మిర్యాలగూడ, న్యూస్‌లైన్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సిమెంట్ కొరత ఏర్పడింది. నెలరోజులుగా లబ్ధిదారులకు సిమెంట్ ఇవ్వకపోవడంతో ఇంటి నిర్మాణాలు నిలిచిపోయాయి. అధికారులు పాత ధరల ప్రకారం లబ్ధిదారులకు ఒక సిమెంట్ బస్తాకు రూ.184 చెల్లిస్తున్నారు. కానీ బహిరంగ మార్కెట్‌లో బస్తా సిమెంట్ రూ.280 పలుకుతున్నది. దీంతో ఒక బస్తాకే రూ.96 భారం లబ్ధిదారుడిపై పడుతున్నది. దీనివల్ల సిమెంట్ కొనుగోలుకు నిరాసక్తత చూపడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆగి పోయాయి. ఒక్కో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి 60బస్తాల సిమెంట్ ఇవ్వాల్సి ఉంది.
కేవలం సిమెంట్ కొనుగోలు చేయడానికే అదనంగా రూ.ఆరు వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోవడం లేవని లబ్ధిదారులు ఆందోళన చెందుతుండగా.. ప్రభుత్వం సిమెంట్ ఇవ్వకుండా డబ్బులు ఇవ్వడంతో లబ్ధిదారులపై మరింత భారం పడుతున్నది. జిల్లాలోని 15 సబ్ డివిజన్ల పరిధిలోని 15స్టాక్ పాయింట్ల ద్వారా సిమెంట్ సరఫరా చేయాల్సి ఉన్నా, నెల రోజులుగా అవి మూతపడి ఉన్నాయి.
మూడు విడతల్లో...
జిల్లావ్యాప్తంగా మూడు విడతలుగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 2,83,511మందిని ఎంపిక చేశారు. వాటిలో ఇప్పటి వరకు కేవలం 1,42,781మంది లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకోగా 64,883మంది నిర్మాణాలే ప్రారంభించలేదు. మొదటి విడతలో 89,622మందిని అర్హులుగా గుర్తించగా, వారిలో ఇప్పటివరకు 6752 మంది నిర్మాణాలు ప్రారంభించలేదు. రెండో విడతలో 1,12,699ఇళ్లు మంజూరుకాగా 29,592 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించలేదు. మూడో విడతలో 81,190మందిని ఎంపిక చేయగా ఇప్పటివరకు 28,539మంది ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేదు.
భారమైన నిర్మాణ ఖర్చులు
ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకోవడానికి జీఓ 44 ప్రకారం పట్టణ ప్రాంతాలలో ఒక లబ్ధిదారుడికి 80 వేల రూపాయలు, ఎస్సీలకు అదనంగా రూ. 25వేలు, ఎస్సీలకు అదనంగా 20వేల రూపాయలు చెల్లిస్తున్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో లబ్ధిదారుడికి రూ.70 వేలు చెల్లిస్తుండగా, ఎస్టీలకు అదనంగా రూ.25 వేలు, ఎస్సీలకు అదనంగా 20 వేల రూపాయలు చెల్లిస్తున్నారు. కాగా ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్క బస్తా సిమెంట్ రూ.280, ఇనుముకు క్వింటా రూ.4100 కాగా ఒక రాయికి రూ.8 నుంచి 10 రూపాయలు, ఇసుక ట్రాక్టర్‌కు రూ.1500 ఉన్నాయి. అదేవిధంగా ఇళ్లు నిర్మించే కూలీ రేట్లు విపరీతంగా పెరిగాయి. దీంతో ఇంది రమ్మ ఇళ్లు పూర్తయ్యే వరకు సుమారు 1.70 లక్షల రూపాయల ఖర్చు వస్తుంది. దీంతో ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోకపోవడంతో ఇంటి నిర్మాణం భారంగా మారింది.
సిమెంట్ కొరత
Published Thu, Nov 21 2013 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 12:48 AM
Advertisement