కొల్లిపర : రాజధాని సమీప మండలాల రైతులు పంటల మార్పిడికి సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజధాని నిర్మాణానికి సేకరించిన భూముల్లో ప్రస్తుతం సాగులో ఉన్న పంటే చివరిది. ఇక అక్కడ పంటలు వేసే అవకాశం లేదు. దీంతో ఆ పంట రకాలను సమీప మండలాల్లో సాగు చేస్తే లాభ దాయకంగా ఉంటుందని రైతులు ఆశపడుతున్నారు. దీనిలో భాగంగానే కొల్లిపర మండలంలో రైతులు పంట మార్పిడి, కొత్త రకాల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. రాజధాని నిర్మాణానికి సమీకరించిన భూముల్లో రైతులు ఇప్పటివరకు వరి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, మిరప, పత్తి పంటలను సాగు చేస్తున్నారు. అలాగే కూరగాయలు, పూలు, పండ్ల తోటలు కూడా సాగులో ఉన్నాయి.
సమీకరణ నేపథ్యంలో ప్రస్తుతం ఆ పంటలు అక్కడ పండించే అవకాశం లేదు. ఇది గమనించిన సమీప మండలాల రైతులు ఆ పంటలను తమ పొలాల్లో సాగు చేసేందుకు ఉపక్రమిస్తున్నారు. కొత్త రకం పంటల సాగుకు రైతులు మక్కువ చూపుతుండటంతో ఇక్కడి కూలీలకు ఆదాయం లభించే పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి కొల్లిపర మండలంలో రైతులు ఇప్పటి వరకు సాగు చేస్తున్న పంటల స్థానంలో కూరగాయల సాగు, పండ్లతోటల పెంపకం వైపు మరలుతున్నారు. ఆ దిశగా పొలాలను తయారు చేసుకుంటున్నారు.
ఈ ప్రాంతంలో నల్లరేగడి భూములు ఉండడం, సాగు నీరు పుష్కలంగా లభించడం రైతులకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఇప్పటివరకు ఇక్కడి రైతులు వాణిజ్య పంటలైన కంద, పసుపు, అరటి, చెరకు తదితర పంటలను మెట్ట భూముల్లో సాగు చేస్తున్నారు. అంతర పంటలుగా పూలు, కూరగాయల సాగు చేస్తున్నారు. కొద్ది మంది రైతులు మాత్రమే పూర్తి స్థాయిలో ఆకు, తీగజాతి కూరగాయలు సాగు చేస్తుంటారు. రెండేళ్ల క్రితం వరకు 50 ఎకరాల్లో మాత్రమే కూరగాయల సాగు చేసేవారు. ఈ ఏడాది 200 ఎకరాల్లో కూరగాయల సాగు చేపట్టారు.
ఈ ప్రాంత రైతులకు కలిసి వచ్చే అంశం...
ప్రధానంగా రాజధాని ప్రాంతంలో ఇప్పటివరకు రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, పూలను విజయవాడ, మంగళగిరి మార్కెట్లకు తరలించేవారు. ఇప్పుడిక అక్కడ వ్యవసాయం చేసే పరిస్థితి లేకపోవటంతో సహజంగా కూరగాయలు, పండ్లు, పూలకు మార్కెట్‌లలో కొరత ఏర్పడే అవకాశం ఉంది. దీంతో విజయవాడ, మంగళగిరి, తెనాలి, గుంటూరు ప్రాంతాలకు సమాంతర దూరంలో ఉన్న కొల్లిపర మండల రైతులు కొత్త పంటల సాగుకు ఆసక్తి చూపడం కలిసి వచ్చే అంశంగా మారింది.
కృష్ణాక రకట్టను అభివృద్ధి చేయాలి... కృష్ణానది కరకట్టను సకాలంలో అభివృద్ధి చేయకపోవటంతో దుగ్గిరాల, కొల్లిపర, కొల్లూరు తదితర మండలాల రైతులకు ఇబ్బందిగా మారింది. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించటానికి పలు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడకు దగ్గర మార్గం అయిన కరకట్టను అభివృద్ధి చేస్తే మరింత మంది రైతులు కూరగాయలు, పండ్లు, పూలు సాగు చేసే అవకాశం ఉంది.
అక్కడ మోళ్లు.. ఇక్కడ చిగుళ్లు
Published Sun, Mar 29 2015 3:40 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement