పరస్పర, రిక్వెస్ట్‌ బదిలీలు మాత్రమే.. | There are no regular transfers | Sakshi
Sakshi News home page

పరస్పర, రిక్వెస్ట్‌ బదిలీలు మాత్రమే..

Published Thu, May 3 2018 3:23 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

There are no regular transfers - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సర్కారు తెరతీసింది. అయితే సాధారణ బదిలీలకు అవకాశమివ్వకుండా కేవలం పరస్పర, రిక్వెస్ట్‌ బదిలీలకు మాత్రమే వీలు కల్పించింది. ఈ నెల 5వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పిస్తూ.. ఆ నెల రోజులపాటు బదిలీలపై నిషేధాన్ని సడలించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఇన్‌చార్జి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.రవిచంద్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి బదిలీలపై తిరిగి నిషేధం అమల్లోకి వస్తుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఒకేచోట మూడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పరస్పర లేదా రిక్వెస్ట్‌ బదిలీలు కోరేందుకు అర్హులని స్పష్టం చేశారు. రిక్వెస్ట్‌ బదిలీలకు కోరిన చోట ఖాళీ ఉంటేనే అనుమతించాలని నిబంధనల్లో తేల్చిచెప్పారు. కంటిచూపు లేనివారు, 40 శాతంపైన అంగవైకల్యం ఉన్నవారు, భార్య, భర్తల కేసులకు బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మానసిక వైకల్యమున్న పిల్లల వైద్య సౌకర్యం,  కారుణ్య నియామకం, వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యమిస్తారు. వైద్యపరమైన అంశాలకు(మెడికల్‌ గ్రౌండ్స్‌) కూడా ప్రాధాన్యమివ్వనున్నారు. 

అంతా ఆన్‌లైన్‌లోనే..
బదిలీల కోసం ఆన్‌లైన్‌లో ఐటీ దరఖాస్తులనే చేయాలి. పరస్పర, రిక్వెస్ట్‌ బదిలీలకు ఆన్‌లైన్‌లో ఈ నెల 15వ తేదీలోగా సంబంధిత అథారిటీకి దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించి ఈనెల 30వ తేదీలోగా బదిలీల ఆదేశాలు ఇస్తుంది. బదిలీ అయిన ఉద్యోగులు జూన్‌ 4వ తేదీలోగా చేరాలి. ఈ బదిలీలు.. అన్ని శాఖలతోపాటు ఆదాయ ఆర్జన శాఖలైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్, రవాణా, వైద్య ఆరోగ్యం, వ్యవసాయశాఖలకు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్య, సంక్షేమ శాఖల్లో నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులకే ఈ బదిలీలు వర్తిస్తాయన్నారు. ఉన్నత విద్య, ప్రాథమిక, సెకండరీ విద్య, సాంకేతిక విద్య, ఇంటర్మీడియట్, కాలేజీ విద్య, సంక్షేమ శాఖల రెసిడెన్షియల్‌ విద్యాశాఖలకు చెందిన టీచింగ్‌ సిబ్బందికి ఈ బదిలీలు వర్తించవని స్పష్టం చేశారు.  రిక్వెస్ట్‌ బదిలీలకు టీఏ, డీఏలు వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement