జాతీయ రహదారిపై ప్రమాదం
ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరు ఎంబీఏ విద్యార్థుల దుర్మరణం
వారిద్దరూ ఎంబీఏ పూర్తి చేశారు. ఇక ఉద్యోగంలో చేరి తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలనుకున్నారు. అంతలోనే వారిపై విధి చిన్నచూపు చూసింది. వారి ఆశలు.. ఆశయాలను చిదిమేసింది. కన్నవారికి కడుపుకోతను మిగిల్చింది. దువ్వూరు మండలం ఏకోపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులు దుర్మరణం చెందిన సంఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ విద్యార్థులు తిరుపతిలోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో చదివారు.
ప్రొద్దుటూరు క్రైం/దువ్వూరు (వైఎస్‌ఆర్ జిల్లా) కర్నూలులోని గుత్తిరోడ్ పెట్రోల్ బంకు వద్ద ఉన్న శారదానగర్‌లో నివాసముంటున్న మాసుంపీరా చిన్న కుమారుడు నబీరసూల్ తిరుపతిలోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కాలేజిలో ఎంబీఏ చదివాడు. ఇటీవల కాలేజిలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్‌లో హిందూజా గ్లోబల్ సొల్యూషన్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. ఏడాదికి రూ.3 లక్షలు జీతం తీసుకునేలా కంపెనీ నుంచి ఒప్పందం కుదర్చుకున్నాడు. కొన్ని రోజుల ప్రాజెక్టు వర్క్ అనంతరం ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈ క్రమంలో స్నేహితుడితో కలిసి బైకులో వెళుతూ ప్రమాదంలో మృతిచెందాడు. అదేవిధంగా కర్నూలు జిల్లా కల్లూరు మండలం మహాత్మానగర్‌కు చెందిన కురువ రామకృష్ణ రెండో కుమారుడు ప్రవీణ్ తిరుపతిలోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్నాడు. చిన్న హోటల్‌ను నిర్వహిస్తున్న రామకృష్ణ ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించాడు. ప్రవీణ్‌కు ఉద్యోగం వస్తే తమ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయని కలలుగన్న తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు.
తిరుపతిలో ఉన్న బైక్‌ను ఇంటికి తీసుకువస్తుండగా ప్రవీణ్ తన పల్సర్ బైక్‌ను తీసుకువెళ్లి తిరుపతిలో పెట్టుకున్నాడు. ఇటీవలే చదువు పూర్తికావడంతో బైక్‌ను ఇంటికి తీసుకురావాలని భావించాడు. ఈ క్రమంలో ప్రవీణ్, నబీరసూల్ బుధవారం రాత్రి తిరుపతిలో బైక్‌పై బయలుదేరారు. దువ్వూరు సమీపంలోని ఏకోపల్లిలో ఉన్న డాబా వద్ద ఆగి ఉన్న లారీ ని ఢీకొన్నారు. ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందగా, నబీరసూల్ తీవ్రంగా గాయ పడి ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందాడు. విషయం తెలియడంతో కర్నూలు నుంచి ఇరువురు విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
కన్నీరు మున్నీరైన స్నేహితులు
నిన్నటి వరకూ తమతో కలిసి ఉన్న ఇద్దరు స్నేహితులు మృత్యువాత పడడంతో మిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రవీణ్, నబీరసూల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్న సమాచారం అందడంతో చదలవాడ ఇంజినీరింగ్ కాలేజిలో చదువుకున్న వారి స్నేహితులు ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. వారి మృతదేహాలను చూసి బోరున విలపించారు.