ఇక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు
కడప ఎడ్యుకేషన్ : ప్రవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. విద్యార్థుల సామర్ధ్యాలను తెలిపేందుకు నూతనంగా డీసీఈబీ ద్వారా ప్రోగ్రెస్ రిపోర్టును ప్రవేశ పెట్టింది. గతంలో చాలా సంవత్సరాల క్రితం ఈ పద్ధతి ఉండేది. కానీ కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం ఈ పద్ధతిని వదిలేసింది. మళ్లీ ఈ ఏడాది నుంచి 6 నుంచి పదవ తరగతి విద్యార్థులందరికీ ప్రోగ్రెస్ కార్డులను అందజే యనుంది. పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా విద్యార్థుల సామర్థ్యాలకు సంబంధించి మార్కులను వేసేందుకు అనువుగా కార్డులను తయారు చేసింది.
దీంతో పాఠశాల పనిచేసిన రోజులు, పాఠశాలకు విద్యార్థులు హాజరైన రోజులకు సంబంధించి నెల వారీగా గడులను ఏర్పాటు చేసి కార్డును ముద్రించారు. యూనిట్ పరీక్షలతోపాటు మూడు, ఆరు నెలల, సంవత్సర పరీక్షలకు సంబంధిచిన మార్కులను కూడా నింపుకునేందుకు గడులను ముద్రించింది. ప్రతి నెలకు ఒకసారి యూనిట్లలో వచ్చిన మార్కులతోపాటు పాఠశాల పనిదినాలు, విద్యార్థి హాజరు వంటి వివరాలను కార్డులో నింపి విద్యార్థి తల్లితండ్రులతో సంతకం చేయించుకుని వచ్చేలా సిద్ధం చేశారు.
జిల్లా వ్యాప్తంగా 6 నుంచి 10వ తరగతులకు సంబంధించి దాదాపుగా లక్ష మంది విద్యార్థులున్నట్లు విద్యాశాఖ లెక్క. ఇప్పటికి జిల్లా వ్యాప్తంగా 27 మండలాలకు గాను 40 వేలమంది విద్యార్థులకు పంపిణీ చేసినట్లు డీసీఈబీ సిబ్బంది తెలిపింది. మిగతావాటిని కూడా త్వరలో పంపిణీ చేస్తామన్నారు.