అలంపూర్/వనపర్తి/మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: సురక్షిత ప్రయాణాలకు నిదర్శనంగా నిలిచే బస్సులు మృ త్యువు శకటాలుగా మారుతున్నాయి. గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవడానికి బస్సులను ఆశ్రయించేవారు మృత్యుబారిన పడుతున్నారు. అందుకు నిదర్శనమే జిల్లాలోని కొత్తకోట మండలం పాలెం గ్రామం వద్ద జరిగిన దుర్ఘటన. జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న 45 మంది ప్రయాణికులు అగ్నికిఆహుతయ్యారు. బెంగళూరు నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఇతరప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్న ఎందరో ప్రయాణికులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా పుల్లూరు నుంచి కొత్తూరు మండలం తిమ్మాపూర్ వరకు సుమారు 160 కి.మీ విస్తరించి ఉన్న 44వ జాతీయ రహదారి వందలాది మంది ప్రయాణికులను హరించివేస్తోంది. అలాగే అలంపూర్ నియోజకవర్గంలో ఇలాంటి ఎన్నో సంఘటనలు చోటుచేసుకున్నారు. హైదరాబాద్ నుంచి రాత్రి 9 గంటల ప్రాంతంలో బస్సులు అధికసంఖ్యలో బయలుదేరుతాయి. హైవేపై అలంపూర్ చౌరస్తా, కోదండాపూర్ స్టేజీ, ఎర్రవెల్లి చౌరస్తా, పెబ్బేర్, కొత్తకోట బైపాస్‌రోడ్లు, అడ్డాకుల మండలం కనిమెట్ట, వెల్టూర్, కొమ్మిరెడ్డిపల్లి, మూసాపేట, జానంపేట గ్రామాల వద్ద అధికంగా ప్రమాదాలు జరుగుతాయని ఎన్‌హెచ్, పోలీస్ అధికారులు గుర్తించినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
కృష్ణానదిలోకి దూసుకెళ్లిన బస్సు
కడప జిల్లా రాయచోటి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు(ఏపీ9 జెడ్ 5212)1993 అక్టోబర్‌లో ఇటిక్యాల మండలం బీచుపల్లి వద్ద ఉన్న కృష్ణానదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బ స్సులో ఉన్న 36 మంది జలసమాధి అయ్యారు. అదేవిధంగా ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పెబ్బేరు మండలం రంగాపూర్ వద్ద ఇదే కృష్ణానదిలో 1994లో పడింది. ఈ ప్రమాదంలో 42 మందిని మృత్యువు కబళించింది. అదేవిధంగా ఇటిక్యాల మండలం మునగాల గ్రామ శివారులో 2002లో ఆర్టీసీ బస్సుకు నిప్పంటుకుని బస్సులో ప్రయాణిస్తున్న 16 మంది సజీవ దహనమయ్యారు.
ఈ ప్రమాదంలో అనేక మంది గాయలతో ప్రాణాలు దక్కించుకున్నారు. 2010 డిసెంబర్‌లో గద్వాలకు చెందిన ఓ కుటుంబం తమ కొడుకుకు వైద్యచికిత్సల కోసం సుమోలో కర్నూలుకు వెళ్తుండగా.. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపునకు వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమోలో ఉన్న ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. 2011లో మహారాష్ట్ర నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్తున్న మినీ బస్సు కోదండాపూర్ సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద గల పీజీపీకాల్వలోకి దూసుకెళ్లడంతో నలుగురు దుర్మరణం చెందారు. 2012లో మిడ్జిల్ మండలానికి చెందిన ఓ కాంట్రాక్టర్ కుటుంబం తిరుపతి దైవదర్శనానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా కోదండాపూర్ బస్టాపులో ఆగిఉన్న లారీని ఢీకొని నలుగురు మృతిచెందారు.
74 మందిపైకి దూసుకెళ్లిన లారీ
ప్రస్తుతం కొత్తకోట మండలం పాలెం గ్రామం వద్ద బస్సుదగ్ధమైన స్థలానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే 1971లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 74 మంది మృత్యువాతపడ్డారు. గ్రామంలోని ఆ గ్రామపటేల్ ఇంటి ఆవరణలో వీధినాటికను చూస్తున్న వారిపైకి వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 74 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అప్పట్లో దీన్ని దేశంలోనే అతి దురదృష్టకరమైన సంఘటనగా భారత ప్రభుత్వం ప్రకటించింది. 40ఏళ్ల తరువాత అలాంటి దుర్ఘటనే జరగడం పాలెం వాసులను తీవ్రంగా కలిచివేసింది.
అదే ఘోరం.. తీరని శోకం
Published Thu, Oct 31 2013 3:14 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement