వచ్చే నెల వెచ్చాలు వచ్చేనా?
మండపేట : మూడో విడత రచ్చబండ రేషన్ కూపన్ల కాలపరిమితి ముగిసింది. కొత్త కూపన్ల జారీ లేదా శాశ్వత రేషన్ కార్డుల మంజూరుపై ప్ర భుత్వం ఇంకా నోరు మె దపడం లేదు. ఫలితంగా రానున్న నెలకు రేషన్ సరుకులు వస్తాయో, లేదోనని బడుగుజనం కలవరపడుతున్నారు. కొత్త కార్డులు ఇస్తారో లేక కూపన్లతోనే సరిపెడతారోనన్న శంకా వారిని పీడిస్తోంది.గత ప్రభుత్వ హయాంలో రచ్చబండ ద్వారా రేషన్‌కార్డులు మంజూరయ్యాయి. గత నవంబరులో నిర్వహించిన మూడో విడత రచ్చబండలో తెల్లకార్డులకు మరో 87,477 మందిని ఎంపిక చేశారు.
అంతకు ముందు రచ్చబండ రెండు విడతల్లో టీఏపీ, ఆర్‌ఏపీ కోడ్ నంబర్లతో కార్డులు జారీ చేశారు. ఆ కోడ్ నంబర్లతో తొలుత కూపన్లు, తర్వాత శాశ్వత కార్డులు మంజూరు చేశారు. ఫలితంగా లబ్ధిదారులకు రేషన్ సరుకులతో పాటు ఇతర సౌకర్యాలు పొందే వీలు కలిగింది. మూడో విడతలో 87,477 మంది లబ్ధిదారులకు డిసెంబరు నుంచి నెలకు ఒకటి చొప్పున ఏడు కూపన్లు అందజేశారు. కేవలం రేషన్ సరుకులు పొందేందుకు మాత్రమే ఈ కూపన్లు ఉపయోగపడ్డాయి. ప్రతి నెలా ఒక కూపన్ తీసుకువెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకునే వారు. శాశ్వత కార్డులు మంజూరు చేయకపోవడంతో ఈ విడత లబ్ధిదారులకు మిగిలిన సౌకర్యాలు అందని ద్రాక్షగానే మిగిలాయి.
మళ్లీ కూపన్లయినా ఇస్తారా?
గత డిసెంబరు నుంచి ఏడు నెలలకు పంపిణీ చేసిన కూపన్ల గడువు జూన్‌తో ముగుస్తోంది. రానున్న నెల నుంచి సరుకులు తెచ్చుకోవాలంటే కొత్తగా కూపన్లు ఉండాలి. అందుకోసం ఈ నెలాఖరులోగా లబ్ధిదారులకు కూపన్లు లేదా శాశ్వత కార్డులు మంజూరు చేయాలి. ఇప్పటి వరకు కూపన్లా లేక శాశ్వత కార్డులా అన్న విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు. ఈ విషయమై ఉన్నతస్థాయి నుంచి ఇంకా స్పష్టత లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో మూడో విడత రచ్చబండ లబ్ధిదారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. జూలై నుంచి సరుకులు అందుతాయే లేదోనని వారు ఆందోళన చెందుతున్నారు. తమకు యథావిధిగా సరుకులు అందించాలని, ఇతర పథకాలు పొందేందుకు వీలుగా శాశ్వత కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు.