The fiscal deficit
-
ఏం చేద్దాం..
విశాఖపట్నం: చాలా ప్రత్యామ్నాయ మార్గాలు వదిలేసి విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఏమిటంటూ వినియోగదారులు సంధించిన ప్రశ్నకు ఈపీడీసీఎల్‌లో అంతర్మథనం మొదలైంది. ఇటీవల వినియోగదారుల నుంచి వ్యతిరేకతను చూశాక ప్రతిపాదించిన మేరకు చార్జీలు పెరుగుతాయో లేదోననే అనుమానం పుట్టుకొచ్చింది. గతేడాది కూడా ఇదే విధంగా టారిఫ్‌లు ఇచ్చినా చార్జీలు పెంచకుండా పాత టారిఫ్‌నే కొనసాగిస్తూ ఏపీఈఆర్సీ నిర్ణయం ప్రకటించింది. ఈసారి కూడా అదే పునరావృతమైనా లేక ప్రతిపాదించిన స్థాయిలో చార్జీలు పెరగకపోయినా ఈపీడీసీఎల్ ఆర్థిక లోటు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సంస్థ సీఎండీ ఆర్ ముత్యాలరాజు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. వాటిపైనే రోజూ కార్పొరేట్ కార్యాలయంలో డెరైక్టర్లు, సీజీఎంలతో విస్తృతంగా చర్చిస్తున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో 52.18 లక్షల విద్యుత్ వినియోగదారులున్నారు. వీరికి విద్యుత్ సరఫరా అందించేందుకు 941 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 150181 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ,33/11కెవి సబ్స్టేషన్లు 653 ఉన్నాయి. ఇవి తరచుగా మరమ్మతులకు గురవుతుండటం వల్ల విద్యుత్ అమ్మకాలపై ప్రభావం పడుతోంది. ఫలితంగా ఫెయిల్యూర్ శాతం 4.89 నమోదయింది. ఫిబ్రవరి, మార్చి నెలలు కూడా జతకలిసే సరికి ఈ శాతం మరింత పెరుగుతుంది. ఇప్పటికే నర్శీపట్నంలో రూ.3.31 కోట్లతో ఈ పనులు పూర్తి చేసింది. 15శాతం పైబడి నష్టాలు కలిగిన 9పట్టణాల్లో ఈ పనులకు రూ.61.82 కోట్లు మంజూరు చేశారు. పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులను సీఎండీ ఆదేశించారు. అదే విధంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రూ.61.44 కోట్లతో ఈపీడీసీఎల్ పరిధిలోని 29 పట్టణాల్లో చేపట్టిన ఫీడర్ వారీగా ఎనర్జీ ఆడిట్ నివేదికలు సేకరించడం, కేంద్రీకృత వినియోగదారుల సేవాకేంద్రాల ఏర్పాటు పనులు 28 పట్టణాల్లో పూర్తికాగా విశాఖలో మార్చి 8వ తేదీ నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. సబ్స్టేషన్లపై భారం పడకుండా చేయడం ద్వారా అమ్మకాలు పెంచుకునే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ఫరఫరా కోసం రూ.25.25 కోట్ల ఖర్చుతో 430 కిలో మీటర్ల 33కెవి లైన్లు ఇంటర్ లింకింగ్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలనుకుంటున్నారు. విద్యుత్‌ను పొదుపు చేయాలని కూడా ఈపీడీసీఎల్ ప్రయత్నిస్తోంది. దాని కోసం 5స్టార్ రేటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు మాత్రమే వినియోగించనున్నారు. ప్రస్తుతం అమ్మకాల ద్వారా వస్తున్న రూ.7898.223 కోట్ల ఆదాయాన్ని ఇలాంటి విధానాల ద్వారా పెంచుకోవాలని ఈపీడీసీఎల్ భావిస్తోంది. -
వినరా సర్కారు వీరగాథ..
విశాఖపట్నం: గద్దెనెక్కి ఎనిమిది నెల లైంది.. ఆర్థిక లోటు..జీతాలు కూడా ఇవ్వలేక వందలకోట్ల మేర చెల్లిం పుల నిలిపివేత.. ప్రజలకు మాత్రం భ్రమలు కల్పించేందుకు ప్రభుత్వం ఆపసోపాలు పడుతున్నది. ప్రచార ఆర్భాటం కోసం ప్రజాధనం మంచినీళ్లలా ఖర్చు చే స్తోంది. ఇటీవల శ్రీకారం ప్ర చార కళాజాతాలే నిదర్శనం. రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో అ వగాహన కల్పించడమే ల క్ష్యంగా సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన రాష్ర్ట వ్యాప్తంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం జిల్లాకు మూడు ప్రచార రథాలను కేటాయించారు. రథం ప్రతీరోజు రెండు గ్రామాలను సందర్శిస్తుంది. ఈ రథంపై ముగ్గురు నుంచి ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక సాంస్కృతిక బృందాలు గ్రామకూడళ్లలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేస్తారు. ప్రదర్శనకు రూ.13వేల చొప్పున చెల్లిస్తు న్నారు. ఈమొత్తంలోనే వాహనం అద్దె, ఆయిల్‌తో పాటు కళాబృందాలకు ప్రదర్శనకు రూ.1800 చొప్పున చెల్లిస్తారు. జిల్లాలో ఒక వాహనానికి రోజుకు రూ.26వేల చొప్పున మూడు వాహనాలకు కలిపి రూ.78వేల చొప్పున ముట్టజెబుతున్నారు. అంటే 40 రోజుల పాటు సాగే ఈ ప్రచార జాతాకోసం ఒక్క మనజిల్లాలోనే రూ.31.20లక్షల ఖర్చు చేస్తు న్నారు. మన రాష్ర్టంలో ఈ కార్యక్రమం కోసం అక్షరాల రూ.4కోట్ల ఐదు లక్షల 60వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వాహనాల కాంట్రాక్టు నుంచి సాంస్కృతిక బృందాల ఎంపిక వరకూ రాష్ర్ట స్థాయిలోనే సంబంధిత శాఖ ఉన్నతాధికారుల కన్నుసన్నల్లోనే జరిగాయని సమాచారం. టెండర్ ప్రక్రియ లేకుండానే అంతానామినేషన్ పద్ధతిలోనే అప్పగించారని చెబుతున్నారు. ఇందుకోసం భారీగానే చేతులు మారినట్టుగా ఆరోపణలు విన్పిస్తున్నాయి. మరొక పక్క గత ఎనిమిది నెలలు సర్కార్ సాధించేంది ఏమీలేదని ప్రజలే పెదవి విరుస్తున్నారు. పింఛన్ల పెంపు మినహా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనిఅమలుచేసిన పాపాన పోలేదు. అలాంట ప్పుడు ఏం సాధించారని ఈ ప్రచారం చేసుకుంటున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. సమాచార పౌరసంబంధాల శాఖకు జిల్లా స్థాయిలో కనీసం ప్రోటోకాల్ కాదు కదా.. కనీసం అధికారులు తిరిగే వాహనాలకు ఆయిల్ ఖర్చులకు కూడా నిధులు మంజూరు చేయని దుస్థితి నెలకొంది. .ఇప్పటికైనా లేనిపోని ప్రచార ఆర్భాటాలకు స్వస్తి చెప్పి నిధుల లభ్యతకనుగుణంగా కేటాయింపులు..ఖర్చులు చేస్తే బాగుంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. -
స్మార్ట్ సిటీ టార్గెట్ రూ.600 కోట్లు
ఇదీ నగరపాలక సంస్థ ఆదాయ లక్ష్యం ఆస్తి పన్ను ఒక్కటే రూ.200 కోట్లు వసూలు చేయాలని నిర్ణయం నేటి నుంచి నగరంలో సర్వే పన్ను వసూళ్లలో తేడాలు గుర్తించేందుకే అంటున్న అధికారులు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ అధికారులు ఆదాయ అన్వేషణలో నిమగ్నమయ్యారు. ఆర్థిక లోటుకు పూడ్చుకునేందుకు భారీ లక్ష్యాన్నే నిర్ణయించుకున్నారు. ‘స్మార్ట్ నగరం’ పేరుతో ప్రజల నుంచి అన్ని రకాల పన్నులను ముక్కుపిండి వసూలు చేసి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. ప్రస్తుతం ఏడాదికి వస్తున్న రూ.206 కోట్ల ఆదాయాన్ని రూ.600 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. అమాంతం రూ.394 కోట్ల ఆదాయం రాబట్టేందుకు ఆస్తి, వృత్తి, అండర్ గ్రౌండ్, పైప్‌లైన్ పన్నుల దగ్గర నుంచి అనధికారిక కట్టడాల వరకు దేనినీ వదలకుండా వసూలు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే సర్వే పేరుతో నగర ప్రజలపై పన్ను పోటుకు సిద్ధమవుతున్నారు. సర్వే కోసం మూడు సర్కిళ్ల పరిధిలో 59 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. గురువారం రాత్రి కౌన్సిల్ హాల్లో కమిషనర్ జి.వీరపాండ్యన్ ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సర్వే విధివిధానాలు వివరించారు. శుక్రవారం నుంచి 15 రోజుల్లోపు సర్వే పూర్తిచేయాలని ఆదేశించారు. ‘సరి’ చేయడమేనా..! ప్రస్తుతం ఏడాదికి రూ.74 కోట్లు ఆస్తిపన్ను వసూలవుతోంది. దీన్ని రూ.200 కోట్ల మేర వసూలు చేయాలని టార్గెట్‌గా నిర్ణయించారు. తాము ఆస్తిపన్ను పెంచడం లేదని, తేడాలను మాత్రమే సరిచేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 11 వేల ఖాళీ స్థలాల నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు. అయితే నగరంలో 35 వేల ఖాళీ స్థలాలు ఉన్నాయన్నది అధికారుల అంచనా. అన్ని స్థలాల నుంచి పన్ను వసూలు చేయాలని నిర్ణయించారు. వృత్తి పన్ను రూ.14 కోట్ల నుంచి రూ. 40 కోట్లకు పెంచాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు రికార్డుల్లో లేని అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వాటర్ కనెక్షన్ల నుంచి భారీగా ఆదాయం వస్తుందని అధికారుల అంచనా వేస్తున్నారు. నగరంలో 27 వేల డేంజరస్ అండ్ అఫెన్సివ్ (డీఅండ్‌వో) ట్రేడ్ లెసైన్స్‌లు వసూలవుతుండగా, ఈ సంఖ్యను 54వేలకు పెంచాలని అధికారులు భావిస్తున్నారు. హరికిరణ్ నగరపాలక సంస్థ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో రెండు వార్డుల్లో సర్వే చేయిస్తే 74 లక్షల రూపాయల తేడాను అధికారులు గుర్తించారు. ప్రస్తుతం టార్గెట్‌ను చేరుకోవాలంటే ఇటువంటి అవకతవకలకు చెక్ చెప్పాల్సి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సర్వే అస్త్రం పన్నులు వసూలు చేస్తేనే పనులు... అంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నుంచి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ వరకు గత నాలుగు నెలలుగా పన్ను పెంపు జపం చేస్తున్నారు. పన్నులు పెంచితే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందనే ఉద్దేశంతో సర్వే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి నగరంలో సర్వేకు ఆదేశాలివ్వడంతో కార్పొరేషన్ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. సర్వే చేస్తే కానీ తేడాలు వెలుగుచూసే అవకాశం లేదు. రూ.600 కోట్ల లక్ష్యాన్ని ముందుగానే అధికారులు నిర్ణయించడంపై విపక్షాలు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి. భారం కాదు నగర పాలక సంస్థ వసూలు చేస్తున్న పన్నుల్లో తేడాలను సర్వే ద్వారా సరి చేయాలని నిర్ణయించామని, దీని వల్ల ప్రజలపై భారం పడదని కమిషనర్ జి.వీరపాండ్యన్ ‘సాక్షి’తో అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో అండర్ అసెస్మెంట్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. పన్నులు చెల్లించని వారిని గుర్తించేందుకు ఈ సర్వే దోహదపడుతోందని ఆయన చెప్పారు.