సాక్షి ప్రతినిధి, విజయవాడ : కల్తీ మద్యం కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ‘సిట్’ దర్యాప్తు పూర్తయినట్లు విశ్వసనీయ సమాచారం. సిట్ బృందం సభ్యులు మాత్రం ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదని చెబుతున్నారు. సంఘటన జరిగి మూడు నెలలైంది. కల్తీ మద్యం వల్ల మృతి చెందిన కుటుంబాలను రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష నేతలు పరామర్శించారు. కుటుంబాలకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. మృతుల కుంటుంబాలకు సాయం చేస్తున్నామని ప్రకటించి తూతూమంత్రంగా సాయం చేసి చేతులు దులుపుకున్నారు. కల్తీ మద్యం కాటుకు గురైన వారు ఇంకా కొందరు చావలేక, బతకలేక మంచంలోనే ఉన్నారు. సుమారు 50మంది వరకు ఈ కల్తీ మద్యం బారిన పడ్డారు. అధికారికంగా 35మంది వరకు కల్తీ మద్యం బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు.
చాలామంది కల్తీమద్యం బారిన పడినవారిని కూడా సిట్ దర్యాప్తు బృందం విచారించింది. అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్నవారిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. పోలీస్ కస్టడీకి నిందితులను తీసుకొని విచారించిన తరువాత కూడా కేసు కొలిక్కి రాలేదు. సిట్ దర్యాప్తు పూర్తయినా కేసు మాత్రం ముగియలేదని సమాచారం. ఎందుకంటే మద్యం కల్తీ జరిగిందా? లేదా? అనేది సిట్ దర్యాప్తు బృందం నిర్ధారించలేదు.
కేసును సంపూర్ణంగా దర్యాప్తు చేపట్టిన సిట్ బృందానికి రెండు అనుమానాలు నేటికీ తీరలేదు. బార్‌లో వారు ఇచ్చిన నీళ్లు కలుపుకొని మద్యం సేవించిన వారు మృతి చెందారు. బయట మినరల్ వాటర్ కలుపుకొని మద్యం సేవించిన వారు కూడా మృతిచెందిన వారిలో ఉన్నారు. బార్‌లో నీళ్లు, బయట మినరల్ వాటర్ కలుపుకొని తాగిన వారు కూడా అస్వస్థతకు గురయ్యారు. మద్యంలో ఎవరో కావాలని కల్తీ కలిపి ఉంటారనేది బార్ వారు, నిందితుల వాదన. అదే నిజమనుకుంటే బార్‌లో నీటిని మద్యంలో కలిపి తాగినవారు మాత్రమే చనిపోవాలి. లేదా అస్వస్థతకు గురికావాలి. కానీ మద్యం బయటకు తెచ్చుకొని మినరల్ వాటర్ కలిపి తాగిన వారు కూడా బాధితులు కావడం వల్ల మద్యంలోనే కల్తీ జరిగి ఉంటుందని భావించాల్సి వస్తున్నది.
ఈ అనుమానాలకు పోలీసుల వద్ద సరైన సమాధానాలు లేవు. ఈ అనుమానాలు నివృత్తి అయితేనే సమస్యకు పరిష్కారం ఉంటుంది. మద్యం కల్తీ జరిగిందంటే అందుకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వమే తప్పు చేసిందని, బాట్లింగ్ కంపెనీల్లోనే మద్యం కల్తీ జరిగిందని సిట్ బృందం సభ్యులు నిర్ధారించే పరిస్థితుల్లో లేరు. పై వివరాలు పోలీస్ కమిషనర్‌కు ఇప్పటికే సిట్ బృందం సభ్యులు వివరించారు. అంటే దీనిని బట్టి సిట్ బృందం పోలీస్ కమిషనర్‌కు నివేదిక ఇచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుందని కొందరు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా నివేదిక రాలేదని సీపీ గౌతం సవాంగ్ చెబుతున్నారు.
‘సిట్’ దర్యాప్తు పూర్తి?
Published Tue, Apr 12 2016 1:28 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement