ఆన్‌లైన్‌లోనే వాహన యజమాని పేరు మార్పు
రాష్ట్రంలో ప్రథమంగా విశాఖ ఆర్టీఐలో అమలు
మర్రిపాలెం (విశాఖపట్నం): విశాఖపట్నం జిల్లా రవాణా శాఖలో ఆన్‌లైన్ సేవలు మరింత విస్తృతం చేశారు. ఆన్‌లైన్‌లోనే వాహన యజమాని పేరు మార్చే ప్రక్రియను బుధవారం నుంచి అమల్లోకి తెచ్చారు. రాష్ట్రంలో ప్రథమంగా విశాఖలో ఈ సేవలను ప్రారంభించారు. వాహన క్రయ, విక్రయాల సమయంలో యజమాని రవాణా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారు.
వాహన పత్రాలు తదితర వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంతో సులభంగా పేరు మార్పిడికి అవకాశం ఏర్పడింది. మొట్టమొదటిగా గతేడాది మార్చి నుంచి కొత్త వాహనాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను విశాఖ జిల్లాలో ప్రారంభించిన విషయం తెలిసిందే. త్వరలో జిల్లాలో మరిన్ని ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తేనున్నట్లు రవాణా శాఖ వర్గాలు తెలిపాయి.