ఆత్మకూరు: ‘గత 30 ఏళ్లుగా తమ రాజకీయ ప్రత్యర్థులకు ఎవరితో అయినా తగాదాలు ఉంటే వాళ్లను చేరదీసుకొని రాజకీయ ప్రత్యర్థులను హత్య చేయించడమన్నది పరిటాల కుటుంబానికి వెన్నతోపెట్టిన విద్య.. పరిటాల కుటుంబం ఫ్యాక్షన్ కుటుంబమని సినిమాలే తీశారు. గ్రామాల్లో ఆధిపత్యం కోసం వర్గ పోరు రాజేసి రాజకీయ హత్యలు చేయిస్తున్నారు. ప్రస్తుతం మాకు మండలంలో పట్టు తగ్గుతుందన్న భయంతో కేశవరెడ్డిని హతమార్చారు. మండలంలో టీడీపీ ఇన్‌చార్జ్ బాలాజీకి తెలియకుండా ఏ పని జరగదు. కనీసం పింఛన్, లోన్, ఇళ్లు వంటి ఏ పనులూ జరగవు. కానీ ఈ హత్య బాలాజీకి తెలియకుండా జరిగిందంటే ప్రజలు నమ్ముతారా?’ అని వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ ఆత్మకూరు మండల సీనియర్ నాయకులు కేశవరెడ్డి(67)బుధవారం దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. గురువారం కేశవరెడ్డి అంత్యక్రియలు పూర్తయిన అనంతరం ప్రకాష్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడారు. కేశవరెడ్డి ఒకసారి సర్పంచుగా, మరోసారి సింగల్‌విండో ప్రసిడెంట్‌గా ఉండి మండల ప్రజలకు ఎనలేని సేవలను అందించారన్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక బలమైన నాయకుడు, అందరికీ అండగా ఉన్న వ్యక్తిని హత్య గావించడం వెనుక రాజకీయ కోణం ఉందని కేశవరెడ్డి బంధువులు, అభిమానులు చెబుతున్నారన్నారు. మంత్రి సునీత సోదరుడు, టీడీపీ మండల ఇన్‌చార్జ్ బాలాజీ హస్తంతోనే కేశవరెడ్డితో విభేదాలు ఉన్న నరసింహారెడ్డి చేత హత్య చేయించారని ఆరోపించారు. గతంలో ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డి హత్య వెనుక మంత్రి కుటుంబం ప్రోత్సాహం ఉందని, ఆ విషయం ప్రసాద్‌రెడ్డి సోదరుడు చెప్పినా పట్టించుకోలేదన్నారు. కందుకూరు శివారెడ్డి, తగరకుంట కొండారెడ్డి హత్య వెనుక మంత్రి హస్తం ఉందని మృతుల బంధువులు ఆరోపించినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. నియోజకవర్గంలో అధికార పార్టీ చెప్పుచేతుల్లో అధికార యంత్రాంగం నడుస్తోందని, ఎనిమిదేళ్లుగా ఎలాంటి సమస్యలు లేవని, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆత్మకూరులో ఈ హత్య జరగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన రోజే ఈ హత్య జరిగినా ఆయన స్పందించకపొవడం హత్య రాజకీయాలకు పోత్సహించేలా ఉందని ప్రకాష్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కేశవరెడ్డి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు.
ప్రజాదరణ పొందిన వ్యక్తి కేశవరెడ్డి
కేశవరెడ్డి 30 ఏళ్లుగా కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలో ప్రజలకు ఎనలేని సేవలను అందించారు. ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణ, రాజకీయ ఎదుగదలను చూసి ఓర్వలేక ఈ హత్య చేయించారు. కేవలం టీడీపీకి అడ్డుగా ఉంటాడని ఈ హత్య చేసి వైఎస్సార్‌సీపీకి మంచి నాయకుడిని దూరం చేశారు.
-తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి
ఇది ప్రభుత్వ హత్యే
ఎప్పటికప్పుడు సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి చేరుతుంది. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కేశవరెడ్డిది ప్రభుత్వ హత్యగానే భావించాలి. హత్యలు చేయడం ద్వారా అందర్ని భయబ్రాంతులకు గురి చేసి ఎన్నికల్లో లబ్ది పొందాలనుకోవడం మూర్ఖత్వం. బాధితులు తప్పు చేసిన వారు పేర్ల ఫిర్యాదులో తెలిపినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకొకపోవడం అన్యాయం.’ -వెన్నపూస గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ
మంత్రి సునీతకు ప్రకాష్‌రెడ్డి ప్రశ్నలు
అనంతపురం: కేశవరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైఎస్సార్‌సీపీ రాప్తాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గురువారం మంత్రి పరిటాల సునీతకు పలు ప్రశ్నలు సంధించారు. నాలుగేళ్లలో జరిగిన హత్యలు, ఇతర ఘటనలపై ఆయన మంత్రిని నిలదీశారు. ప్రశ్నల పర్వం ఇలా..
- కేశవరెడ్డి హత్య కేసులో అధికారులకు ఆదేశిలిచ్చామని మంత్రి చెబుతున్నారు. బహుశా ఆమె ఆదేశాలతోనే హతుడి మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఫిర్యాదులో మీ సోదరుడు బాలాజీ పేరు తొలగించాలంటూ పోలీసులు మృతుడి బంధువులపై ఒత్తిడి తేలేదా?. ప్రజలు తిరగబడితే పోస్టుమార్టం చేయించారు. ఇదేనేమో మంత్రి గారి ఒత్తిడి.
- స్వయంగా హతుడు కేశవరెడ్డి భార్య తన ఫిర్యాదులో మీ సోదరుడు బాలాజీ పేరు పెడితే ఈరోజు ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు లేదు? ఇదేనా మంత్రి ఆదేశం. మీ తమ్ముడిని తప్పించేందుకే సాయంత్రం ఆరు గంటలకే ముద్దాయిని సరెండర్ చేయించారు. అతడిచ్చిన వాంగ్మూలం మేరకే బాలాజీ పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేకుండా చేశామంటూ క్రియేట్ చేయడం వాస్తవం కాదా?
- అనంతపురం రూరల్ పిల్లిగుండ్లకాలనీలో ధనుంజయయాదవ్‌కి ఈడిగ వెంకటేష్ మధ్య వ్యక్తిగత కక్షలే. మీ దగ్గర వెంకటేష్ ఉండి, మావద్ద‡ ధనుంజయయాదవ్ ఉన్నంత వరకు అతడిపై హత్యాయత్నాలు జరిగాయన్నారు. ధనుంజయయాదవ్ భయపడి మీ దగ్గరికి వస్తే ఇప్పుడు వారిద్దరూ ఒకే బండిపై తిరగడం లేదా?
- ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డి, ఉప్పెర శ్రీనివాసులుకు కూడా వ్యక్తిగత కక్షలేనని మీరే వారిద్దరని రాజీ చేయలేదా? మీకు రాజకీయంగా నష్టం జరగనంతవరకు వారికి ఇబ్బంది లేదు. రాజకీయంగా అడ్డుపడతాని భావించినప్పుడు ప్రసాద్‌రెడ్డిని హత్య చేయించారు. ఈరోజు మళ్లీ శ్రీనివాసులు తదితరులకు రాజకీయ పదవులిచ్చి మీదగ్గర ఉంచుకున్నారు.
- కందుకూరు శివారెడ్డివి కూడా వ్యక్తిగత కక్షలే. ప్రత్యర్థులు మిమ్మల్ని కలవడం మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే బాలకృష్ణ తదితరులు హత్య చేశారు. ఈరోజు వారిని మీ వద్దే ఉంచుకోవడం వాస్తం కాదా?
- తగరకుంట కొండారెడ్డిది రాజకీయ హత్యే. ఆయనను తుద ముట్టించకపోతే రాజకీయ ంగా ఇబ్బంది తప్పదనే హత్య చేయించారు.
- ఆత్మకూరు కేశవరెడ్డి హత్య వెనుక వ్యక్తిగత కక్షలే కారణం అంటున్నారు. 8 ఏళ్లుగా కేశవరెడ్డి, నరసింహారెడ్డి కుటుంబాలు అనేక కార్యక్రమాల్లో కలిసే పాల్గొన్నాయి. మొన్నటిదాకా తటస్థంగా ఉన్న కేశవరెడ్డి ఇటీవల వైఎస్సార్‌సీపీలో బలంగా ఎదుగుతున్నాడు. తీరా ఎన్నికల ముందు ఎందుకు చంపారు?. నరసింహారెడ్డి ఒక్కడే ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకోలేడనే విషయం మండలమంతా కోడై కూస్తోంది.
- ఈరోజు అధికారం అడ్డుపెట్టుకుని ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ధర్మం, న్యాయం ప్రజలకు తెలుస్తుందనే విషయం మంత్రి గుర్తు పెట్టుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment