రెప్పవాల్చిన నిఘా నేత్రం
నూజివీడు : పెచ్చుమీరుతున్న నేరాలను అదుపు చేసేందుకు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు రెవెన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసు నిఘా నేత్రంఅధికారులు గాలికొదిలేశారు. రెండేళ్ల క్రితం నూజివీడులో రోడ్లపైనే బంగారు గొలుసులు తెంపుకొనిపోవడం, ఇళ్లలో పట్టపగలే చోరీలకు పాల్పడటం, ఆ క్రమంలో ప్రాణాలు తీసేందుకూ వెనకాడకపోవడం వంటి ఘటనలు విచ్చలవిడిగా జరిగాయి.
2012లో పట్టపగలు మధ్యాహ్న సమయంలో మహిళ మెడలోని బంగారు గొలుసులు లాక్కొని హత్యచేసిన ఘటనలో నిందితులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభ్యంకాని నేపథ్యంలో సీసీ కెమెరాల ఆవశ్యకతను గుర్తించారు. పట్టణంలోని చిన్న గాంధీబొమ్మ సెంటర్, సింగ్ హోటల్ సెంటర్, బస్టాండు సెంటర్‌ల వద్ద అప్పటి ఎస్‌ఐ ఐవీ నాగేంద్రకుమార్ దాతల సహకారంతో వీటిని ఏర్పాటుచేశారు. వీటి పర్యవేక్షణ కోసం చిన్నగాంధీబొమ్మ సెంటర్‌లో ఒక కంప్యూటర్ గదిని కూడా కేటాయించారు. సీసీ కెమెరాల కారణంగా అప్పట్లో చైన్ స్నాచింగ్‌లు, ఈవ్‌టీజింగ్‌లు, ట్రాఫిక్ ఉల్లంఘనలు అదుపులోకి చాలావరకు తగ్గాయి.
కొరవడిన పర్యవేక్షణ...
సీసీ కెమెరాలను ఏర్పాటుచేసిన కొత్తలో కొద్దిరోజులపాటు బాగానే నిర్వహించినా.. అనంతర కాలంలో వాటి నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో నిఘా నేత్రాలు నిరుపయోగంగా మారాయి. కొన్ని రోజులు మాత్రమే పనిచేసిన ఈ సీసీ కెమెరాలు ఆ తర్వాత పనిచేయడం లేదు. పోలీసు అధికారులు కూడా వాటిని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. సీసీ కెమేరాల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన గది కూడా ఖాళీచేయడం గమనార్హం.
తీవ్ర నేరాలు జరిగితే గుర్తించడం ఇబ్బందే...
సీసీ కెమెరాలు వినియోగంలో లేని నేపథ్యంలో గతంలో మాదిరిగా తీవ్ర నేరాలు జరిగితే పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. సంఘ వ్యతిరేక శక్తుల కార్యకలాపాలను పసిగట్టడానికి, నేరాలను నిరోధించడానికి ఉపయోగపడే సీసీ కెమెరాలను పునరుద్ధరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.