♦ మొబైల్ ట్రాక్ ఆధారంగా గుర్తింపు
♦ కర్నూలు పోలీసుల అదుపులో మధ్యప్రదేశ్ ముఠా
♦ కొనసాగుతున్న విచారణ
♦ త్వరలో వరంగల్‌కు తరలింపు
మామునూరు నాలుగో బెటాలియాన్‌లోని పోలీస్ క్వార్టర్స్‌లో చోరీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరిన దొంగల ముఠా పట్టుబడింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠాను కర్నూలు పోలీసు లు విచారిస్తున్నారు. త్వరలో వారిని వరంగల్‌కు తరలించనున్నారు.
వరంగల్ క్రైం : మామునూరు నాలుగో బెటాలియాన్‌లోని పోలీస్ క్వార్టర్స్‌లో చోరీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరిన దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మార్చి 23వ తేదీన బెటాలియాన్‌లోకి అర్ధరాత్రి ప్రవేశించిన దొంగలు ఆరు క్వార్టర్లలోని బంగారం, వెండి, నగదును దోచుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే పోలీస్ క్వార్టర్స్‌లోనే దొంగతనం జరగడంతో కంగుతిన్న జిల్లా పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసుల పరువుకు సంబంధించిన విషయం కావడంతో హుటాహుటిన ఆరు పోలీసు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దొంగల ముఠా కోసం ఆరా తీశారు. ప్రాథమిక దర్యప్తులో మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠా ఈచోరీలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. మొత్తం ఆరుగురు దొంగలు కారులో వచ్చి క్వార్టర్స్‌లో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది.
మొబైల్ ట్రాక్ ఆధారంగా దొంగల గుర్తింపు...
ఈ దొంగలను పట్టుకోవడానికి పోలీసులు మొబైల్ ట్రాకింగ్‌ను ఉపయోగించారు. మార్చి 23వ తేదీన రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు బెటాలియన్ ప్రాంతంలోని టవర్ నుంచి ఎన్ని ఇన్‌కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ ఉన్నాయనే అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టారు. అర్ధరాత్రి సమయంలో అనేక కాల్స్ రాగా మూడు కాల్స్‌పై మాత్రమే పోలీసులు దృష్టిపెట్టారు. ఈ మూడు కాల్స్‌కు సంబంధించిన ఐడెంటిటీని గుర్తించగా ఇవి మధ్యప్రదేశ్ అడ్రస్‌తో ఉన్నాయి. దీంతో మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠానే ఈ దోపిడీకి పాల్పడిందని నిర్ధారణకు వచ్చారు. కొన్ని నెలలుగా ఇక్కడే మకాం వేసిన దొంగలు బెటాలియన్ దోపిడీకి ముందు నాయుడు పెట్రోల్ పంపు సమీపంలోని శ్రీసత్యసాయినగర్‌లో వరుసగా మూడిళ్లలోనూ దోపిడీకి పాల్పడ్డారు. ఆ తర్వాత నెల ఆగి పక్కా రెక్కీ నిర్వహించి బెటాలియన్‌లో దోపిడీకి పాల్పడ్డారు.
కర్నూలుకు ఎలా వెళ్లారంటే...
బెటాలియన్‌లో దోపిడీకి పాల్పడిన తర్వాత ఆరుగురు దొంగల ముఠా తమతో తెచ్చుకున్న కారులో పయనమయ్యారు. మొదట ఖమ్మం రూట్‌లో వెళ్లారు. పోలీసులు తమను గుర్తిస్తారనే ఉద్దేశంతో పలుమార్లు జిల్లాలు మారుస్తూ వచ్చారు. ఖమ్మం చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నల్లగొండ జిల్లా సూర్యాపేట వైపు మళ్లారు. ఆ తర్వాత కోదాడకు చేరుకున్న దొంగలు మళ్లీ అనుమానం రాకుండా కర్నూలు వైపు వెళ్తున్నారు. దొంగల ఫోన్‌నంబర్లఆధారంగా మొబైల్ ట్రాకింగ్ చేస్తున్న పోలీసులు ఈ విషయాన్ని వరంగల్ ఉన్నతాధికారులకు చెప్పి కర్నూలు అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో కర్నూలు పోలీసులు అప్రమత్తమై కారులో ప్రయాణిస్తున్న దొంగలను అదుపులోకి తీసుకున్నారు.
చోరీ జరిగిన రెండు రోజుల్లోనే దొంగల ఆటకట్టించిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టడంతో నాలు గో బెటాలియన్‌తోపాటు నాయుడు బండ్ సమీపంలో శ్రీ సత్యసాయినగర్‌లో మూడిళ్లను దోచింది తామేనని ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతోపాటు కర్నూలులో అనేక దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకోవడంతో ప్రస్తుతం కర్నూలు జిల్లాకు సంబంధించి విచారణ జరుగుతోంది. కర్నూలు పోలీసుల విచారణ పూర్తయిన తర్వాత ఆ దొంగల ముఠాను వరంగల్‌కు తీసుకురానున్నారు. మొత్తానికి బెటాలియన్ దొంగలను 48 గంటల్లోపే గుర్తించి అదుపులోకి తీసుకున్న వరంగల్ పోలీసులు మరోమారు తమ ప్రతిభ చాటారు.
దొంగలు దొరికారు..
Published Mon, Apr 13 2015 1:32 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement