భువనగిరి/నల్లగొండ రూరల్, న్యూస్‌లైన్: విపరీతంగా కురుస్తున్న మంచు దెబ్బకు మామిడి పూత రాలుతోంది. దీంతో ఈ ఏడాది దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా కోదాడ -1300 హెక్టార్లు, బి.రామారం- 567, భువనగిరి-560, ఆలేరు- 397, ఆత్మకూర్ (ఎం) -377, పెన్‌పహాడ్, చౌటుప్పల్-300, సూర్యాపేట-242 హెక్టార్లు, ఇతర మండలాల్లో కొద్దిమేర మామిడి తోటలున్నాయి.
తక్కువ నీటితో దీర్ఘకాలికంగా రాబడిని కల్పించుకోవచ్చనే ఆలోచనతో వేసిన తోటలతో ఏటేటా నష్టం వాటిల్లుతోంది. పూత పూసే సమయంలో మంచుతాకిడి, కాత చేతికొచ్చే సమయంలో వడగండ్ల వానలు పడి రైతులను కోలుకోకుండా దెబ్బతీస్తున్నాయి. కొన్ని చెట్లకు పూత వచ్చి నల్లబడి రాలిపోతుండడం, కొన్నింటికి పూత అసలే రాకపోవడం, మరికొన్నింటికి అరకొరగా పూత రావడంతో పరిస్థితి ఏమిటో అర్థం కాక మామిడి రైతులు దిగాలు చెందుతున్నారు.
జనవరి 15లోపే పూత రావాలి..
సాధారణంగా డిసెంబర్ 15 నుంచి జనవరి 15లోపు మామిడి పూర్తిగా పూత రావాల్సి ఉంది.
ఇప్పటికే 35శాతం తోటలో మామిడిపూత పూసింది. మంచుకారణంగా రాలిపోతోంది. ఒగురులున్న తోటల్లో మాత్రం పూత రాలేదు. బంగెనపల్లి రకం తోటలో పూత కనిపిస్తుండగా కోతమామిడి రకం తోటల్లో మాత్రం అంత ఆశాజనకంగా లేదు.
సస్యరక్షణ చర్యలు తెలియక..
రైతులు సాగు చేసిన తోటలు పూత రావడానికి ముందు వ్యాపారులకు లీజుకు ఇస్తారు. వారు పెట్టుబడులు పెట్టి అధిక దిగుబడులు పొందాలనే ప్రయత్నం చేస్తుంటారు. పొగమంచు బారినుంచి తోటలను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు తెలియక రైతులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఏ ఒక్క అధికారి కూడా మామిడితోట దిగుబడిపై సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించిన దాఖలాలే లేవని రైతులు వాపోతున్నారు.
దిగుబడి ఇలా..
ఒక్కో ఎకరానికి 2 నుంచి 3 టన్నుల దిగుబడి వస్తుంది. గత సీజన్‌లో టన్నుకు రూ.15 వేల నుంచి రూ.20 వేల ధర పలికింది. 15 సంవత్సరాలు దాటిన మామిడి చెట్లకు ఎకరానికి రూ.25 వేల ఖర్చు వస్తుండగా, 5 సంవత్సరాలు దాటిన తోటకు రూ.10 వేల ఖర్చు వస్తుంది. అంతా సవ్యంగా సాగి దిగుబడి వస్తే లాభసాటిగానే ఉంటుంది. కానీ మంచు. చీడ పీడలు, రోగాలు, ఈదురుగాలులు, వడగండ్ల వానలతో మామిడి రైతులు తీవ్రంగా దెబ్బతింటున్నారు.
పూత రాలకుండా ఇలా...
పూత రాలకుండా 4.5 ఎంఎల్ ప్లానోపిక్స్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
సహజంగా మామిడిలో 10-15శాతం పూత రాలుతుంది.
ఈ సీజన్‌లో తేనెమంచు పురుగు పూతపై తెల్లటిసోనను వదులుతుంది.
తేనెమంచు పురుగు నిరోధానికి కార్బరిల్ 3 గ్రామాలకు లీటర్ నీటిని కలిపి పిచికారీ చేయాలి.
పూమొగ్గలు వచ్చే ముందు మల్టికె పిచికారీ చేస్తే పూతబలంగా వస్తుంది.
పూత దశలో నీళ్లు కట్టవద్దు.
అధికంగా ఎరువులను వాడవద్దు.
మామిడి పూతకు మంచు దెబ్బ
Published Sun, Jan 26 2014 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM
Advertisement