ట్రాన్స్పోర్ట్ సేవలు ఆన్‌లైన్ ద్వారానే
Published Sat, Nov 12 2016 9:57 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM
జనవరి నుంచి నూతన విధానం అమలు
– ఇప్పటికే వాహనాల నెంబర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
– మరో 86 సేవలూ ఆన్‌లైన్ ద్వారానే..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: మీ వాహనాన్ని ఇతరులకు విక్రయించారా? ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రస్ మార్చుకోవాలా? అయితే, ఇక నుంచి ఈ సేవల కోసం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ ద్వారానే ఈ సేవలన్నీ చేసుకునే వీలు కలుగనుంది. ఇప్పటికే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆన్‌లైన్ చేసిన ప్రభుత్వం.. ఇక రవాణా శాఖలోని అన్ని లావాదేవీలను ఆన్‌లైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. జనవరి నెల 1వ తేదీ నుంచి కొత్త విధానాన్ని తెరమీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కేవలం డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్ పరీక్షలు మినహా మిగిలిన సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే పొందేందుకు వీలుగా రవాణాశాఖ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
దశల వారీగా అమలు
ప్రస్తుతం ఒక్క వాహన రిజిస్ట్రేషన్ మినహా అన్ని పనులకూ రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. అయితే, లావాదేవీల్లో రవాణాశాఖ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని రవాణాశాఖ అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి దశలో వాహనాల తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆన్‌లైన్ ప్రక్రియలో వాహన డీలర్ వద్దే చేపడుతున్నారు. తర్వాత దశల్లో మొత్తం 80కి పైగా సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. తద్వారా కేవలం డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనాల ఫిట్‌నెస్ పరీక్షల కోసం మాత్రమే రవాణాశాఖ కార్యాలయం గడప తొక్కాల్సి రానుంది.
నగదు రహిత దిశగా..
రవాణా శాఖలో ఏజెంట్ల వ్యవస్థ బలంగా ఉంది. ఎంత పకడ్బందీగా అమలు చేసినప్పటికీ ఏజెంట్లు.. రవాణాశాఖ సిబ్బంది మధ్య ఉన్న అనుబంధంతో లావాదేవీలను బట్టి అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. దీనిని ఇద్దరూ కలిపి పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు రవాణా శాఖ కార్యాలయంలో నగదు తీసుకునే అవసరమే లేకుండా అన్నీ ఆన్‌లైన్ ద్వారా చేపట్టాలని రవాణా శాఖ ఉన్నతాధికారులు నిర్ణయానికి వచ్చారు. ఇందులో భాగంగా వాహన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా డీలర్ వద్ద ఏర్పాటు చేశారు. ఇదే కోవలో మిగతా సేవలన్నీ ఆన్‌లైన్ చేస్తే అవినీతి తగ్గుతుందనేది ఉన్నతాధికారుల భావనగా ఉంది. తద్వారా వాహనాల ఫిట్‌నెస్, లైసెన్స్ పరీక్షలు మినహా సేవలన్నింటినీ ఆన్‌లైన్ ద్వారా అందించేందుకు రంగం సిద్ధం చేశారు.
Advertisement
Advertisement