భువనగిరి, న్యూస్‌లైన్ : చెల్లెలిపై అనుమానంతో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఓ కుటుంబంలో ముగ్గురిని బలిగొంది. ఫోన్లో ఎవరితో మాట్లాడావో చెప్పమంటూ చెల్లెలిపై ఆగ్రహించిన అన్న కుటుంబ సభ్యులపై కిరోసిన్ పోసిన నిప్పంటించిన సంఘటన శుక్రవారం భువనగిరిలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
ఈ ఘటనలో కిరోసిన్ మంటల్లో కాలినగాయాలతో చికిత్సపొందుతున్న కుమారుడు కిరణ్ శనివారం మృతిచెందగా, తల్లీ కూతురు ఇందిరమ్మ, కీర్తి ఆదివారం తెల్లవారు జామున మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.భువనగిరి పట్టణంలోని బహార్‌పేటకు చెందిన చెలిమాల లక్ష్మయ్య తాపీపని చేస్తూ జీవనంసాగిస్తున్నాడు. భార్య ఇందిరమ్మ భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది. కుమారుడు కిరణ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కూతురు కీర్తి రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్‌లోని మదర్‌థెరిస్సా కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. శుక్రవారం మధ్యాహ్నం కీర్తి ఇంట్లో ఉన్న సమయంలో సెల్‌ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడింది. అప్పుడు ఇంట్లోనే ఉన్న అన్న కిరణ్.. ఎవరితో మాట్లాడావంటూ తన చెల్లెల్ని నిలదీశాడు. దీంతో అన్నా చెల్లెలి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది.
ఆ సమయంలో చెల్లెలిపై చేయి చేసుకున్నాడు. ఈ విషయంలో తల్లి వచ్చి కొడుకును మందలించడంతో గొడవపెద్దదైంది. ఎన్ని సార్లు చెప్పినా ఫోన్ మాట్లాడడం ఆపడంలేదని ఆగ్రహించిన కిరణ్ ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను చెల్లెలు, తల్లి, తండ్రిపై పోశాడు. తరాత తనపై కూడా పోసుకున్నాడు. వెంటనే సోదరికి నిప్పటించాడు. మంటలు పెద్ద ఎత్తున లేవడంతో ఆమె మంటలకు తాళలేక సోదరుడిని పట్టుకుంది. దీంతో నలుగురు మంటలపాలయ్యారు. వీరిలోముగ్గురు 80 శాతం కాలిన గాయాలతో సికింద్రాబాద్ గాాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయారు. తండ్రిమాత్రం స్వల్పగాయాలతో బయటపడ్డాడు.
బంగారు నగలే కారణమా?
ఈ సంఘటనలో కీర్తి తులం బంగారు గొలుసు, బుట్టాలు ప్రేమించిన వ్యక్తికి ఇచ్చినట్లు తెలుస్తోంది. బంగారు నగలను మరో వ్యక్తికి ఎలా ఇచ్చావన్న విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. ఆ నగలు కూడా మరో సోదరివి కావడంతో ఆమె భర్త నగల కోసం బావమరిదిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో రహస్యంగా నగలు ఎవరికి ఇచ్చావంటూ పలుమార్లు చెల్లెలిని ప్రశ్నించినప్పటికి ఆమె నుంచి సరైన సమాధానం రాకపోవడంతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం కూడా ఇందుకోసమే గొడవ జరిగి ఆది ఆవేశంగా మారి కిరోసిన్ పోసే స్థాయికి చేరినట్లు సమాచారం.
విషాదం నింపిన అనుమానం
Published Mon, Feb 24 2014 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 4:01 AM
Advertisement