బోధకులు లేక.. బోధనెలా?
► వర్సిటీలో రెగ్యులర్ బోధకుల కొరత
► కాంట్రాక్టు సిబ్బందితోనే నెట్టుకొస్తున్న వైనం
ఎచ్చెర్ల క్యాంపస్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం 2008 జూన్ 25న ఏర్పాటైంది. ఇక్కడ అన్నింటికంటే ప్రధాన సమస్య రెగ్యులర్ బోధకుల నియామకం జరగకపోవడం, ప్రస్తుతం యూనివర్సిటీలో 12 మంది మాత్రమే రెగ్యులర్ బోధకులు ఉన్నారు. వీరిలో వర్సిటీ పాలనాపరమైన కీలక బాధ్యతల్లో కొందరు ఉన్నారు. రూరల్ డెవలప్‌మెంట్‌లో ఇద్దరు ప్రొఫెసర్లు ఉండగా.. ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య ఇన్‌చార్జి వీసీగా ఉన్నారు. ప్రొఫెసర్ పెద్దకోట చిరంజీవులు ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఇద్దరు రెగ్యులర్ ప్రొఫెసర్లు ఉండగా.. ప్రొఫెసర్ గుంట తులసీరావు రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు ఎగ్జామినేషన్స్ డీ¯న్‌గా వ్యవహరిస్తున్నారు. ఎకనామిక్స్‌లో ఒక ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య ఉండగా.. ఆయన చీఫ్ వార్డెన్‌గా వ్యవహరిస్తున్నారు. బయోటెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ పీలా సుజాత ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. మరో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. సోషల్ వర్కులో ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండగా.. డాక్టర్ గంజి సంజీవయ్య జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఇలా కీలకమైన బాధ్యతల్లోనే కొందరు ఉన్నారు.
రెండుసార్లు నోటిఫికేషన్ జారీ చేసినా..: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ బోధకులు నియామకానికి రెండుసార్లు నోటిఫికేషన్లు జారీ చేశారు. అయినా నియామకాలు మాత్రం చేపట్టలేదు. 2013 సంవత్సరం జూన్ 22న 34 పోస్టులకు.. 2014 మార్చి 1న 15 పోస్టుల నియామకానికి నోటిఫికేషన్లు జారీ చేశారు. వర్సిటీలో ఆరు ప్రొఫెసర్, 10 అసోసియేట్ ప్రొఫెసర్లు, 33 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులకు గతంలో ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే నేటికీ నియామకాలు జరగలేదు. వర్సిటీ ఏర్పడిన సమయంలో అరుగురు మాత్రమే ఇక్కడ ఉండేందుకు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. 22 మంది మాతృసంస్థ ఏయూకు వెళ్లి పోయారు. ఆ స్థానంలో సైతం పోస్టులు వర్సిటీలో భర్తీ కాలేదు. 2009లో కొత్తగా ప్రారంభించిన బయోటెక్నాలజీలో నలుగురు, సోషల్‌వర్కులో ముగ్గురు బోధన సిబ్బందిని మాత్రమే నియామకాలు చేపట్టారు. ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో కామన్ పాలసీ వంటి కొత్త రిక్రూట్ మెంట్ విధానాన్ని ప్రభుత్వం తెరమీదకు తెస్తోంది. దీంతో న్యాయపరమైన సమస్యలు ఏర్పడుతున్నాయి. ఫలితంగానే నియామకంలో జాప్యం జరుగుతోంది. రెగ్యులర్ బోధకులు లేకపోతే.. బోధన కుంటుపడే ప్రమాదం ఉంది.
ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం.. : ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫె సర్ల నియామకంలో ప్రభుత్వం కామన్ పాలసీ విధానం, స్క్రీనింగ్ టెస్ట్ వంటి అంశాలను తెరపైకి తెస్తోం ది. దీంతో న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి. వర్సిటీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్లు –10 పోస్టులకు సంబంధించి పాలక మండలిలో చర్చించి, ఉన్నత వి ద్యా శాఖ అధికారులు దృష్టికి తీసుకువెళతాం. నియామకాలకు చర్యలు తీసుకుంటాం. రెగ్యులర్ పోస్టుల నియామకంతోనే విద్యబలోపేతం అవుతుంది. -- ప్రొఫెసర్ మిర్యాల చంద్రయ్య, ఇన్‌చార్జి వీసీ, డాక్టర్ బీఆర్‌ఏయూ.