లాకప్ నుంచి దొంగ పరారీ
Published Thu, Jan 2 2014 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
జిల్లా పోలీసుల పరువు మరోసారి మంటకలిసింది. నిత్యం నిఘా నేత్రంలో ఉండే ఏలూరు నగరంలోని పోలీస్ లాకప్ నుంచి అంతర్‌జిల్లాల దొంగ తప్పించుకుని పరారవడం సంచలనం సృష్టించింది. నరసాపురంలో పోలీస్‌స్టేషన్‌కు కన్నం వేసి పారిపోయిన దొంగల విషయాన్ని ప్రజలు మరువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం పోలీసుల పనితీరుకు అద్దం పడుతోంది.
ఏలూరు (టూటౌన్), న్యూస్‌లైన్ :ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ లాకప్‌లో ఉన్న అంతర్‌జిల్లాల దొంగ యర్రంశెట్టి రాజేష్ (కుక్కల రాజేష్) అనే నిందితుడు మంగళవారం రాత్రి కిటికీ ఊచలు వంచి పరారవడంతో జిల్లా పోలీసులు ఖంగుతిన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అక్టోబర్ 10న యర్రంశెట్టి రాజేష్, షేక్ నాగూర్‌ఖాన్ కలిసి ఏలూరు శాంతినగర్ ఐదో రోడ్డులోని డాక్టర్ వి.అనీల ఇంటిలో 90 కాసుల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. దీనిపై కేసు నమోదైంది. డిసెంబర్ 17న పోలీసులు నాగూర్‌ఖాన్‌ను అరెస్ట్ చేసి 30 కాసులను రికవరీ చేశారు.
అప్పటి నుంచి రాజేష్ కోసం గాలించారు. మూడు రోజుల క్రితం రాజేష్‌ను పోలీసులు ఏలూరులో అదుపులోకి తీసుకుని త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లోని లాకప్ గదిలో ఉంచారు. ఇతడు ఐపీసీ 299/13 కేసులో నిందితుడిగా నమోదై ఉన్నాడు. అతడిపై జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా అనేక కేసులు ఉన్నాయి. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మంగళవారం రాత్రి పోలీసులు నగరంలో అల్లర్లు జరగకుండా గస్తీ కాస్తున్నారు. త్రీటౌన్ స్టేషన్‌లో సెంట్రీగా శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన రాజేష్ లాకప్‌లోని కిటికీ ఊచలను వంచి అందులో నుంచి పారిపోయాడు. నిందితుడు పారిపోవడాన్ని చూసిన కానిస్టేబుల్ అతడిని పట్టుకునేందుకు యత్నించినప్పటికీ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు.
రాజేష్ తప్పించుకోవడం రెండోసారి!
యర్రంశెట్టి రాజేష్ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. 2012 లో ఓ దొంగతనం కేసులో రాజేష్, మరో ఇద్దరు దొంగలను త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌లో వీరిని ఉంచేందుకు స్థలం సరిపోకపోవడంతో వారిని వన్‌టౌన్ స్టేషన్‌లో ఉంచారు. అదే రోజు రాత్రి బాత్‌రూమ్‌లోని కిటీకీ ఊచలను వంచి ముగ్గురు నిందితులూ పారిపోయారు.
సీఐ, ఎస్సైల మధ్య విభేదాలే కారణమా?
రెండు నెలల నుంచి త్రీటౌన్ సీఐకి, స్థానిక ఎస్సైకి మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. అక్టోబర్ 7న విధుల్లో చేరిన సీఐ శ్రీనివాస్‌కు ఎస్సై శ్రీనివాస్‌కు పొసగడం లేదని, అనేక వివాదాలు జరుగుతున్నాయని స్టేషన్‌లోని సిబ్బందే చెబుతున్నారు. రాజేష్ పరారీకి వీరిద్దని నిర్లక్ష్యం కూడా కారణం అయి ఉండవచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేషన్ సిబ్బందిపై విచారణ చేపట్టి వారిపై తగిన చర్యలు తీసుకుంటామంటూ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఎస్పీ హరికృష్ణ పరిశీలన
అంతర్‌జిల్లాల దొంగ పరారైన త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ హరికృష్ణ బుధవారం సాయంత్రం పరిశీలించారు. లాకప్, స్టేషన్ పరిసరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అదే లాకప్‌లో ఉన్న మరో నిందితుడిని ఎస్పీ విచారించారు. అనంతరం సీఐ, ఎస్సైలను విచారిం చారు. ఏఎస్పీ చంద్రశేఖర్, ఏలూరు డీఎస్పీ సత్తిబాబు ఆయన వెంట ఉన్నారు.
Advertisement
Advertisement