సాక్షి, జి.సిగడాం: దొంగతనానికి వెళ్లిన ఇద్దరు దొంగల్లో ఒకరు ప్రాణాలకు మీదకు కొనితెచ్చుకున్నాడు. గ్రామస్తులు వీరిని వెంబడించడంతో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. నడుము విరిగిపోవడంతో లేవలేని పరిస్థితిలో అందులోనే ఉండిపోయాడు. మూడు రోజులపాటు నరకయాతన అనుభవించాడు. ఈ క్రమంలో అరుపులు విన్న కొంతమంది రైతులు గుర్తించి రక్షించారు. మండలంలోని ముషినివలస పంచాయతీ కొప్పలపేట గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి ఈ గ్రామంలోకి ఇద్దరు దొంగలు చొరబడ్డారు. దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తిం చిన గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. వారిని పట్టుకునేందుకు వెళ్లడంతో అలజడిని గుర్తించిన దొంగలు పరుగులు తీశారు. గ్రామస్తులు వెంబడించి వారిలో ఒక దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇదేక్రమంలో తప్పిం చుకున్న మరో దొంగ కంగారులో నీరులేని బావిని గుర్తించక ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఈ విషయం తెలియక దొంగ తప్పించుకున్నాడని ప్రజలు భావించారు. ఎత్తు నుంచి బావిలో పడిపోవడంతో ఆ దొంగ నడుము విరిగిపోయింది. దీంతో బావిలో నుంచి బయటకు రాలేక మూడు రోజులపాటు నరకయాతన అనుభవించాడు. ఈ నేపథ్యంలో గురువారం అటుగా వెళ్తున్న కొంతమంది రైతులు బావిలో నుంచి అరుపులు రావడాన్ని గమనించి వెళ్లి చూశారు. బావిలో అపరస్మారక స్థితిలో వ్యక్తి పడిఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బావి వద్దకు చేరుకున్న పోలీసులు గ్రామస్తుల సహాయంతో అతడిని బయటకు తీశారు. ఈయన విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పురేయవలస గ్రామానికి చెందిన ఆదినారాయణగా పోలీసులు గుర్తించారు. అప్పటికే తీవ్రంగా గాయపడటంతో పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment