పాలకులకు పట్టాభిషేకం | The rulers of the Coronation | Sakshi
Sakshi News home page

పాలకులకు పట్టాభిషేకం

Published Fri, Jul 4 2014 1:40 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

The rulers of the Coronation

  • 8 మున్సిపాలిటీల్లో పాలకవర్గాల ఎన్నిక
  •  టీడీపీ 5, వైఎస్సార్‌సీపీ 3 కైవసం
  •  ఉయ్యూరులో టీడీపీ నీచ రాజకీయాలు
  • ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మున్సిపల్ పాలకవర్గాల ఎన్నిక ఎట్టకేలకు గురువారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో విజయవాడ కార్పొరేషన్, 8 మున్సిపాలిటీలకు పాలకవర్గాల ఎన్నిక నిర్వహించారు. దాదాపు మూడు నెలలుగా పాలకవర్గాల ఎన్నిక కోసం ఎదురుచూసిన మున్సిపాలిటీల నేతలు పాలకపగ్గాలు చేపట్టారు.
     
    సాక్షి, విజయవాడ :  స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి ఘట్టం పూర్తయింది. జిల్లాలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్‌కు అనుగుణంగానే ప్రిసైడింగ్ అధికారులు ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. విజయవాడ నగరపాలకసంస్థ సహా ఎనిమిది మున్సిపాలిటీల్లో గెలుపొందిన కౌన్సిలర్లు చేతులు ఎత్తి ఓటు వేసే ప్రక్రియ ద్వారా ఎన్నిక నిర్వహించారు. ఉయ్యూరు మినహా జిల్లా అంతా ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగింది.

    ఉయ్యూరులో మాత్రం అధికార పార్టీ నీచ రాజకీయాలకు దిగింది. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్‌ను ఓటు వేయటానికి రాకుండా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. జిల్లాలోని నూజివీడు, గుడివాడ, జగ్గయ్యపేట మున్సిపాలిటీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లకు చైర్మన్, వైస్‌చైర్మన్ గిరీలు దక్కాయి. మచిలీపట్నం, పెడన, తిరువూరు, నందిగామ, ఉయ్యూరు మున్సిపాలిటీలను టీడీపీ దక్కించుకుంది.

    జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో 218 వార్డులు ఉన్నాయి. వీటిలో 10 వార్డుల్లో కాంగ్రెస్, వామపక్షాలు, ఇతరులు గెలుపొందగా మిగిలిన 208 వార్డుల్లో 104 టీడీపీ, మరో 104 వార్డులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నాయి. సంఖ్యాపరంగా మాత్రం ఐదు మున్సిపాలిటీలు టీడీపీ ఖాతాలోకి వెళ్లగా మూడు మున్సిపాలిటీలు వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చాయి. విజయవాడ నగర మేయర్‌గా తొమ్మిదో డివిజన్ నుంచి గెలుపొందిన టీడీపీ కార్పొరేటర్ కోనేరు శ్రీధర్, 53వ డివిజన్ నుంచి గెలుపొందిన టీడీపీ కార్పొరేటర్ గోగుల వెంకట రమణారావు డిప్యూటీ మేయర్‌గా ఎన్నియ్యారు.
     
     మున్సిపాలిటీల్లో విజేతలు వీరే...
     జగ్గయ్యపేటలో వైఎస్సార్‌సీపీకి చెందిన తన్నీరు నాగేశ్వరరావు మున్సిపల్ చైర్మన్‌గా, ఎండీ అక్బర్ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 27 వార్డులకు గాను 17 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా, 10 స్థానాలు టీడీపీ దక్కించుకుంది.
     
     గుడివాడలో మున్సిపల్ చైర్మన్‌గా యలవర్తి శ్రీనివాసరావు, వైఎస్ చైర్మన్‌గా అడపా వెంకటరమణ ఎన్నికయ్యారు. వైఎస్సార్‌సీపీకి పూర్తి మెజారిటీ రావడంతో ఆ పార్టీ కౌన్సిలర్లు చైర్మన్, వైస్‌చైర్మన్ గిరీ దక్కించుకున్నారు. ఇక్కడ మొత్తం 36 వార్డులకు గాను 21 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందింది. మిగిలిన 15 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది.
     
     నూజివీడు మున్సిపాలిటీని కూడా వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. మొత్తం 30 వార్డులకు గాను 22 స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందగా ఏడుచోట్ల టీడీపీ విజయం సాధించింది. ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు బసవా రేవతి మున్సిపల్ చైర్మన్‌గా, అన్నే మమత వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
     
     నందిగామ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులు ఉండగా వాటిలో టీడీపీ 10 స్థానాలు, వైఎస్సార్ కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలుపొందాయి. ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించారు. చైర్‌పర్సన్ ఎన్నికల్లో వీరు టీడీపీకి మద్దతు పలికారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా యరగొర్ల పద్మావతి, వైస్ చైర్మన్‌గా వి.అశోక్‌కుమారి ఎన్నికయ్యారు.
     
     తిరువూరు మున్సిపాలిటీని టీడీపీ దక్కించుకుంది. ఆ పార్టీ కౌన్సిలర్లు మరకాల కృష్ణకుమారి, సోమవరపు నరసింహారావు, చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు గాను 12 టీడీపీ, 7 వైఎస్సార్‌సీపీ, ఒక స్థానంలో సీపీఎం గెలుపొందాయి.
     
     పెడన మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులు ఉండగా వాటిలో 12 స్థానాల్లో టీడీపీ, 11 స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలుపొందాయి. మున్సిపల్ చైర్మన్‌గా యర్రా శేషగిరిరావు, వైస్‌చైర్మన్‌గా అబ్దుల్‌ఖయ్యూమ్ ఎన్నికయ్యారు.
     
     మచిలీపట్నం మున్సిపాలిటీలో టీడీపీ కౌన్సిలర్లు చైర్మన్, వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలో 42 వార్డులు ఉండగా వాటిలో 29 స్థానాలను టీడీపీ, 12 స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ దక్కించుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలో గెలుపొందింది. మున్సిపల్ చైర్మన్‌గా మోటమర్రి వెంకట బాబాప్రసాద్, వైస్ చైర్మన్‌గా కాశీవిశ్వనాధరావు ఎన్నికయ్యారు.
     
     ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్‌గా జంపాన పూర్ణచంద్రరావు, వైస్‌చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాసబాబు ఎన్నికయ్యారు. ఈ నగరప ంచాయతీలో మొత్తం 20 వార్డులు ఉండగా, టీడీపీ, వైఎస్సార్‌సీపీ చెరో తొమ్మిది స్థానాల్లో గెలుపొందాయి. మరో రెండు స్థానాలను స్వతంత్రులు దక్కించుకున్నారు. స్వతంత్రుల మద్దతు, ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో టీడీపీ విజయం సాధించింది.
     
    ఉయ్యూరులో నీచ రాజకీయం

     ఉయ్యూరు మున్సిపాలిటీని దక్కించుకోవటానికి తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడింది. ఉయ్యూరులో వాస్తవానికి హంగ్ ఏర్పడింది. 20 వార్డులకు గాను వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు చెరి 9 వార్డులు దక్కించుకున్నాయి. రెండు వార్డుల్లో స్వతంత్రులు గెలుపొందారు. గతంలో వీరిలో ఒకరు వైఎస్సార్ కాంగ్రెస్‌కు, ఒకరు టీడీపీకి మద్దతు పలికారు. ఈ క్రమంలో ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో టీడీపీ మున్సిపల్ పీఠం దక్కించుకోవచ్చు. అయినా టీడీపీలో ఉన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో 10 మంది కౌన్సిలర్లు గ్రూపులుగా చీలిపోయారు. ఈ క్రమంలో ఇబ్బంది తలెత్తుతుందనే భావనతో తొమ్మిదో వార్డు నుంచి గెలుపొందిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ తుంగల పద్మను ఓటింగ్‌కు రాకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికిన స్వతంత్ర అభ్యర్థిని ప్రలోభాలతో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయించారు. దీంతో చైర్మన్ పీఠం టీడీపీ వశమైంది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement