ఓ చోరీ కేసులో అనుమానితుడిగా ఉన్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేయడంతో.. అతని పరిస్థితి విషమంగా ఉంది. విచక్షణారహితంగా కొట్టడంతో పాటు మర్మాంగాలపై బూటు కాళ్లతో తన్నడంతో.. యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో అతన్ని జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాదితుని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
అమాయకుడిని పట్టకొని చితక బాదిన సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చే శారు. ఓ సందర్భంలో పోలీసులకు బాధితులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో బుధవారం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం పట్టణంలోని ఓ డాక్టర్ ఇంట్లో జరిగిన దొంగతనం విషయంలో సైదా అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో నలుగురు కానిస్టేబుల్స్‌తో కలిసి సైదాను తీవ్రంగా హింసించడంతో పాటు మర్మాంగం పై బూటు కాళ్లతో తన్నడంతో.. అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గుర్తించిన అతని కుంటుంబ సభ్యులు గుంటూరు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.