- రహస్య వివాహానికి సాయం చేసినందుకే విద్యార్థిని ఆత్మహత్య
- స్నేహితురాలి వేదన తీర్చలేదన్న బాధతో అఘాయిత్యం
- పోలీసుల అనుమానాలు
సాగర్‌నగర్: స్నేహితురాలి రహస్య వివాహానికి చేసిన సాక్షి సంతకమే ఆమె ప్రాణాలు తీసింది. ఓ ప్రేమ జంటకు సాయం చేసిన ప్రయత్నం చివరకు ఆమె ఆత్మహత్యకు దారి తీసింది. పార్వతి అనే విద్యార్థిని ఆత్మహత్య వెనుక ఆమె స్నేహితురాలు అనూష రహస్య వివాహమే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూడో వార్డు పరిధి పెదగదిలిలో విద్యార్థిని ఎం.పార్వతి (19) శనివారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్న విషయం విదితమే.
ఈ కేసుపై ఆరిలోవ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో ఆదివారం కొన్ని కీలక విషయూలను పోలీసులు వెల్లడించారు. సీఐ సీహెచ్ ధనుంజయ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎస్సీ కంప్యూటర్స్ చదువుతున్న పార్వతి, అనూష, సునీత స్నేహితులు. వారు తరచూ మద్దిలపాలెం నుంచి పెదగదిలిలో ఉంటున్న రామిరెడ్డి వద్దకు సందేహాల నివృ త్తి కోసం వస్తుండేవారు. మాచర్ల ప్రాంతం ధర్మవరానికి చెందిన రామిరెడ్డి నగరంలో ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అనూష, రామిరెడ్డి మధ్య ప్రేమ చిగురించింది. సుమారు రెండు నెలల క్రితం వారిద్దరూ రహస్యంగా రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో వారి వివాహానికి పార్వతి సాక్షి సంతకం పెట్టింది. రిజిస్ట్రేషన్ పత్రాలు రామిరెడ్డి వద్ద ఉన్నాయి. కొద్ది రోజులుగా రామిరెడ్డికి, అనూషకు మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో రెండు రోజులుగా రామిరెడ్డి ఎక్కడికో వెళ్లిపోయి సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు.
దీంతో రామిరెడ్డి వద్ద ఉన్న వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకురావాలని, సాక్షి సంతకం పెట్టినందుకు నీదే బాధ్యతని పార్వతిపై అనూష ఒత్తిడి తీసుకొచ్చింది. పార్వతి కూడా రామిరెడ్డికి ఫోన్‌చేసినా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో స్నేహితురాలికి సాయం చేయలేకపోయూనన్న మనస్తాపంతో పార్వతి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రామిరెడ్డి ఆచూకీ తెలిస్తేగాని అసలు విషయం బయటపడదని, అతని ఆచూకీ త్వరలో కనుగొంటామని సీఐ తెలిపారు.