లోటులో రాష్ట్ర బడ్జెట్
బుచ్చిరెడ్డిపాళెం : రాష్ట్ర బడ్జెట్ రూ.16 వేల కోట్ల లోటులో ఉందని, అందుకే ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సమ యం పడుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. సోమవారం ఇస్కపాళెం పంచాయతీ అంబేద్కర్ నగర్, ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సామాజిక భద్రత పింఛన్ల తనిఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం క నీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఏర్పడిందన్నారు. రుణమాఫీకి రూ.45 వేల కోట్లు కేటాయించాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. పింఛన్ల పెంపు కూడా హామీలో భాగంగా నెరవేర్చాల్సి వచ్చిందన్నారు. రుణమాఫీకి సంబంధించి సాంకేతిక, పరిపాలన సమస్యలున్నందున తొలుత అక్టోబర్ 2న పింఛన్ల మొత్తాన్ని పంపిణీ చేయనున్నామన్నారు. త్వరలో రుణమాఫీ అమలు చేస్తామన్నారు. రాష్ట్ర పరిస్థితి మరో నెలలో గాడిలో పడనుందని, అప్పుడు వికలాంగులకు పింఛన్ ఇచ్చేందుకు 60 శాతం అర్హతగా గుర్తిస్తామన్నారు. పింఛన్ల తనిఖీల్లో కమిటీ సభ్యులు ఎదుర్కొన్న సమస్యలను సీఎంకు తెలియజేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి మరో నెలలో వివిధ విభాగాలను అనుసంధానం చేస్తూ ఏడు మిషన్లు, 5 గ్రిడ్లతో పరిపాలన సీఎం చంద్రబాబు చేయనున్నారని మంత్రి వివరించారు. ఎక్కువగా వనరులున్న జిల్లా నుంచి తక్కువగా ఉన్న జిల్లాలో ఆయా వనరులను వినియోగించుకోవడమే గ్రిడ్ల లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కురుగొండ్ల రామకృష్ణ, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ నేతలు బీద రవిచంద్ర, జెడ్పీటీసీ సభ్యుడు రొండ్ల జయరామయ్య, ఎంపీపీ దొడ్ల విజయలక్ష్మి, ఎంపీడీఓ చిలకల శ్రీహరిరెడ్డి, తహశీల్దార్ రామలింగేశ్వరరావు, సర్పంచ్ జూగుంట స్నేహలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి నారాయణ రాక 4 గంటల సేపు ఆల స్యం కావడంతో వృద్ధులు ఇబ్బంది పడ్డారు. మధ్యాహ్నం 3 గంటలకు మం త్రి వస్తారని అధికారులు చెప్పడంతో ఒంటి గంట నుంచే పడిగాపులు పడ్డారు.
అర్హులకు అన్యాయం చేయిస్తే ఊరుకునేది లేదు : మంత్రి
బాలాయపల్లి:అర్హులకు పింఛను రద్దు చేస్తే ఊరుకునేది లేదని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. సోమవారం మండలంలోని వెంగమాంబపురం, పచ్చారుచేను, బాలాయపల్లి గ్రామాల్లో పింఛన్ల అర్హత పరిశీలనలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనర్హుల పింఛన్లు మాత్రమే తొలగించాలని కమిటీ సభ్యులకు సూచించారు. కమిటీ ఇచ్చిన తొలగింపు జాబితాను త్వరలో పింఛను పరిశీలన బృందం పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలకు పింఛను, రైతులకు రుణమాఫీ చేస్తున్నారన్నారు. గతంలో కరెంట్ కష్టాలు ఉండేవని, నేడు ఆ కష్టాలు లేవన్నారు.
రైతులకు 7 గంటలు ఇస్తున్నామని, త్వరలో 9 గంటలు ఇస్తామన్నారు. ఏ ఫీడర్‌లో ఎంత కరెంట్ ఖర్చు అవుతుందో ప్రత్యేకమైన బృందాలు పరిశీ లిస్తున్నాయన్నారు. గ్రామాల్లో గృహవసరాలకు 14 గంటలు కరెంటు ఇస్తున్నామన్నారు.
డీఎస్పీపై మంత్రి ఆగ్రహం
మండలంలో 24 పంచాయతీల్లో బెల్టుషాపులు నిర్వహిస్తున్నా.. మీరు ఏమీ చేస్తున్నారని మంత్రి నారాయణ గూడూరు డీఎస్పీ చౌడేశ్వరిపై మండిపడ్డారు. రెండు రోజుల్లో మండలంలో బెల్టు షాపులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు అమ్మకుండా అధిక రేట్లకు అమ్మడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.