Bavanagiri
-
విషాదం నింపిన అనుమానం
భువనగిరి, న్యూస్‌లైన్ : చెల్లెలిపై అనుమానంతో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఓ కుటుంబంలో ముగ్గురిని బలిగొంది. ఫోన్లో ఎవరితో మాట్లాడావో చెప్పమంటూ చెల్లెలిపై ఆగ్రహించిన అన్న కుటుంబ సభ్యులపై కిరోసిన్ పోసిన నిప్పంటించిన సంఘటన శుక్రవారం భువనగిరిలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో కిరోసిన్ మంటల్లో కాలినగాయాలతో చికిత్సపొందుతున్న కుమారుడు కిరణ్ శనివారం మృతిచెందగా, తల్లీ కూతురు ఇందిరమ్మ, కీర్తి ఆదివారం తెల్లవారు జామున మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.భువనగిరి పట్టణంలోని బహార్‌పేటకు చెందిన చెలిమాల లక్ష్మయ్య తాపీపని చేస్తూ జీవనంసాగిస్తున్నాడు. భార్య ఇందిరమ్మ భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది. కుమారుడు కిరణ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కూతురు కీర్తి రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లోని మదర్‌థెరిస్సా కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం కీర్తి ఇంట్లో ఉన్న సమయంలో సెల్ఫోన్లో ఎవరితోనో మాట్లాడింది. అప్పుడు ఇంట్లోనే ఉన్న అన్న కిరణ్.. ఎవరితో మాట్లాడావంటూ తన చెల్లెల్ని నిలదీశాడు. దీంతో అన్నా చెల్లెలి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆ సమయంలో చెల్లెలిపై చేయి చేసుకున్నాడు. ఈ విషయంలో తల్లి వచ్చి కొడుకును మందలించడంతో గొడవపెద్దదైంది. ఎన్ని సార్లు చెప్పినా ఫోన్ మాట్లాడడం ఆపడంలేదని ఆగ్రహించిన కిరణ్ ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను చెల్లెలు, తల్లి, తండ్రిపై పోశాడు. తరాత తనపై కూడా పోసుకున్నాడు. వెంటనే సోదరికి నిప్పటించాడు. మంటలు పెద్ద ఎత్తున లేవడంతో ఆమె మంటలకు తాళలేక సోదరుడిని పట్టుకుంది. దీంతో నలుగురు మంటలపాలయ్యారు. వీరిలోముగ్గురు 80 శాతం కాలిన గాయాలతో సికింద్రాబాద్ గాాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు. తండ్రిమాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డాడు. బంగారు నగలే కారణమా? ఈ సంఘటనలో కీర్తి తులం బంగారు గొలుసు, బుట్టాలు ప్రేమించిన వ్యక్తికి ఇచ్చినట్లు తెలుస్తోంది. బంగారు నగలను మరో వ్యక్తికి ఎలా ఇచ్చావన్న విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. ఆ నగలు కూడా మరో సోదరివి కావడంతో ఆమె భర్త నగల కోసం బావమరిదిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో రహస్యంగా నగలు ఎవరికి ఇచ్చావంటూ పలుమార్లు చెల్లెలిని ప్రశ్నించినప్పటికి ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవడంతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం కూడా ఇందుకోసమే గొడవ జరిగి ఆది ఆవేశంగా మారి కిరోసిన్ పోసే స్థాయికి చేరినట్లు సమాచారం. -
మామిడి పూతకు మంచు దెబ్బ
భువనగిరి/నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్: విపరీతంగా కురుస్తున్న మంచు దెబ్బకు మామిడి పూత రాలుతోంది. దీంతో ఈ ఏడాది దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా కోదాడ -1300 హెక్టార్లు, బి.రామారం- 567, భువనగిరి-560, ఆలేరు- 397, ఆత్మకూర్ (ఎం) -377, పెన్‌పహాడ్, చౌటుప్పల్-300, సూర్యాపేట-242 హెక్టార్లు, ఇతర మండలాల్లో కొద్దిమేర మామిడి తోటలున్నాయి. తక్కువ నీటితో దీర్ఘకాలికంగా రాబడిని కల్పించుకోవచ్చనే ఆలోచనతో వేసిన తోటలతో ఏటేటా నష్టం వాటిల్లుతోంది. పూత పూసే సమయంలో మంచుతాకిడి, కాత చేతికొచ్చే సమయంలో వడగండ్ల వానలు పడి రైతులను కోలుకోకుండా దెబ్బతీస్తున్నాయి. కొన్ని చెట్లకు పూత వచ్చి నల్లబడి రాలిపోతుండడం, కొన్నింటికి పూత అసలే రాకపోవడం, మరికొన్నింటికి అరకొరగా పూత రావడంతో పరిస్థితి ఏమిటో అర్థం కాక మామిడి రైతులు దిగాలు చెందుతున్నారు. జనవరి 15లోపే పూత రావాలి.. సాధారణంగా డిసెంబర్ 15 నుంచి జనవరి 15లోపు మామిడి పూర్తిగా పూత రావాల్సి ఉంది. ఇప్పటికే 35శాతం తోటలో మామిడిపూత పూసింది. మంచుకారణంగా రాలిపోతోంది. ఒగురులున్న తోటల్లో మాత్రం పూత రాలేదు. బంగెనపల్లి రకం తోటలో పూత కనిపిస్తుండగా కోతమామిడి రకం తోటల్లో మాత్రం అంత ఆశాజనకంగా లేదు. సస్యరక్షణ చర్యలు తెలియక.. రైతులు సాగు చేసిన తోటలు పూత రావడానికి ముందు వ్యాపారులకు లీజుకు ఇస్తారు. వారు పెట్టుబడులు పెట్టి అధిక దిగుబడులు పొందాలనే ప్రయత్నం చేస్తుంటారు. పొగమంచు బారినుంచి తోటలను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు తెలియక రైతులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఏ ఒక్క అధికారి కూడా మామిడితోట దిగుబడిపై సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించిన దాఖలాలే లేవని రైతులు వాపోతున్నారు. దిగుబడి ఇలా.. ఒక్కో ఎకరానికి 2 నుంచి 3 టన్నుల దిగుబడి వస్తుంది. గత సీజన్లో టన్నుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల ధర పలికింది. 15 సంవత్సరాలు దాటిన మామిడి చెట్లకు ఎకరానికి రూ.25 వేల ఖర్చు వస్తుండగా, 5 సంవత్సరాలు దాటిన తోటకు రూ.10 వేల ఖర్చు వస్తుంది. అంతా సవ్యంగా సాగి దిగుబడి వస్తే లాభసాటిగానే ఉంటుంది. కానీ మంచు. చీడ పీడలు, రోగాలు, ఈదురుగాలులు, వడగండ్ల వానలతో మామిడి రైతులు తీవ్రంగా దెబ్బతింటున్నారు. పూత రాలకుండా ఇలా... పూత రాలకుండా 4.5 ఎంఎల్ ప్లానోపిక్స్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సహజంగా మామిడిలో 10-15శాతం పూత రాలుతుంది. ఈ సీజన్లో తేనెమంచు పురుగు పూతపై తెల్లటిసోనను వదులుతుంది. తేనెమంచు పురుగు నిరోధానికి కార్బరిల్ 3 గ్రామాలకు లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయాలి. పూమొగ్గలు వచ్చే ముందు మల్టికె పిచికారీ చేస్తే పూతబలంగా వస్తుంది. పూత దశలో నీళ్లు కట్టవద్దు. అధికంగా ఎరువులను వాడవద్దు. -
ఈ రోడ్డంటే.. హడల్
భువనగిరి, న్యూస్‌లైన్ : భువనగిరి- చిట్యాల రోడ్డు.. ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. వేలాదిమంది ప్రయాణించే ఈ రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారింది. రోడ్డును బాగు చేయడానికి సుమారు 4.50 కోట్ల రూపాయలు మంజూరైనా రెండేళ్ల నుంచి పనులు సాగుతూనే ఉన్నాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజూ వివిధ డిపోలకు చెందిన 34 బస్సులు, వేలాది వాహనాలు భువనగిరి- నల్లగొండ మధ్య ప్రయాణిస్తున్నాయి. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి స్టేషన్ నుంచి వలిగొండ మండలం టేకులసోమారం, వలిగొండ మండ లకేంద్రం, కమ్మగూడెం నుంచి బోగా రం వరకు, రామన్నపేట అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డు దారుణంగా దెబ్బతిన్నది. ఈ ప్రాంతాల్లోని రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులు భయపడుతున్నారు. ముందుకు సాగని పనులు భువనగిరి నుంచి చిట్యాల వరకు 40కిలోమీటర్ల రోడ్డు దారుణంగా దెబ్బతిన్నది. సింగిల్ రోడ్డుతో వాహనదారులు, ప్రయాణికులు పడుతున్న అవస్థలు తీర్చడానికి జనవరి 2012లో టెండర్లు పూర్తిచేసి అగ్రిమెంట్ ఇచ్చారు. రెండు బిట్లుగా చేసి 11కిలోమీటర్ల పనికోసం రూ.3.20 కోట్లు కేటాయించారు. పది నెలల్లో పూర్తి కావాల్సిన ఈ పనులు రెండు సంవత్సరాల దాకా కొనసాగాయి. టేకుల సోమారం నుంచి మరో 7 కిలోమీటర్ల పనులకు రూ.2 కోట్లు కేటాయించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. ఇందులో భువనగిరి నుంచి నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్ వరకు పనులు పూర్తికాగా ఇంకా 1.6 కిలోమీటర్ల రోడ్డు పని పెండింగ్‌లో ఉంది. ఇక్కడ రోడ్డుపై పాదాచారులు కూడా నడవలేనంతగా గుంతలు పడ్డాయి. ఈ ప్రాంతంలో రాత్రివేళ వచ్చే ద్విచక్రవాహనదారులు కిందపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే కమ్మగూడెం నుంచి ఇంద్రపాలనగరం వరకు ఉన్న రోడ్డు కూడా దెబ్బతిన్నది. వలిగొండలో మరీ దారుణం మండల కేంద్రమైన వలిగొండలో రోడ్డు పరిస్థితి దారుణంగా ఉంది. గ్రామంలో పూర్తిగా పాడైన రోడ్డును సీసీ చేయడానికి వెట్మిక్సింగ్ వేశారు. ఇది జరిగి నెల రోజులు దాటుతున్నా సీసీ చేయకపోవడంతో రోడ్డంతా రాళ్లమయంగా మారింది. దీనికితోడు విపరీతమైన దుమ్ము లేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. దుమ్ముతో రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. అలాగే రామన్నపేటలో అంబేద్కర్ విగ్రహ ం వద్ద రోడ్డు పెద్ద గుంతను తలపిస్తోంది. ఇక్కడ రోడ్డును బాగు చేయాలని ఎన్నిసార్లు కోరినా అధికారుల్లో స్పందన లేదు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పనులు సకాలంలో పూర్తి కావడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. చేసిన పనుల్లో నాణ్యత లోపం ప్రస్తుతం ఉన్న రోడ్డును వెడల్పు చేయడంతోపాటు, పలుచోట్ల కల్వర్టులు పెంచారు. వీటిని ఐదున్నర మీటర్ల నుంచి 7 మీటర్లకు పెంచారు. ఇందులో భాగంగా రెండు వైపులా రోడ్డును వెడల్పు చేసి సైడ్‌బర్మ్‌లు మరో మూడు మీటర్లు వేయాలి. కానీ, చాలాచోట్ల సైడ్‌బర్మ్‌లు మీటరు ఎత్తులో కూడా లేవు. మొక్కుబడిగా మిషన్లతో పనులు చేయించి ఎక్కడికక్కడ వదిలేశారు. కల్వర్టుల నిర్మాణంలో నాణ్యతకూ తిలోదకాలిచ్చారు. దుమ్ము, గుంతలతో ఇబ్బందులు పడుతున్నాం వలిగొండ మండల కేంద్రంలో 20రోజుల క్రితం రోడ్డు గుంతలు పూడ్చడానికి కంకర, మట్టి పోశారు. దానిపై తారు వేయకపోవడంతో విపరీతంగా దుమ్ము వస్తుంది. భారీ వాహనాల వెనుక పోలేక పోతున్నాం. కమ్మగూడెం, తుమ్మలగూడెం మధ్య రోడ్డు గుంతలుగా మారింది. చిన్న వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. - గంధమల్ల నరేష్, వలిగొండ -
చేతులెత్తేసిన సీసీఐ
భువనగిరి, న్యూస్‌లైన్ : వరుస వర్షాలతో పత్తిరైతు పరేషాన్ అవుతున్నాడు. జిల్లాలో పండిన పత్తిని కొనేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ముందుకు రాకపోవడంతో దళారులు రాజ్యం ఏలుతున్నారు. ఇటీవల కాలంలో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో పత్తి రంగు మారింది. దీనిని ఆసరాగా తీసుకున్న సీసీఐ.. కొనుగోళ్లను నిలిపివేసింది. దీంతో పండిన పత్తిని ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారు తేమ ఎక్కువగా ఉందని క్వింటాల్ పత్తిని రూ.3500 కు మించి కొనడం లేదు. మద్దతు ధర వచ్చే వరకు నిల్వ చేసుకుందామన్న రైతులకు గోదాంలు అందుబాటులో లేవు. వచ్చినకాడికి వచ్చిందిలే అనుకుంటూ దళారులు ఇచ్చిన ధరకే అమ్ముకుంటున్నారు. దీనికి తోడు స్పిన్నింగ్ మిల్లుల వద్ద కూడా పత్తి కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు కూడా పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నారు. నవంబర్ వరకు రాలేమన్న సీసీఐ సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు కావాల్సిన పత్తి కొనుగోలు కేంద్రాలు నవంబర్ రెండో వారంలో ఏర్పాటు చేస్తామని తేల్చిచెప్పారు. ఇటీవల భువనగిరికి వచ్చిన సీసీఐ అధికారులు ఏరియల్ సర్వే నిర్వహించి నవంబర్ నుంచి పత్తిని కొనుగోలు చేస్తామని జిల్లా అధికారులకు చెప్పారు. దీంతో ప్రభుత్వరంగ సంస్థల కొనగోలు మరో 15 రోజుల పాటు లేనట్లేనని తెలుస్తోంది. ఉన్నతాధికారులు. మంత్రులు కార్యరంగంలోకి దిగితే తప్పా పత్తిరైతుల కష్టాలు తీరే పరిస్థితి కనిపించడం లేదు. తేమ పేరుతో రేటులో కోత వర్షాలు పడుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. పంట కోసే సమయంలో కురుస్తున్న వర్షాలతో పత్తిలో తేమ 20శాతానికి మించి ఉంటుందని రేటు తగ్గించేశారు. సీజన్ ప్రారంభంలో రూ.4200 చెల్లించి కొనుగోలు చేసిన పత్తిని ప్రస్తుతం రూ.3500కు తగ్గించారు. మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. వ్యాపారులది మరో రకం ఇబ్బంది రైతుల వద్ద పత్తిని కొనుగోలు చేస్తున్న వ్యా పారులు ఆ పత్తిని అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. వరంగల్ జిల్లా జనగామలో నాలుగు పత్తి మిల్లులు, భువనగిరిలోని పత్తి మిల్లు సక్రమంగా పత్తిని కొనుగోలు చేయడం లేదు. కరీంనగర్ జిల్లా జ మ్మికుంటలో కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తిని నిల్వ చేసుకునే గోదాం సౌకర్యం లేక రైతుల వద్ద కొనుగోళ్లు నిలిపివేశారు. మిల్లులో కొనుగోలు చేస్తే తప్పా తాము కొనుగోలు చేయలేమంటున్నారు. నష్టం తప్పేలా లేదు - సిద్ధిరాములు, ఆలేరు నాలుగెకరాల్లో పత్తి సాగు చేశాను. పెట్టుబడులు, కూళ్లు విపరీతంగా పెరిగాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పత్తిలో తడి ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో పత్తిని కొనుగోలు చేయమంటే తేమ ఎక్కువగా ఉంది తక్కువ ధరకు ఇవ్వమంటున్నారు. ఏం చేయాలో తోచడం లేదు. ఈ సారి నష్టం తప్పేట్లు లేదు. -
పాల్వాయివి మతి స్థిమితం లేని మాటలు
భువనగిరి, న్యూస్‌లైన్ : రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి మతి స్థిమితం కోల్పోయి తనపై విమర్శలు చేస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. తాను భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పిలాయిపల్లి కాల్వద్వారా మూసీ జలాలను అందిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్ కాలువ పనులను వదిలివెళ్లినప్పటికీ ఏనాడూ పట్టించుకోని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి.. తాను చేసిన పనులను విమర్శించడం తగదన్నారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేవలం విమర్శలతోనే కాలం గడిపుతున్నారని పేర్కొన్నారు. ఏడు సంవత్సరాలుగా పూర్తి కాని కాల్వను, త్వరగా పూర్తి చేయడానికి తాను రెండు సంవత్సరాల కాలం పాటుపడినట్లు తెలిపారు. ఇందుకోసం 6.7 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. కాల్వ పనుల్లో అక్కడక్కడా ఏవైనా మరమ్మతులు వస్తే అధికారులు వాటిని సరి చేయిస్తారని పేర్కొన్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పెద్దదిగా చేసి ఆరోపణలు చేయడం ద్వారా పబ్బం గడుపుకోవాలని పాల్వాయి చేస్తున్నారని ఆరోపించారు. పిలాయిపల్లి కాలువ ద్వారా పోచంపల్లి, చౌటుప్పల్ మండలాలతో పాటు మునుగోడు నియోజకవర్గాల రైతులకు సాగు నీరు అందుతుందన్నారు. ఈ ప్రాంతాల్లో చెరువులను కూడా నింపుతున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు.