
ఫీజు ఘనం.. బోధన దైవాదీనం
♦ అర్హతలేని ఉపాధ్యాయులతో బోధన
♦ తల్లిదండ్రులపై తీవ్రభారం
♦ ఇదీ ప్రైవేటు స్కూళ్ల పరిస్థితి
♦ చోద్యం చూస్తున్న అధికారులు
నెల్లూరు (టౌన్) : గ్లోబల్, టెక్నో, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఈ-టెక్నో, ఐఐటీ పేర్లతో కార్పొరేట్ సంస్థలు తల్లిదండ్రుల జేబులకు చిల్లుపెడుతున్నాయి. ప్రచార ఆర్భాటం తప్ప విద్యాబోధనలో పస ఉండటం లేదు. వేలాది రూపాయలు వసూలు చేస్తున్నా అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నాయి. అర్హత కలిగిన టీచర్లను నియమించుకోవాలన్న నిబంధనను యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. కార్పొరేట్ విద్యాసంస్థలు యథేచ్చగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా విద్యాశాఖ అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి కారణంగా ముడుపులేననే ఆరోపణలున్నాయి.
గుర్తింపు లేదు : జిల్లావ్యాప్తంగా 450కు పైగా కార్పొరేట్ విద్యాసంస్థలు ఉన్నట్లు అధికారుల అంచనా. ఒక్క నెల్లూరులోనే సుమారు 250కు పైగా కార్పొరేట్ పాఠశాలలున్నాయి. వీటిలో 150 కి మాత్రమే విద్యాశాఖ గుర్తింపు ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సమయంలో విద్యాశాఖ అధికారులు గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటనలు ఇస్తున్నారే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కార్పొరేట్‌లో బోధించేందుకు అర్హత కలిగిన టీచర్లు 25 శాతానికి మించిలేరని తెలుస్తోంది.
పది, ఇంటర్ చదివిన వారిని ఉపాధ్యాయులుగా నియమించి బోధన చేయిస్తున్నారు. అనర్హులైన టీచర్ల విషయం బయటపడకుండా ఉండేందుకు రెండు రిజిస్టర్లు వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. విద్యాశాఖాధికారులకు మాత్రం అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్న రిజిష్టర్‌ను చూపుతున్నారని, పాఠశాలలో ఒరిజినల్ రిజిష్టర్ పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
అధిక మొత్తంలో ఫీజులు : సాధారణ ప్రైవేటు పాఠశాలలు గ్లోబల్, టెక్నో తదితర పేర్లు పెట్టి రూ.20వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్ ఫీజు పేరుతో స్కూల్‌ను బట్టి రూ.5 వేలు నుంచి రూ.25 వేల వరకు తీసుకుంటున్నారు. అప్లికేషన్ ఫీజు రూ.300ల నుంచి రూ.1000 లాగుతున్నాయి. కొన్ని స్కూళ్లు ట్యూషన్ ఫీజు, బుక్స్‌కు వసూలు చేస్తోంటే, మరికొన్ని బుక్స్ కోసం ప్రత్యేకంగా రూ.5 నుంచి 10వేల వరకు లాగుతున్నాయి. ఇంకా స్పోర్ట్స్ ఫీజుని రూ.1,500లు, ఇతర కార్యక్రమాల కోసం రూ.1,000లు, స్కూలు యానివర్సిడే పేరుతో రూ.1,500 లు దండుకుంటున్నారు. ఇలా రకరకాల ఫీజులతో త ల్లిదండ్రులకు తడి సి మోపెడవుతుంది.
సంఖ్యకు మించి బోధన
పాఠశాలలో 40 మంది విద్యార్థులకు ఒక టీచర్‌ను నియమించాలన్న నిబంధనను యాజమాన్యాలు తుంగలో తొక్కుతున్నా యి. ఒక్కో క్లాసులో 60 మందికి పైగా విద్యార్థులను కూర్చోబెట్టి బోధన చేయిస్తున్నారు.
తనిఖీచేయాలని ఆదేశించాం: -ఆంజనేయులు, డీఈఓ
జిల్లాలోని కార్పొరేట్ విద్యాసంస్థలను తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. అర్హతలేని ఉపాధ్యాయుల ఉన్న పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం. ఈవిషయంపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేయలేదు.