నేడు జిల్లాకు శాసనమండలి హామీల అమలు కమిటీ రాక
Published Wed, Dec 28 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM
కర్నూలు(అగ్రికల్చర్): శాసన మండలి హామీల అమలు (అస్యూరెన్స్)కమిటీ గురువారం కర్నూలుకు రానుంది. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు ఇచ్చిన హామీలు అమలయ్యాయా లేదా అనే విషయాలపై కమిటీ చైర్మన్ గాలి ముద్దుకృష్ణమనాయుడు, సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎం.సుధాకర్‌బాబు, పీజే చంద్రశేఖర్‌రావు, యండపల్లి శ్రీనివాసులు రెడ్డి కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో మధ్యాహ్నం 2 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాకు సంబంధించి శాసనమండలిలో సభ్యులు అడిగిన 25 ప్రశ్నల్లో చాలా వరకు ఇంతవరకు పరిష్కారం కాలేదు. కర్నూలు పేపర్ మిల్, బీడీ కార్మికులు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కార్డియాలజీ సర్జరీ యూనిట్ ఏర్పాటు, తుంగభద్రపై ప్రాజెక్టుల నిర్మాణం, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్డీఎస్‌కు సంబంధించి రాజోలిబండ రిజర్వాయర్, రాయలసీమ యూనివర్సిటీలోని నియామకాలలో రిజర్వేషన్‌ల అమలు, పశువులకు నీరు, మేత, రోడ్డు ప్రమాదాలు తదితర హామీల అమలుపై సమీక్ష నిర్వహిస్తారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్‌తో పాటు అస్యూరెన్స్‌కు సంబంధించిన జిల్లా అధికారులు పాల్గొంటారు.
Advertisement