భువనగిరి, న్యూస్‌లైన్ : భువనగిరి- చిట్యాల రోడ్డు.. ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. వేలాదిమంది ప్రయాణించే ఈ రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారింది. రోడ్డును బాగు చేయడానికి సుమారు 4.50 కోట్ల రూపాయలు మంజూరైనా రెండేళ్ల నుంచి పనులు సాగుతూనే ఉన్నాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజూ వివిధ డిపోలకు చెందిన 34 బస్సులు, వేలాది వాహనాలు భువనగిరి- నల్లగొండ మధ్య ప్రయాణిస్తున్నాయి. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి స్టేషన్ నుంచి వలిగొండ మండలం టేకులసోమారం, వలిగొండ మండ లకేంద్రం, కమ్మగూడెం నుంచి బోగా రం వరకు, రామన్నపేట అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డు దారుణంగా దెబ్బతిన్నది. ఈ ప్రాంతాల్లోని రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులు భయపడుతున్నారు.
ముందుకు సాగని పనులు
భువనగిరి నుంచి చిట్యాల వరకు 40కిలోమీటర్ల రోడ్డు దారుణంగా దెబ్బతిన్నది. సింగిల్ రోడ్డుతో వాహనదారులు, ప్రయాణికులు పడుతున్న అవస్థలు తీర్చడానికి జనవరి 2012లో టెండర్లు పూర్తిచేసి అగ్రిమెంట్ ఇచ్చారు. రెండు బిట్లుగా చేసి 11కిలోమీటర్ల పనికోసం రూ.3.20 కోట్లు కేటాయించారు. పది నెలల్లో పూర్తి కావాల్సిన ఈ పనులు రెండు సంవత్సరాల దాకా కొనసాగాయి. టేకుల సోమారం నుంచి మరో 7 కిలోమీటర్ల పనులకు రూ.2 కోట్లు కేటాయించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. ఇందులో భువనగిరి నుంచి నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్ వరకు పనులు పూర్తికాగా ఇంకా 1.6 కిలోమీటర్ల రోడ్డు పని పెండింగ్‌లో ఉంది. ఇక్కడ రోడ్డుపై పాదాచారులు కూడా నడవలేనంతగా గుంతలు పడ్డాయి. ఈ ప్రాంతంలో రాత్రివేళ వచ్చే ద్విచక్రవాహనదారులు కిందపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే కమ్మగూడెం నుంచి ఇంద్రపాలనగరం వరకు ఉన్న రోడ్డు కూడా దెబ్బతిన్నది.
వలిగొండలో మరీ దారుణం
మండల కేంద్రమైన వలిగొండలో రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. గ్రామంలో పూర్తిగా పాడైన రోడ్డును సీసీ చేయడానికి వెట్‌మిక్సింగ్ వేశారు. ఇది జరిగి నెల రోజులు దాటుతున్నా సీసీ చేయకపోవడంతో రోడ్డంతా రాళ్లమయంగా మారింది. దీనికితోడు విపరీతమైన దుమ్ము లేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. దుమ్ముతో రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. అలాగే రామన్నపేటలో అంబేద్కర్ విగ్రహ ం వద్ద రోడ్డు పెద్ద గుంతను తలపిస్తోంది. ఇక్కడ రోడ్డును బాగు చేయాలని ఎన్నిసార్లు కోరినా అధికారుల్లో స్పందన లేదు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పనులు సకాలంలో పూర్తి కావడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
చేసిన పనుల్లో నాణ్యత లోపం
ప్రస్తుతం ఉన్న రోడ్డును వెడల్పు చేయడంతోపాటు, పలుచోట్ల కల్వర్టులు పెంచారు. వీటిని ఐదున్నర మీటర్ల నుంచి 7 మీటర్లకు పెంచారు. ఇందులో భాగంగా రెండు వైపులా రోడ్డును వెడల్పు చేసి సైడ్‌బర్మ్‌లు మరో మూడు మీటర్లు వేయాలి. కానీ, చాలాచోట్ల సైడ్‌బర్మ్‌లు మీటరు ఎత్తులో కూడా లేవు. మొక్కుబడిగా మిషన్‌లతో పనులు చేయించి ఎక్కడికక్కడ వదిలేశారు. కల్వర్టుల నిర్మాణంలో నాణ్యతకూ తిలోదకాలిచ్చారు.
దుమ్ము, గుంతలతో ఇబ్బందులు పడుతున్నాం
వలిగొండ మండల కేంద్రంలో 20రోజుల క్రితం రోడ్డు గుంతలు పూడ్చడానికి కంకర, మట్టి పోశారు. దానిపై తారు వేయకపోవడంతో విపరీతంగా దుమ్ము వస్తుంది. భారీ వాహనాల వెనుక పోలేక పోతున్నాం. కమ్మగూడెం, తుమ్మలగూడెం మధ్య రోడ్డు గుంతలుగా మారింది. చిన్న వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు.
- గంధమల్ల నరేష్, వలిగొండ
ఈ రోడ్డంటే.. హడల్
Published Sat, Dec 14 2013 4:17 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement