విశాఖ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలకు అనకాపల్లి, కశింకోట, మునగపాక, ఎస్.రాయవరం, రాంబిల్లి, య లమంచిలి మండలాల్లో గ్రామాలు నీట ముని గాయి. ఐదు రోజుల్లో కురిసిన వర్షాల కంటే ఆదివారం అధికంగా 9.15 శాతం వర్షపాతం నమోదైంది. దీంతో ఒక్క రోజే 140 గ్రామాలు నీట మునిగాయి. ఇతర ప్రాంతాలతో రవాణా సంబంధాలు తెగిపోయాయి. 34 ఇళ్లు 24 గంటలకుపైగా ముంపులోనే ఉన్నాయి. 1068 ఇళ్లు దెబ్బతినడంతో రూ.4.27కోట్లు నష్టం వాటిల్లింది. రోడ్లపై వరద నీటి కారణంగా అనకాపల్లి-విశాఖ, అనకాపల్లి-యలమంచిలి మధ్య మధ్యాహ్నం వరకు బస్సులు తిరగలేదు.
ఆర్టీసీ 180 సర్వీసులను రద్దు చేసింది. యలమంచిలి మండలం కొక్కిరాపల్లిని వరదనీరు ముంచెత్తడంతో అక్కడి గురుకులపాఠశాల మొదటి అంతస్తు పూర్తిగా మునిగిపోయింది. 600 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. అంతా పైఅంతస్తుకి వెళ్లి తలదాచుకున్నారు. ఉధృతి తగ్గాక అధికారులు వారిని తరలించారు. కశింకోట మండలంలో ఇద్దరు వరదల్లో చిక్కుకొని గల్లంతయినట్టు అధికారులకు సమాచారం అందింది. అయితే వారి జాడలేకపోవడంతో అధికారికంగా ధ్రువీకరించలేదు.
మునగపాకలో మేతకు వెళ్లిన రెండు గేదెలు కొండ చరియలు విరిగిపడి అక్కడికక్కడే మృతి చెందాయి. వాటికి కాపలాగా వెళ్లిన వ్యక్తి కాలికి గాయమవడంతో మండల ప్రత్యేకాధికారి చికిత్స నిమిత్తం విశాఖ తరలించారు. రాంబిల్లి మండలం దిమిలి , యలమంచిలి మండలం సోమలింగపాలెం వద్ద శారదా నదికి గండ్లు పడ్డాయి. జాతీయ రహదారిపైకి నాలుగు అడుగుల మేర వరద నీరు చేరింది. నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 40 మంది పోలీసులు అక్కడకు చేరుకొని వాహనాలను నియంత్రించారు. వరద ఉధృతి తగ్గాక ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
రంగంలోకి నేవీ
గ్రామాలు నీట మునగడంతో నేవీ రంగంలోకి దిగింది. 30 బోట్లతో 15 బృందాలు ముంపు గ్రామాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. కలెక్టరేట్ నుంచి ఆదివా రం ఉదయం అధికారులు సహాయక కార్యక్రమాలకు అవసరమైన సామాగ్రిని ముంపు గ్రామాలకు వ్యాన్లలో పంపించారు. నేవీతో పాటు 40 మంది సభ్యులతో కూడిన జాతీయ విపత్తుల స్పందన బృందం శ్రీకాకుళం నుంచి జిల్లాకు చేరుకుంది. అనకాపల్లిలో ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ఆహార, మంచినీటి ప్యాకెట్లు అందజేస్తున్నారు.
మరో నాలుగు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మంగళగిరి, అరక్కోణం నుంచి జిల్లాకు వస్తున్నాయి. జిల్లాలో మొత్తం 47 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల నుంచి 25 వేల మందిని ఆ కేంద్రాలకు తరలించారు. వారి కోసం 25 వేల ఆహారం, లక్షా 20 వేల మంచినీటి ప్యాకెట్లను సరఫరా చేశారు. అలాగే కొన్ని గ్రామాల ప్రజలకు 153.93 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. 37 వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. చాలా గ్రామాలు నీట మునగడంతో మంచినీటి సరఫరా పెద్ద ఇబ్బందిగా మారింది. వాహనాలు వెళ్లే ప్రాంతాలకు సోమవారం వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అవకాశం లేని ప్రాంతాల్లో మంచి నీటి ప్యాకెట్లను సరఫరా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
భారీగా నష్టం
వారం రోజుల పాటు కురుస్తున్న భారీ వర్షాలకు భారీ నష్టం వాటిల్లింది. వ్యవసాయ పంటలు 53947.5 ఎకరాల్లోను, ఉద్యానవన పంటలు 1787.5 ఎకరాల్లోను నీట మునిగాయి. జిల్లాలో 229 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు పాడయ్యాయి. వీటిని శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలంటే రూ.55.46 కోట్లు అవసరమని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నా రు. అలాగే పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి 179 కిలోమీటర్ల పరిధిలో 75 రోడ్లు, 11 భవనాలు దెబ్బతినడంతో రూ.1.77 కోట్లు నష్టం ఏర్పడింది.
అంధకారంలో 140 గ్రామాలు
ఈ వర్షాలకు జిల్లాలో 140 గ్రామాలు అందకారంలో మగ్గుతున్నాయి. 33 కేవీ సింగిల్ పోల్ కొట్టుకుపోవడంతో మాకవరపాలెం, నర్సీపట్నం, రోలుగుంట, చింతపల్లి మండలాల గ్రా మాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అలాగే ఎస్.రాయవరం మండలం ధర్మవరంలో ట్రాన్స్‌ఫార్మర్ నీట మునగడంతో ఆయా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద తగ్గిన ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ చర్యలు వేగంగా జరుగుతున్నాయి. ఇంకా అనేక గ్రామాలు నీటిలో ఉండడంతో వాటికి ఇప్పట్లో విద్యుత్ సరఫరాకు అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.
డీఆర్‌ఎంతో మాట్లాడిన కలెక్టర్
వర్షాలు కారణంగా విశాఖకు రావాల్సిన రైళ్లు మధ్యలోనే వెనుతిరుగుతున్నాయి. హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి విశాఖకు వచ్చే రైళ్లు తుని వద్ద నిలిపివేస్తున్నారు. దీంతో జిల్లా ప్రయాణీకులు అవస్తలు పడుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆదివారం డీఆర్‌ఎంతో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లావాసులను విశాఖకు సురక్షితంగా తీసుకువచ్చేందుకు గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు.
జిల్లాలో కనీవినీ ఎరుగని వర్షం
Published Mon, Oct 28 2013 1:33 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement