఛందంగా రక్షక దళాలుగా ఏర్పడి గస్తీ నిర్వహిస్తున్నారు. ఒంటరిగా బయటికి పోవాలంటే ప్రజలు హడలిపోతున్నారు.
ముఖ్యంగా మహిళల ఒంటిపై ఉన్న నగలు, చివరకు మంగళ సూత్రాలను సైతం దొంగలు లాక్కెళుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. మదనపల్లె నియోజకవర్గం పరిధిలో దొంగలు మంగళవారం భూతంవారిపల్లె, ఎర్రపల్లె గ్రామాల్లో చొరబడి దొంగతనాలకు యత్నించారు. గ్రామస్తులు అందరు కలిసికట్టుగా ఒకటై దొంగలపై తిరగబడడంతో పారిపోయారు. రాత్రి వేళల్లో దాడులకు తెగబడుతారేమోనని ఆ అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
దొంగతనాల తీరిదీ...
ఆటోల్లో పగటిపూట గ్రామాల్లో వెళ్లి రెక్కీ నిర్వహించి, రాత్రి సమయంలో కరెంటు కోతలు ఎక్కువగా ఉండే మారుమూల గ్రామాలను ఎంపిక చేసుకొంటారు. 15 రోజుల ముందు బెరైడ్డిపల్లె, గంగవరం, పెద్దపంజాణి మండలాల్లోని గ్రామాల్లో దొంతనాలు జరిగాయి. రూ.3 లక్షలకు పైగా విలువ చేసే బంగారు నగలను దోచుకెళ్లారు. ఐదుగురు సభ్యులు కలిగిన ముఠా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పొట్టిగా నల్లగా ఉండి, ముఖాలకు మంకీ క్యాప్ వేసుకొని ఉన్నట్లు తెలుపుతున్నారు. వీరి దుస్తుల నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతోపాటు, చిన్న పాటి కత్తులు కూడా ఉన్నట్లు ప్రజలు తెలుపుతున్నారు.
వీరు తాళాలను ధ్వంసం చేయడంలో సిద్ధ హస్తులుగా భావిస్తున్నారు. ఇళ్లలోకి దూరి కత్తులు చూపించి దాడులకు తెగబడి మహిళల ఒంటిపైన ఉన్న నగలు లాక్కొని పారిపోతున్నారు. గ్రామాల్లో దొంగల భయం ఎక్కువగా ఉందని రక్షణ కల్పించాలని కొంత మంది రైతులు మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.