స్మార్ట్ సిటీ టార్గెట్ రూ.600 కోట్లు
ఇదీ నగరపాలక సంస్థ ఆదాయ లక్ష్యం
ఆస్తి పన్ను ఒక్కటే రూ.200 కోట్లు వసూలు చేయాలని నిర్ణయం
నేటి నుంచి నగరంలో సర్వే పన్ను వసూళ్లలో తేడాలు గుర్తించేందుకే అంటున్న అధికారులు
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ అధికారులు ఆదాయ అన్వేషణలో నిమగ్నమయ్యారు. ఆర్థిక లోటుకు పూడ్చుకునేందుకు భారీ లక్ష్యాన్నే నిర్ణయించుకున్నారు. ‘స్మార్ట్ నగరం’ పేరుతో ప్రజల నుంచి అన్ని రకాల పన్నులను ముక్కుపిండి వసూలు చేసి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. ప్రస్తుతం ఏడాదికి వస్తున్న రూ.206 కోట్ల ఆదాయాన్ని రూ.600 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. అమాంతం రూ.394 కోట్ల ఆదాయం రాబట్టేందుకు ఆస్తి, వృత్తి, అండర్ గ్రౌండ్, పైప్‌లైన్ పన్నుల దగ్గర నుంచి అనధికారిక కట్టడాల వరకు దేనినీ వదలకుండా వసూలు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సర్వే పేరుతో నగర ప్రజలపై పన్ను పోటుకు సిద్ధమవుతున్నారు. సర్వే కోసం మూడు సర్కిళ్ల పరిధిలో 59 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. గురువారం రాత్రి కౌన్సిల్ హాల్లో కమిషనర్ జి.వీరపాండ్యన్ ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సర్వే విధివిధానాలు వివరించారు. శుక్రవారం నుంచి 15 రోజుల్లోపు సర్వే పూర్తిచేయాలని ఆదేశించారు.
‘సరి’ చేయడమేనా..!
ప్రస్తుతం ఏడాదికి రూ.74 కోట్లు ఆస్తిపన్ను వసూలవుతోంది. దీన్ని రూ.200 కోట్ల మేర వసూలు చేయాలని టార్గెట్‌గా నిర్ణయించారు. తాము ఆస్తిపన్ను పెంచడం లేదని, తేడాలను మాత్రమే సరిచేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 11 వేల ఖాళీ స్థలాల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే నగరంలో 35 వేల ఖాళీ స్థలాలు ఉన్నాయన్నది అధికారుల అంచనా. అన్ని స్థలాల నుంచి పన్ను వసూలు చేయాలని నిర్ణయించారు. వృత్తి పన్ను రూ.14 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు పెంచాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు రికార్డుల్లో లేని అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వాటర్ కనెక్షన్ల నుంచి భారీగా ఆదాయం వస్తుందని అధికారుల అంచనా వేస్తున్నారు. నగరంలో 27 వేల డేంజరస్ అండ్ అఫెన్సివ్ (డీఅండ్‌వో) ట్రేడ్ లెసైన్స్‌లు వసూలవుతుండగా, ఈ సంఖ్యను 54వేలకు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. హరికిరణ్ నగరపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో రెండు వార్డుల్లో సర్వే చేయిస్తే 74 లక్షల రూపాయల తేడాను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం టార్గెట్‌ను చేరుకోవాలంటే ఇటువంటి అవకతవకలకు చెక్ చెప్పాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
సర్వే అస్త్రం
పన్నులు వసూలు చేస్తేనే పనులు... అంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నుంచి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ వరకు గత నాలుగు నెలలుగా పన్ను పెంపు జపం చేస్తున్నారు. పన్నులు పెంచితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందనే ఉద్దేశంతో సర్వే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి నగరంలో సర్వేకు ఆదేశాలివ్వడంతో కార్పొరేషన్ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. సర్వే చేస్తే కానీ తేడాలు వెలుగుచూసే అవకాశం లేదు. రూ.600 కోట్ల లక్ష్యాన్ని ముందుగానే అధికారులు నిర్ణయించడంపై విపక్షాలు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి.
భారం కాదు
నగర పాలక సంస్థ వసూలు చేస్తున్న పన్నుల్లో తేడాలను సర్వే ద్వారా సరి చేయాలని నిర్ణయించామని, దీని వల్ల ప్రజలపై భారం పడదని కమిషనర్ జి.వీరపాండ్యన్ ‘సాక్షి’తో అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో అండర్ అసెస్‌మెంట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. పన్నులు చెల్లించని వారిని గుర్తించేందుకు ఈ సర్వే దోహదపడుతోందని ఆయన చెప్పారు.