రాష్ట్రంలో అనైతిక, అప్రజాస్వామిక పాలన..
తిరుపతి: ‘రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా అభద్రతా భావంలో ఉన్నారు. ప్రజాస్వామ్యం అథఃపాతాళానికి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అనైతిక, అప్రజాస్వామిక పాలన సాగుతోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపైనా ఉంది. ఇందుకోసం ‘సేవ్ డెమొక్రసీ’ పేరిట ఆన్‌లైన్ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నా..’అని చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్, స్పీకర్‌ల వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం సిగ్గు చేటని పేర్కొన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన శాసనసభ్యుడు మరో పార్టీలోకి వెళితే డిస్ క్వాలిఫై అవుతారని రాజ్యాంగం పదో షెడ్యూల్లో తెలియజేస్తున్నా, పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. తెలంగాణలో ఒక మాట, ఇక్కడో మాట మాట్లాడుతూ పార్టీ మారిన నలుగురు ఎమ్మెల్యేలను రాజ్యాంగానికి విరుద్ధంగా మంత్రులుగా చేయడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. దీనివల్ల రాష్ట్రంలో చెడు సాంప్రదాయం వేళ్లూనుకుంటోందనీ, దీన్ని అడ్డుకునేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలని చెవిరెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకోసమే సేవ్ డెమొక్రసీ పేరిట ఆన్‌లైన్ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు, ప్రజాస్వామ్య వాదులు దీనికి మద్దతుగా నిలబడాలని కోరారు. భావి తరాలకు న్యాయం అందించేందుకు చేయూతనివ్వాలన్నారు. నిరంతరం «నీతి వాక్యాలు వల్లించే సీఎం చంద్రబాబునాయుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి తిరిగి వాళ్లను గెలిపించుకుని మంత్రి పదవులు కట్టబెట్టాలన్నారు. నిజంగా ప్రజల్లో మద్దతుంటే, మీ పాలనను ప్రజలు సమర్థిస్తున్నారన్న నమ్మకం ఉంటే రాజీనామాలు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ఆ నలుగురూ ఉన్న ఒక్క స్థానంలోనైనా గెలువ గలరా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వాదులు ఆలోచించాలని చెవిరెడ్డి కోరారు. విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు పార్టీ నేతలు కేశవులు, మునీశ్వర్‌రెడ్డి, మాధవ్‌రెడ్డి, ఎం. చంద్రమోహన్‌రెడ్డి, చిన్ని కూడా పాల్గొన్నారు.