రైతు సంక్షేమానికి పెద్దపీట | The welfare of the farmer leaders | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమానికి పెద్దపీట

Published Mon, Jan 27 2014 3:53 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

The welfare of the farmer leaders

  •     తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు
  •      మహిళా సాధికారతకు ప్రత్యేక చర్యలు
  •      ‘బంగారుతల్లి’లో రూ.కోటి ఆర్థిక సాయం
  •      గణతంత్ర వేడుకల్లో కలెక్టర్
  •  
    చిత్తూరు (జిల్లా పరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్లు కలెక్టర్ కె.రాంగోపాల్ తెలిపారు. చిత్తూరులోని పోలీసు పరేడ్ మైదానంలో ఆది వారం జరిగిన 65వ గణతంత్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వ్యవసాయ యాంత్రికీకరణ, సకాలంలో తిరిగి చెల్లించిన పంట రుణాలపై వడ్డీ మాఫీ చేస్తోందని చెప్పారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 2.48 లక్షల మంది రైతులకు రూ.1,234 కోట్లు, రబీలో ఇప్పటి వరకు 1.14 లక్షల మందికి రూ.589 కోట్లు పంపిణీ చేశామని వివరించారు.

    2012-13 ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో 33 మండలాలను రాష్ట్ర ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించిందన్నారు. సూక్ష్మనీటి పథకం కింద ఈ ఏడాది 11 వేల హెక్టార్ల లక్ష్యానికిగాను రూ.18 కోట్ల రాయితీతో 2,573 హెక్టార్లలో బిందుసేద్యం అమలు చేశామన్నారు. ఈ ఏడాది అదనంగా 18 వందల ఎకరాల్లో మల్బరీ సాగులోకి తెచ్చి పట్టుపరిశ్రమకు చేయూత ఇచ్చామని వివరించారు.

    పాడి రైతులకు సునందనీ పథకంలో 17,500 పేయదూడలకు సంబంధించి 75 శాతం రాయితీతో దాణా, బీమా, ఆరోగ్య పరిరక్షణ చేపట్టామన్నారు. 2.81 లక్షల వ్యవసాయ సర్వీసులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. ఉపాధిహామీలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు, చిన్నసన్నకారు రైతులకు 8,700 ఎకరాల్లో మామిడి మొక్కల పెంపకం చేపట్టామన్నారు. ఇందిర జలప్రభ ద్వారా 6,363 ఎకరాలలో 626 బోరుబావులు వేసి నీటి సదుపాయం కల్పించామన్నారు.
     
    రూ. 1152 కోట్ల వడ్డీలేని రుణ సౌకర్యం
     
    మహిళా సాధికారతలో భాగంగా ఇందిరక్రాంతి పథం కింద చేపట్టిన కార్యక్రమాల అమలులో రాష్ట్రంలో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని అధిగమించి 30,600 గ్రూపులకు రూ.1152 కోట్ల వడ్డీలేని రుణం అందించినట్లు చెప్పారు. పేద మహిళల అభ్యున్నతి కోసం స్త్రీనిధి పథ కం ద్వారా జిల్లాకు రూ.144 కోట్లు కేటాయించారన్నారు. ఇందులో 12,300 గ్రూ పులకు రూ.113 కోట్లు అందించామని వివరించారు. మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 112 పాలశీతలీకరణ కేంద్రా ల ద్వారా రోజుకు 3.6 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోందన్నారు. బంగారుతల్లి పథకం ద్వారా 4వేల మంది శిశువులకు కోటి రూపాయల ఆర్థికసాయం అందించామని పేర్కొన్నారు. పట్టణ ఇందిరక్రాంతి పథం ద్వారా ఈ ఏడాది రూ. 100 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు, స్త్రీనిధి కింద 1189 గ్రూపులకు రూ.10.15 కోట్ల రుణాలు మంజూరు చేశామన్నారు.
     
    తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు
     
    జిల్లాలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ రాంగోపాల్ తెలిపారు. కండలేరు నుంచి నీటి సరఫరాకు మౌలిక పెట్టుబడుల శాఖ ద్వారా రూ.7,390 కోట్లతో రెండు దశల్లో పనులు చేపట్టడానికి ప్రభుత్వం ఉత్తర్వులు మంజూరు చేసిందన్నారు. మొదటి దశలో 45 మండలాల పరిధిలోని 8,468 గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో రూ.4300 కోట్లు విడుదలయ్యాయన్నారు. జిల్లాలో ఇప్పటికే 157 గ్రామాల్లో ట్యాంకర్లు, వ్యవసాయ బోర్ల అనుసంధానంతో తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. భూమిలేని దళిత, బలహీన వర్గాలకు భూపంపిణీని ప్రభుత్వం ఓ యజ్ఞంగా చేపట్టిందన్నారు.
     
    విద్యాభివృద్ధికి కృషి
     
    అందరికీ విద్య అందించాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పాఠశాలల్లో 1175 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.64.48 కోట్లు కేటాయించామన్నారు. 217 పాఠశాలల్లో ప్రహరీగోడలు, మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుద్దీకరణ పనులను రూ.5.64 కోట్లతో పూర్తి చేశామన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు 22 భవితా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది ఎస్సీ సబ్‌ప్లాన్ కింద మూడు సమీకృత వసతి గృహాల నిర్మాణాన్ని రూ.9 కోట్లతో, నాలుగు కళాశాలల వసతి గృహాల నిర్మాణాన్ని రూ.12.5 కోట్లతో చేపట్టామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 5,700 మంది ఎస్సీ లబ్ధిదారులకు రూ.35.5 కోట్లతో ఆర్థికాభివృద్ధి పథకాలను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

    గిరిజన సంక్షేమానికి రూ.3.48 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమశాఖ ద్వారాజిల్లాలో 3,640 అంగనవాడీ కేంద్రాల్లో పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు పోషకాహారాన్ని అందిస్తున్నామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ ఏడాది 14,800 మందికి శస్త్ర చికిత్స కోసం రూ.39.42 కోట్లు అందించామన్నారు. ప్రజారోగ్యశాఖ ద్వారా జిల్లాలోని అన్ని మున్సిపాల్టీల్లో నీటి సరఫరా అభివృద్ధి పనులకు రూ.22 కోట్లు ఖర్చు చేశామన్నారు.

    రాజీవ్ యువకిరణాల కింద డీఆర్‌డీఏ, మెప్మా, ఉపాధి కల్పన, సాంకేతిక విద్యాశాఖల ద్వారా ఈ ఏడాది 4,600 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించామన్నారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు సహకరించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జేసీ బసంతకుమార్, జిల్లా జడ్జి రవిబాబు, ఎస్పీ రామకృష్ణ, ఏజేసీ వెంకటసుబ్బారెడ్డి, డీఆర్‌వో శేషయ్య, ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement