స్టవ్ ప్రమాద బాధితుల్లో మరొకరు మృతి
=47 రోజులు మృత్యువుతో పోరాటం
=కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు
కైకలూరు, న్యూస్‌లైన్ : కైకలూరు సంతమార్కెట్ వద్ద నవంబరు 12న జరిగిన స్టవ్ ప్రమాద బాధితుల్లో మరొకరు ఆదివారం మృతిచెందారు. ఆస్పత్రిలో 47 రోజులుగా చికిత్స పొందుతున్న పశ్చిమగోదావరి జిల్లా కోమటిలంక గ్రామానికి చెందిన పెనుగొండ సలోమి (17) ఆదివారం తుదిశ్వాస విడిచింది. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఆరోజు బజ్జీల బండి వద్ద సలసల కాగే కళాయిలో నూనె చిమ్మడంతో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను విజయవాడలోని పలు ప్రైవేటు ఆస్పత్రులకు చికత్స కోసం తరలించారు.
వారిలో నలుగురు ఇంతకుముందు మృతిచెందగా, సలోమి చికిత్స పొందుతోంది. పూర్తి ఆరోగ్యంతో తిరిగి గ్రామానికి వస్తుందని ఆశగా ఎదురుచూసిన గ్రామస్తులకు ఆమె మరణవార్త విషాదాన్ని నింపింది. బజ్జీల బండి యజమాని తోట పోతురాజు, అడపా సుబ్బలక్ష్మి, కంభంపాటి మేరి సరోజిని, గురజ తేరేజమ్మ నవంబరు 19న చికిత్స పొందుతూ మరణించిన విషయం విదితమే.
సంఘటన జరిగిన రోజున సలోమి తల్లితో పాటు సంతమార్కెట్ వద్దకు వచ్చింది. ఇంటర్ వరకు చదివి కుట్టుమిషన్ పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు సోదరులు ఉన్నారు. ఆమె మృతితో కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. సోమవారం ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.