సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లుగా చేస్తున్న విదేశీ పర్యటనలు చర్చనీయాంశంగా మారాయి. వెళ్లిన ప్రతీచోటు నుంచి వెల్లువలా రూ.వేల కోట్ల పెట్టుబడులు.. లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నట్లు ఆయన చేస్తున్న ప్రకటనలు ఎక్కడా వాస్తవ రూపం దాల్చడంలేదు. 2014 జూన్‌లో అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఆయన మొత్తం 13 దేశాల్లో పర్యటనలు చేశారు. వీటిలో సింగపూర్, జపాన్, చైనా, లండన్, అమెరికా, దుబాయ్, స్విట్జర్లాండ్ దేశాల్లో ఎక్కువసార్లు పర్యటించారు. ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలా రాష్ట్రాన్ని మార్చేస్తామని చెప్పడం తప్ప చేసింది ఏమీలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కోట్లాది రూపాయల ఖర్చుతో చేస్తున్న విదేశీ పర్యటనలవల్ల ఇప్పటివరకు సాధించిందేమిటన్న దానిపై ఇప్పుడు అధికార వర్గాల్లో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వరుసగా నాలుగేళ్ల నుంచి హాజరవుతున్నా ఎటువంటి ఫలితం కనిపించడంలేదు. ఆయన జరుపుతున్న పర్యటనల్లో ఎక్కువగా ఉపయోగంలేని సదస్సులు, సమావేశాలే జరుగుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు గత జనవరిలో జరిగిన దావోస్ సదస్సులో.. రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కోసం సౌదీ అరామ్‌కో సంస్థతో జరిగిన చర్చలను ఉదహరిస్తున్నారు. అంతేకాక..
- 2017లో జరిగిన దావోస్ సదస్సులోనూ ఇదే అంశంపై అదే సంస్థతో చంద్రబాబు చర్చలు జరిపి ఆ దేశ బృందాన్ని ఇక్కడికి రప్పించారు. కానీ, అవేమీ ఫలప్రదం కాలేదు. మరోవైపు.. ఈ సంస్థ 2012లోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు అదే సంస్థతో రెండేళ్లుగా చర్చలు జరుపుతున్నారు.
- సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ వెళ్లి ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత మరో రెండుసార్లు అక్కడికెళ్లినా పెట్టుబడులు శూన్యం. సింగపూర్‌లోని సెంటోసా టూరిజం స్పాట్‌లా విజయవాడలోని భవానీ ద్వీపాన్ని మార్చేస్తామని ఆ దేశం వెళ్లినప్పుడు ప్రణాళికలు రూపొందించినా ఇప్పటివరకూ దానిపై అడుగు ముందుకుపడలేదు. అక్కడి నుంచి పెట్టుబడులు తేకపోగా రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగే రీతిలో ఆ దేశ కంపెనీలకు అప్పగించడంపై దుమారం రేగింది.
- జపాన్‌కు వెళ్లి ఏమీ సాధించకపోగా మన విద్యాలయాల్లో జపాన్ భాషను ప్రవేశపెడతామని ప్రకటించారు. చైనా పర్యటనకు వెళ్లి షాంఘైలా అమరావతి నిర్మిస్తామని, జపాన్ వెళ్లినప్పుడు టోక్యోలాంటి రాజధాని నిర్మిస్తామని ప్రకటనలు చేశారు.
- అమెరికా పర్యటనకు వెళ్లి విశాఖపట్నానికి టెంపుల్‌టన్ సంస్థను తీసుకొస్తామని, రాష్ట్రంలో ఏరో సిటీ నిర్మిస్తామని చెప్పారు.
- గత ఏడాది అక్టోబర్‌లో దుబాయ్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు మళ్లీ మొన్న ఫిబ్రవరిలో వెళ్లారు. భాగస్వామ్య సదస్సు ద్వారా పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఈ పర్యటనకు వెళ్లినట్లు చెప్పారు. కానీ, అబుదాబికి చెందిన పారిశ్రామికవేత్త బీఆర్ శెట్టితో లావాదేవీల నేపథ్యంలోనే ఆయన ఈ పర్యటన జరిపినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత జనవరిలో దావోస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆయన మధ్యలో అబుదాబిలో ఆగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గత ఏడాది అక్టోబరులో జరిగిన దుబాయ్ పర్యటనలో చంద్రబాబు కార్యక్రమాలన్నీ బీఆర్ శెట్టి పర్యవేక్షించారు. దుబాయి నుంచి రాజధాని డిజైన్లపై చర్చించేందుకు లండన్ వెళ్లిన చంద్రబాబు బీఆర్ శెట్టిని కూడా తీసుకెళ్లడం గమనార్హం.
ఖజానాకు రూ.100 కోట్ల భారం
నాలుగేళ్లలో చంద్రబాబు జరిపిన విదేశీ పర్యటనలవల్ల రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేకపోయినా ఖజానాకు బాగా చమురు వదిలింది. దేశంలో ఏ సీఎం వ్యవహరించని విధంగా చంద్రబాబు ప్రత్యేక విమనాల్లో, హెలికాప్టర్లలో ప్రయాణం చేస్తున్నారు. చంద్రబాబు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు గత నాలుగేళ్లలో రూ.100 కోట్లు వెచ్చించారు. గన్నవరం విమనాశ్రయంలో బాబు ప్రత్యేక విమానం, హెలికాప్టర్ పార్కింగ్ చేసి ఉంటుంది. పార్కింగ్ చేసి ఉంచినందుకు కూడా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు చెల్లించాల్సి వస్తోందని.. అలాగే పైలట్లకు స్టార్ హోటల్స్‌లో బస ఏర్పాటుచేయాల్సి వస్తోందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెగ్యులర్ ఫ్లైట్లున్నా ప్రత్యేక చార్టెడ్ విమానాల్లో తిరగడాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన అజేయ్ కల్లాం తాను రాసిన మేలుకొలుపు పుస్తకంలో తప్పుబట్టారంటే సీఎం ఎలా దుబారా చేశారో తేటతెల్లం అవుతోంది.
ఇక సీఆర్డీఏ అధికారులు సహా ఇతర అధికార యంత్రాంగం విదేశీ యాత్రలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. దీంతో రాష్ట్రానికి ప్రయోజనం కలిగితే తప్ప విదేశీ యాత్రలకు అనుమతించేదిలేదని సీఎస్ స్పష్టం చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం విదేశీ యాత్రల కోసం ప్రత్యేకంగా ఆర్థికాభివృద్ధి మండలిని ఏర్పాటుచేశారు. విదేశీ పర్యటనలు, రోడ్ షోల నిర్వహణకు బడ్జెట్‌లో రూ.62కోట్లను కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment